వికారాబాద్, ఆగస్టు 30 : ప్రభుత్వ ఉద్యోగులు విధులకు హాజరు కావాలంటే.. రాకపోకలకు అయ్యే ఖర్చుల కోసం నిత్యం అప్పులు చేయాల్సి వస్తున్నది. 6 నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో వారి జీవితాలు దుర్భరంగా మారాయి. జీతాలు ఇవ్వకపోయినా విధులకు హాజరయ్యామని, ఇరిగేషన్ శాఖలో చెరువుల వద్ద పని చేస్తున్న (లస్కర్లు) ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత సంవత్సరం బీఆర్ఎస్ ప్రభుత్వం వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేసి.. వారిని ఆయా శాఖల్లో సర్దుబాటు చేసింది.
ఇందులో భాగంగా ఆయా శాఖల్లో ఉన్న వారికి సమయానికి జీతాలు రావడంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. ఏడాది కింద విధుల్లో చేరిన వారికి ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి నెలలకు సంబంధించిన వేతనాలు రాలేదు. ఆయా శాఖల్లో విధులు నిర్వహిస్తున్న వారికీ జీతాలు వచ్చాయి.. కానీ, మాకు మాత్రం ఎందుకు మా వేతనాలు చెల్లించడం లేదని లస్కర్లు ఆందోళన చెందుతున్నారు. వారు ప్రతి రోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చెరువుల వద్ద విధులు నిర్వర్తిస్తున్నారు.
చెరువు అంచున కలుపు మొక్కలను తొలగించడం, చెరువు కింద ఉన్న పొలాలకు నీటిని విడుదల చేయడంతో పాటు ప్రభుత్వం ఆదేశించిన పనులను వారు చేస్తుంటారు. జీతాలు రావడం లేదని ఇరిగేషన్ అధికారులకు మొరపెట్టుకున్నా ఎలాంటి ప్రయోజనం లేదని తమ గోడును వినిపించారు. చేసేదేమిలేక కన్నీళ్లు దిగమింగుకుంటూ తప్పని పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్నామని అంటున్నారు. ఒక్కోక్క లస్కరుకు రూ.80 వేల నుంచి రూ.2 లక్షల వరకు అప్పులు ఉన్నాయి. తమ సమస్యను అర్థం చేసుకుని జీతాలు చెల్లించాలని కోరుతున్నారు.
కొత్తగా టీవీఎస్ ఎక్స్ఎల్ ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేశా. ధారూరు మండలం కుమ్మరిపల్లి నుంచి వికారాబాద్ సర్పన్పల్లి ప్రాజెక్టు వద్ద విధులు నిర్వహించేందుకు నిత్యం వస్తుంటా. ప్రతి నెలా బండి ఫైనాన్స్ డబ్బులు కట్టాల్సి వస్తున్నది. గత 6 నెలలుగా జీతాలు రాకపోవడంతో కుటుంబ పోషణ కూడా భారంగా మారింది. అప్పులు చేసి బండి కిస్తులు కడుతున్నా. సుమారు రూ.80వేల వరకు అప్పు చేశా. ఇప్పటికైనా కాంగ్రెస్ పభుత్వం పెండింగ్ ఉన్న జీతాలను విడుదల చేసి మమ్మల్ని ఆదుకోవాలి.
– రామచంద్రయ్య, సర్పన్పల్లి చెరువు లస్కరు, వికారాబాద్
చెరువు పక్కల ఉన్న కలుపు మొక్కలు, గడ్డిని సైతం తొలగిస్తున్నా. చెరువు, అలుగుకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూసుకుంటున్నా. చెరువు నుంచి రైతుల పొలాలకు నీటిని విడుదల చేస్తున్నా. ఆరు నెలలుగా జీతాలు రాకపోవడం బాధగా ఉన్నది. ఊరికి దూరంగా ఉండడం వల్ల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పుడుతున్నాయి. ఇప్పటి వరకు రూ.1.20లక్షల అప్పు చేశా. జీతాలు సకాలంలో అందిస్తే నా అప్పులు తీర్చుకుంటా. కాంగ్రెస్ ప్రభుత్వం మాపై దయ చూపాలి.
– వెంకటయ్య, ధారూరు
లస్కరు విధుల్లో చేరి దాదాపుగా సంవత్సర కాలం అవుతున్నది. నిత్యం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విధులు నిర్వహిస్తున్నా. సర్పన్పల్లి చెరువు కట్టపై కలుపు మొక్కలు తొలగిస్తున్నా. రైతులకు సరిపడా నీటిని క్రమం తప్పకుండా విడుదల చేస్తున్నా. వర్షానికి తడుస్తూ.. ఎండకు ఎండుతూ.. విధులు నిర్వహిస్తున్నా. ఆరు నెలలుగా జీతాలు రాకపోవడంతో దాదాపు రూ.లక్షకు పైగా అప్పు చేసినా. అప్పులు తీసుకొని విధులకు హాజరు కావాల్సిన దుస్థితి ఏర్పడింది. మా బాధలను జర పంట్టించుకోండి సారూ..
– రామచంద్రయ్య, యావపూర్, నవాబుపేట