కడ్తాల్, మే 25 : కాంగ్రెస్ ప్రభుత్వం అర్భాటంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో నిరుపేదలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని కడ్తాల్ మాజీ సర్పంచ్ లక్షీనర్సింహారెడ్డి విమర్శించారు. ఆదివారం మండల కేంద్రంలో స్థానిక నాయకులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. కడ్తాల్ గ్రామ పంచాయతీ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల కోసం 1,600 మంది నిరుపేదలు ధరఖాస్తు చేసుకుంటే కేవలం 60 మందిని మాత్రమే ఎంపిక చేసి కాంగ్రెస్ నాయకులు చేతులు దులుపుకున్నారని విమర్శించారు. ఇందిరమ్మ ఇండ్లు రాని లబ్ధిదారుల జాబితాను, దరఖాస్తుల తిరస్కరణకు కారణమైన అంశాలను గ్రామాలవారీగా గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ప్రచురించాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల ముందు ప్రకటించిన హామీలను తుంగల్లోకి తొక్కిన ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలను మభ్య పెట్టేందుకే ఇందిరమ్మ ఇండ్లు అంటూ కొత్త నాటాకానికి తెరలేపిందని ఆరోపించారు. ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో విఫలమైన రేవంత్ సర్కార్..సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే ఆఖరి స్థానానికి దిగజారిపోయిందని విమర్శించారు. పూర్తి స్థాయిలో రైతుభరోసా, రుణమాఫీ చేయకుండా అన్నదాతలను కాంగ్రెస్ ప్రభుత్వం అనేక ఇబ్బందులకు గురి చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
మహిళలకు రూ.2,500, యువతులకు స్కూటీలు, కల్యాణలక్షీ పథకంలో తులం బంగారం ఎప్పుడు ఇస్తారని ఆయన ప్రశ్నించారు.
ప్రపంచ అందాల పోటీలు నిర్వహిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం..పోటీల నిర్వాహకులు చేసిన పనులలో విసుగు చెందిన మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ పోటీలను అర్ధాతరంగా వైదొలిగి, ఆమె చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ వేదికపై తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసేలా ఉన్నాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కడ్తాల్ గ్రామాధ్యక్షుడు కడారి రామకృష్ణ, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ లాయక్అలీ, నాయకులు రామచంద్రయ్య, ఇర్షాద్, వెంకటేశ్, నాగార్జున, మహేశ్, కృష్ణ, భాస్కర్, మహేశ్నాయక్ తదితరులు పాల్గొన్నారు.