ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 11 : ఫార్మాసిటీ భూబాధితులకు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ఉద్యమాన్ని ఆపేదిలేదని ఫార్మాసిటీ భూ వ్యతిరేక పోరాట సమితి సమన్వయకర్త కావుల సరస్వతి, రైతులు తెలిపారు. మంగళవారం ఇబ్రహీంపట్నం ఏసీపీ కార్యాలయంలో మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి ఫార్మా భూ నిర్వాసితులతో ముఖాముఖి కార్యమ్రాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కావుల సరస్వతి మాట్లాడుతూ.. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫార్మా బాధిత గ్రామాలైన తాటిపర్తి, కుర్మిద్ద, నానక్‌నగర్, మేడిపల్లి, నక్కర్త గ్రామాల్లో పర్యటించి, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నిషేధిత జాబితాలో ఉన్న రైతుల భూములను తొలగించి యథావిధిగా అందజేస్తామని హామీ ఇచ్చారన్నారు.
ప్రస్తుత ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీతక్క, ప్రస్తుత ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, కాంగ్రెస్ నాయకుడు కోదండరెడ్డితో పాటు పలువురు గ్రామాల్లో పర్యటించినప్పుడు చెప్పిన మాటప్రకారమే తొలగించాలని కోరుతున్నామన్నారు. ఎన్నికల ముందు ఎన్నో హామీలిచ్చి నేటికీ నెరవేర్చకుండా కాలయాపన చేస్తుండడంతో బాధిత రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆమె డీసీపీ దృష్టికి తీసుకువచ్చారు. నిషేధిత జాబితాలో ఉన్న భూములకు రైతు భరోసా అందటంలేదని, అలాగే పంట రుణాలు, ఇతర మార్టిగేజ్ రుణాలు, క్రయవిక్రయాలు జరగడం లేదని ఆవేదన వెలిబుచ్చారు. రైతులకు సరైన న్యాయం చేయాలని గత కొన్నేళ్లుగా పోరాటాలు చేపడుతున్నప్పటికీ కాలయాపన చేస్తూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆమె పేర్కొన్నారు.
సమస్యల పరిష్కారానికి కృషిచేస్తా..
మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి మాట్లాడుతూ.. ఫార్మాసిటీ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు సంబంధించిన సమస్యలు పూర్తిగా తెలుసుకునేందుకే ఇబ్రహీంపట్నంలో రైతులతో సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. రైతుల సమస్యలు పూర్తిగా తెలుసుకుని పూర్తి నివేదికను రాచకొండ సీపీ సుధీర్‌బాబు సహకారంతో రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి దృష్టికి తీసుకుపోయి పరిష్కరించేందుకు కృషిచేస్తామని ఆమె తెలిపారు.
హామీలను వెంటనే నెరవేర్చాలి
గత ఎన్నికల ముందు కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని నానక్‌నగర్ మాజీ సర్పంచ్ వెంకట్‌రెడ్డి అన్నారు.. ఎన్నికల ముందు ఈ ప్రాంత నాయకుడు కోదండరెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, మంత్రులు సీతక్క, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమకుమార్‌రెడ్డి రైతులకు ఇబ్బందులు కలుగకుండా ఈ ప్రాంతంలో ఫార్మాసిటీని రద్దుచేస్తామని చెప్పి నేడు మొహం చాటేయటం సిగ్గుచేటన్నారు. వెంటనే ఫార్మాసిటీ రద్దుతో పాటు బాధిత రైతులకు సరైన న్యాయం చేయాలని కోరారు.
ఎన్ని అడ్డంకులొచ్చినా మా భూములు మాత్రం ఇవ్వం
మాకున్న అసైన్డ్‌మెంట్ భూమిని పూర్తిగా తీసుకున్నారు. పొద్దునలేస్తే కాయకష్టం చేసుకుని, భూమిని నమ్ముకుని జీవిస్తున్నాం. చిన్నప్పటి నుంచి కష్టపడి కాపాడుకున్న మాకున్న పట్టా భూములను లాక్కుంటామని బెదిరిస్తున్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా మా భూమిని మాత్రం ఇవ్వం. బలవంతంగా భూమిని లాక్కోవాలని చూస్తే ఊరుకోం.
– ఆవ గుండాలు, కుర్మిద్ద
ఈ సర్కారుపై మాకు నమ్మకంలేదు
ఇప్పుడున్న కాంగ్రెస్ సర్కారులో ఉన్న పెద్దమనుషులపై మాకు నమ్మకంలేదు. ఓట్లకు ముందు మా గ్రామంలోకి వచ్చి ఇక్కడ ఫార్మాసిటీని ఏర్పాటు చేయనివ్వం. మీ దగ్గర తీసుకున్న భూములు తిరిగి మీకే ఇప్పిస్తాం. నిషేధిత జాబితాలో చేర్చిన భూములను తొలగింపజేసి అందజేస్తామని చెప్పి నేడు ఎవరూ కనిపిస్తలేరు. ఎన్నికల ముందు ఎన్నెన్నో మాటలు చెప్పి, ఇయ్యాల ఏసీ రూంలల్ల పండుకుని నీలుగుతున్నారు.
– ఎల్లయ్య, తాటిపర్తి రైతు