శుక్రవారం 27 నవంబర్ 2020
Rangareddy - Aug 26, 2020 , 00:24:54

ఎక్కడుందో కనిపెట్టేస్తాం

ఎక్కడుందో కనిపెట్టేస్తాం

ఏం చేస్తుందో తెలిసేలా అనుసంధానం

నిరంతరం పర్యవేక్షణ..  ఫాగింగ్‌ ఆపరేషన్‌లో పారదర్శకత 

యంత్రాల ట్రాకింగ్‌, ప్రొడక్టివిటీ టెక్నాలజీ ఇన్ఫర్మేషన్‌ ఆఫ్‌ థింగ్స్‌ పరికరాలు అమరిక

ఎల్బీనగర్‌: ఎక్కడున్నా ఇట్టే తెలిసిపోతుంది. ఎంత మేర చేసిందో.. ఎక్కడ ఆగింది.. ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించిందనే పూర్తి సమాచారం తెలియపరుస్తుంది. ఆ మరుసటి రోజు ఎంత మేర డీజిల్‌ కేటాయించాలో సులువుగా తెలిసేలా జీహెచ్‌ఎంసీ వ్యాప్తంగా ఫాగింగ్‌ నిర్వహణలో పారదర్శకత తీసుకొచ్చారు అధికారులు. ఫాగింగ్‌ యంత్రాలకు ట్రాకింగ్‌, ప్రొడక్టివిటీ టెక్నాలజీ ఇన్ఫర్మేషన్‌ ఆఫ్‌ థింగ్స్‌ పరికరాలు అమర్చి నిరంతరం ఫాగింగ్‌ నిర్వహణను పర్యవేక్షిస్తున్నారు. జోన్ల వారీగా ఫాగింగ్‌ మెషీన్‌ ఆపరేటర్లకు శిక్షణ ఇచ్చి అందుకనుగుణంగా కార్యక్రమాలు రూపొందించారు. ప్రస్తుతం అన్ని జోన్లలో ఫాగింగ్‌ మెషీన్లకు ట్రాకింగ్‌, ప్రొడక్టివిటీ టెక్నాలజీ పరికరాలను అమర్చి నిర్వహణ చేపడుతున్నారు. ఎల్బీనగర్‌ జోన్‌ పరిధిలోని కాప్రా, ఉప్పల్‌, హయత్‌నగర్‌, ఎల్బీనగర్‌, సరూర్‌నగర్‌ ఐదు సర్కిళ్లకు కలిపి జోనల్‌ కార్యాలయంలో ఇటీవలే సమావేశం నిర్వహించారు. జోనల్‌ కమిషనర్‌ ఉపేందర్‌రెడ్డి, చీఫ్‌ ఎంటమాలజిస్ట్‌ రాంబాబు, సీనియర్‌ ఎంటమాలజిస్ట్‌ రజిని ఆధ్వర్యంలో ఐదు సర్కిళ్ల సిబ్బందికి పూర్తిస్థాయిలో శిక్షణ ఇచ్చి వాటిని అమలు చేస్తున్నారు. ఎల్బీనగర్‌ జోన్‌లోని 10వెహికిల్‌ మౌంటెడ్‌ ఫాగింగ్‌, 3 ఫోర్టబుల్‌ ఫాగింగ్‌ మెషీన్లకు ఐఓటీ(ఇన్ఫర్మేషన్‌ ఆఫ్‌ టెక్నాలజీ డివైజ్‌)లను అమర్చారు. తెలంగాణ మస్కిటో ఎరాడికేషన్‌ డిజిటల్‌ సొల్యూషన్‌ మొబైల్‌ యాప్‌ను ఉపయోగించే విధానంపై కూడా శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమం సుమారు 20 రోజులుగా కొనసాగుతున్నది. అంతేకాదు సదరు వాహనానికి ఎంత డీజిల్‌ ఇచ్చారు... ఎన్ని కిలోమీటర్లు తిరిగి ఫాగింగ్‌ చేపట్టిందనే విషయం తెలిసేలా యాప్‌లో వివరాలు పొందుపర్చుతున్నారు. 

ఫాగింగ్‌లో పారదర్శకత తెస్తున్నాం 

ఫాగింగ్‌ ఆపరేషన్‌లో పారదర్శకతను తీసుకొస్తు న్నాం. జోన్‌లోని ఐదు సర్కిళ్లలో మెషీన్ల ట్రాకింగ్‌, ప్రొడక్టివిటీ టెక్నాలజీ ఇన్ఫర్మేషన్‌ ఆఫ్‌ థింగ్స్‌ పరికరాల నిర్వహణ, పనితీరు మెరుగుపై ఆపరేటర్లకు అవగాహ నిర్వహించాం. తెలంగాణ మస్కిటో ఎరాడికేషన్‌ డిజిటల్‌ సొల్యూషన్‌ మొబైల్‌ యాప్‌ను ఎలా ఉపయోగించాలో తెలిపాం.     - ఉపేందర్‌రెడ్డి, జడ్సీ

పక్బందీగా పర్యవేక్షణ

అన్ని జోన్లలో ఫాగింగ్‌ ఆపరేషన్‌లో పారదర్శకత తెస్తున్నాం. ఎల్బీనగర్‌ జోన్‌లోని 10వెహికిల్‌ మౌంటెడ్‌ ఫాగింగ్‌, 3 పోర్టబుల్‌ ఫాగింగ్‌ మెషీన్లకు ఐఓటీలను అమర్చారు. వీటి పనితీరును 20 రోజులుగా పర్యవేక్షిస్తున్నాం. ఏ ప్రాంతానికి ఫాగింగ్‌ మెషీన్‌ వెళ్లింది, ఎంతదూరం తిరిగిందనే సమాచారం కార్యాలయం నుంచే తెలుస్తుంది.                        - రజిని, సీనియర్‌ ఎంటమాలజిస్ట్‌