జిల్లాలో ఫోర్త్సిటీకి గ్రీన్ఫీల్డ్ రోడ్డు ఏర్పాటు విషయంలో అన్నదాతల ఆక్రందనను ఎవరూ పట్టించుకోవడం లేదు. భూములను పోలీస్ నిఘా మధ్య సేకరించిన అధికారులు ఆయా భూముల్లో ఉన్న పంటల నష్టాలను అంచనా వేసే విషయంలోనూ రైతుల అభిప్రాయాలు తీసుకోవడం లేదు. ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, కందుకూరు, కడ్తాల్, ఆమనగల్లు మండలాల్లో సుమారు వెయ్యి ఎకరాలకు పైగా భూమిని గ్రీన్ఫీల్డ్ రోడ్డు కోసం అధికారులు తీసుకుంటున్నారు. కం దుకూరు మండలంలోని పంజాగూడ వద్ద ప్రభుత్వం ఫోర్త్సిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయిం చింది. దీనికి రోడ్డు కో సం కొంగరకలాన్ ఓఆర్ఆర్ నుంచి పంజాగూడ వరకు 300 అడుగుల వెడల్పు రోడ్డు, పం జాగూడ నుంచి ఆకుతోటపల్లి ట్రిపుల్ఆర్ వరకు 330 అడుగుల రోడ్డు ఏర్పాటుకు నిర్ణయించి భూమిని సేకరించి.. హద్దురాళ్లు పాతడంతో పాటు నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. ఈ విషయంపై రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేసినా వారి గోడును ఎవరూ పట్టించుకోలేదు.
– రంగారెడ్డి, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ)
ప్రభుత్వం గ్రీన్ఫీల్డ్ రోడ్డుకోసం తీసుకుంటున్న భూముల్లో ఉన్న పంటలు , బోర్లు, ఇండ్లు, షెడ్లు తదితర వాటి గుర్తింపు బుధవారం నుంచి ప్రారంభమైనది. రెవెన్యూ, ఉద్యానవన, వ్యవసాయ శాఖల అధికారుల సంయుక్తంగా ఈ పనిని ప్రారంభించారు. గుర్తింపులో భాగంగా మొదటిరోజు కొంగరకలాన్ వద్ద రైతులు అడ్డుకున్నా పోలీసుల సహకారంతో వారిని పంపించి పనిని చేపట్టారు. ఫోర్త్సిటీకోసం తీసుకుంటున్న వెయ్యి ఎకరా లు పూర్తిగా వ్యవసాయానికి సంబంధించిన భూములే. ఈ భూముల్లో పత్తి, వరి, కూరగాయలు ఇతరత్రా పంటలను సాగు చేసుకుంటూ రైతులు జీవనోపాధి పొందుతున్నారు. అయితే వాటికి పరిహారం ఇచ్చే విషయం లో రైతులను అధికారులు సంప్రదించడం లేదన్న ఆరోపణలున్నాయి.
గ్రీన్ఫీల్డ్ రోడ్డు కోసం ప్రభుత్వం సేకరిస్తున్న భూములు ఎకరానికి రూ. కోటి నుంచి రూ.10 కోట్ల వరకు ఉంటుంది. ఇబ్రహీంపట్నం, మహేశ్వ రం, కందుకూరు, కడ్తాల్ వంటి మండలాల్లో ఎకరం భూమి రూ. కోటి నుంచి రూ.ఐదు కోట్ల వరకు పలుకుతుండగా.. కొంగరకలాన్ ఓఆర్ఆర్ సమీపంలో ఎకరం రూ. కోటి వరకు బహిరంగ మార్కెట్లో ఉన్నది. అయితే ప్రభుత్వ మార్కెట్ ధర మాత్రం రూ. ఐదు నుంచి రూ. పది లక్షల వరకే ఉన్నది. కొంగరకలాన్, ఔటర్రింగ్రో డ్డు సమీపంలో బహిరంగ మార్కెట్లో ఎకరం ధర రూ. పదికోట్లు ఉండగా.. మార్కెట్ ధర రూ. పదిహేను లక్షలే. దీంతో తమకు పరిహారం ఎలా చెల్లిస్తారనే దానిపై అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. 2013 భూసేకరణ యాక్టు ద్వారా చెల్లిస్తే వారికి తీవ్ర నష్టం కలుగనున్నది. రైతులతో చర్చించి వారి డిమాండ్ మేరకు పరిహారం చెల్లిస్తారా..? అనేది ఇంకా తెలియడంలేదు.
ప్రభుత్వం సేకరిస్తున్న భూములకు ఇచ్చే పరిహారంపై అధికారులు స్పష్టత ఇవ్వకపోవడంతో బాధిత రైతులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. పరిహారం విషయం తేల్చకుండానే ప్రభుత్వం భూములు తీసుకోవడం తగద ని.. అలాగే, ఆయా భూముల్లో పంటలు, ఇతరత్రా భవనాలకూ పరిహా రం నిర్ణయించడం విషయంలోనూ రైతులను సంప్రదించటం లేదని మండిపడుతున్నారు.
ఫోర్త్సిటీకోసం ప్రభుత్వం జిల్లాలో 421 కిలోమీటర్ల మేర రోడ్డు వేయ నున్నది. ఇందుకోసం 1,008 ఎకరాలను సేకరిస్తుండడంతో 4,725 మంది రైతులు తమ భూములను కోల్పోవల్సి వస్తున్నది. ఇందులో మొ దటి విడతలో కొంగరకలాన్ నుంచి పంజాగూడ వరకు 21 కిలోమీటర్లు 300 అడుగుల వెడల్పుతో తీసుకుంటున్నారు. దీనికోసం 448 ఎకరాలను ప్రభుత్వం సేకరించింది. అలాగే, పంజాగూడ నుంచి ఆకుతోటపల్లి వరకు 21 కిలోమీటర్లు 330 అడుగులకు 554 ఎకరాలను సేకరించింది.