వికారాబాద్ జిల్లాలో బీఆర్ఎస్లోకి వలస జోరు కొనసాగుతున్నది. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీజేపీ, కాంగ్రెస్ తదితర పార్టీల నేతలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. జిల్లా మంత్రి సబితారెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, మహేశ్‌రెడ్డి, రోహిత్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి సమక్షంలో వేల సంఖ్యలో ప్రతిపక్ష పార్టీల నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్కు కంచుకోటగా ఉన్న జిల్లా వరుస చేరికలతో గులాబీ పార్టీ బలగం, బలం మరింత పెరుగుతున్నది. చిన్నపాటి కార్యకర్తల నుంచి ప్రధాన నాయకుల వరకు ప్రతి ఒక్కరూ బీఆర్ఎస్లోకి క్యూ కడుతున్నారు. భారీ చేరికలతో బీఆర్ఎస్ పార్టీ తిరుగులేని శక్తిగా అవతరిస్తుండగా.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఖాళీ అవుతూ కనుమరుగవుతున్నాయి. ప్రజలందరూ బీఆర్ఎస్వైపే ఉన్నారని, మరోసారి జిల్లాలో విజయఢంకా మోగించడం ఖాయమనే చర్చ జరుగుతున్నది.
వికారాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): ఓ వైపు తొమ్మిదేండ్ల పాలనలో కనీవినీ ఎరుగని రీతి లో జరిగిన అభివృద్ధి…మరోవైపు దేశంలోనే ఎక్కడాలేని విధంగా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలుతో సబ్బండ వర్ణాలు సీఎం కేసీఆర్‌కు జై కొడుతున్నారు. ఇప్పటికే జిల్లాలో కంచుకోటగా మారిన బీఆర్ఎస్ పార్టీ వివిధ పార్టీ ల నాయకులు, కార్యకర్తల చేరికతో మరింత బలోపేతమవుతున్నది. అటు రాష్ట్రంలోగానీ.. జిల్లాలోనూ కాంగ్రెస్, బీజేపీతోపాటు ఇతర పార్టీలకు కా లం చెల్లినట్లేనని గ్రహించిన ప్రజలు అధికార పార్టీవైపే ఆకర్షితులవుతున్నారు. ప్రధానంగా వికారాబాద్, కొడంగల్, పరిగి, తాండూరు నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున ప్రజలు, నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారు. వికారాబాద్ నియోజకవర్గం లో బీఆర్ఎస్ పార్టీ మరింత బలంగా మారింది. స్థానిక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ పార్టీని గ్రామస్థాయి నుంచే పటి ష్టం చేస్తున్నారు. అంతేకాకుండా పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తున్నారు.
నెల రోజులుగా ప్రతిరోజూ ఏదో ఒక పార్టీ నుంచి నియోజకవర్గంలోని ధారూరు, కోట్‌పల్లి, మర్పల్లి, మోమిన్‌పేట, వికారాబాద్ మండలాల నుంచి భారీగా ఇతర పార్టీల నుంచి నాయకులు బీఆర్ఎస్లో చేరుతుండడం గమనార్హం. బీఆర్ఎస్ పార్టీ వర్కిం గ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ దత్తత నియోజకవర్గమైన కొడంగల్‌లోనూ జరిగిన అభివృద్ధి కార్యక్రమాలతో ఇతర పార్టీల నుంచి నేతలు, కార్యకర్తలు కొడంగల్ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో భారీగా చేరుతున్నా రు. అదేవిధంగా పరిగి ఎమ్మెల్యే మహేశ్ రెడ్డి సమక్షంలోనూ ఇతర పార్టీల నుంచి కూడా నాయకులు చేరుతున్నారు. తాండూరు నియోజకవర్గాభివృద్ధికి ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి చేస్తున్న ప్రగతిని స్వయంగా చూస్తున్న ప్రజలు, నాయ కులు, కార్య కర్తలు ఇతర పార్టీలను వదిలి స్వచ్ఛందంగా బీఆర్ఎస్లో చేరుతున్నారు. మరోవైపు త్వరలోనే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన కొందరు ముఖ్యనాయకులు కూడా బీఆర్ఎస్లో చేరే అవకాశాలున్నాయి. ఆ దిశగా ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు వారి సెగ్మెంట్లలోని ఇతర పార్టీల్లోని బలమైన నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు.