రంగారెడ్డి, జనవరి 10 (నమస్తే తెలంగాణ) : జిల్లా రైతులపై మరో భూసేకరణ పిడుగు పడింది. రెండో రేడియల్ రోడ్డుకోసం మరో 140 ఎకరాల సేకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయడంతో రైతులు అయోమయానికి గురవుతున్నారు. ఇప్పటికే ఫ్యూచర్‌సిటీ, గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు పేరుతో జిల్లాలో వేలాది ఎకరాలను సేకరిస్తున్నది. జిల్లాలోని ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజినల్ రింగ్‌రోడ్డు(ట్రిపులార్)ను కలుపుతూ.. కొత్తగా మరో రేడియల్ రోడ్డును ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి అవసరమైన భూమిని సేకరించేందుకు ఈనెల 7న ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది. ఓఆర్ఆర్ బుద్వేల్ సమీ పం నుంచి జాతీయ రహదారి 167ను కలుపుతూ.. నాచారం వరకు మొత్తం 81 కిలోమీటర్ల పొడవుతో ఈ రేడియల్ రోడ్డును నాలుగు
వరుసలుగా నిర్మించే బాధ్యతను ప్ర భుత్వం హెచ్ఎండీఏకు అప్పగించింది. ఇప్పటికే ప్రభుత్వం ఔటర్‌రింగ్ రోడ్డు నుంచి ట్రిపులార్‌ను అనుసంధానం చేస్తూ పలు చోట్ల రేడియల్ రోడ్లను నిర్మించాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. అందులో భాగంగానే జిల్లాలో రెండు నుంచి మూడు వరకు రేడియల్ రోడ్లు ఏర్పాటు కానున్నాయి. ఇప్పటికే ఓఆర్ఆర్ నుంచి రావిర్యాల ఎగ్జిట్ నంబర్ 13 నుంచి ఆమనగల్లు వరకు 41 కిలోమీటర్ల గ్రీన్‌ఫీల్డ్ రహదారి కోసం భూసేకరణ మొదలైంది.
ఎల్ఎంటీ రుత్విక్ కంపెనీకి ఈ పనులను ప్రభుత్వం అప్పగించింది. దీంతో ఓఆర్ఆర్ ఎగ్జిట్నంబర్ 13 నుంచి మొదటి దశ గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు మీర్ఖాన్పేట వరకు రెండో దశలో మీర్ఖాన్పేట నుంచి ఆమనగల్లు మండలంలోని ఆకుతోటపల్లి వరకు మొత్తం 41 కిలోమీటర్ల పొడవు, 300 ఫీట్ల వెడల్పు తో గ్రీన్‌ఫీల్డ్ రేడియల్రోడ్డును ఏర్పాటు చేస్తున్నారు. ఈ రోడ్డు నిర్మాణం కోసం సుమారు వెయ్యి ఎకరాల భూసేకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది. భూసేకరణకు అధికారులు గ్రామాలకు వెళ్తే రైతులు అడుగడుగునా అడ్డుకుంటున్నారు. భూసేకరణ అధికారులకు కత్తిమీద సాములా మారింది.
రెండో రేడియల్ రోడ్డు కోసం షాబాద్ మండలంలోని మాచన్‌పల్లి ప్రాంతంలో 45.5 ఎకరాలు, కొందుర్గు మండలంలోని ముట్పూరులో 95.72 ఎకరాల భూమిని సేకరించేందుకు ఈ నెల 7న నోటిఫికేషన్ జారీ అయిం ది. ఇప్పటికే అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి అవసరమైన భూములను గుర్తించగా.. భూములు కోల్పోయే రైతుల గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయి. భూసేకరణ పేరుతో జిల్లాలో రైతులకు ప్రభుత్వానికి మధ్య యు ద్ధం జరుగుతున్నది. ప్రజా అవసరాల పేరు తో ప్రభుత్వం భూసేకరణకు దిగుతుండగా.. ఉన్న భూములను పోగొట్టుకుని తాము ఎలా బతకాలని రైతులు వాపోతున్నారు.