వికారాబాద్, డిసెంబర్ 13, (నమస్తే తెలంగాణ) : చేతులు కాలినాక ఆకులు పట్టుకున్న చందంగా కాంగ్రెస్ ప్రభుత్వ తీరు తయారైంది. ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో భయానక పరిస్థితుల తర్వాత దిద్దుబాటు చర్యలు చేపట్టింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గురుకులాల్లో సీటు కోసం క్యూ కట్టిన పరిస్థితులు ఉంటే.. కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలనలో హాస్టళ్ల పరిస్థితి అధ్వానంగా మారింది. ప్రస్తుతం ప్రభుత్వ గురుకులాల్లోని విద్యార్థులకు పురుగుల అన్నమే దిక్కైంది. 200 గురుకుల పాఠశాలలను వెయ్యి గురుకులాలకు పెంచి కార్పొరేట్ స్కూళ్ల స్థాయిలో కేసీఆర్ ప్రభుత్వం తీర్చిదిద్దింది. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కేజీబీవీ, మోడల్ స్కూళ్లలో భయానక పరిస్థితులు నెలకొంటున్నాయి. మెస్ చార్జీలు పెంచకపోవడంతో నాసిరకం భోజనాన్ని వడ్డిస్తుండడంతో నాలుగు రోజుల క్రితం తాండూరు ఎస్టీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ వల్ల విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. కులకచర్ల మండలం బండెల్కిచర్లలోని ఎస్టీ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్తో పది మంది అస్వస్థతకు గురయ్యారు. కులకచర్ల మోడల్ స్కూల్ విద్యార్థులు అధికారులకు తెలియకుండా బయటకు వచ్చి మరీ అక్కడ నెలకొన్న సమస్యలను వివరించడం విశేషం. పురుగుల అన్నం పెడుతున్నారని, కుళ్లిపోయిన కూరగాయలు, నెలకు ఒక్కరోజు కూడా గుడ్డు, పాలు ఇవ్వడం లేదని విద్యార్థులు మీడియాకు వెల్లడించారు.
పురుగుల బియ్యం వెనక్కి..
బీఆర్ఎస్ నేతలు హాస్టళ్ల పరిశీలనకు వెళ్తుండడంతో అక్కడున్న అధ్వాన పరిస్థితులు వెలుగులోకి రాకుండా ప్రభుత్వం అధికారులతో తనిఖీలు చేయిస్తున్నది. వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలకు కారణాలపై పరిశీలించిన అధికారులు పురుగులు పట్టిన బియ్యమే ప్రధాన కారణమని కలెక్టర్కు నివేదించినట్లు తెలిసింది. ఏడాది క్రితం సరఫరా చేసిన బియ్యాన్నే వండి పెడుతున్నట్లు తేలింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డైట్ చార్జీలే కాదు… బియ్యం కూడా సరఫరా చేయలేదనే విమర్శలు వెలువడుతున్నాయి. ఏడాది కాలంగా పురుగుల బియ్యమే వండి పెడుతున్నా అధికారులు పర్యవేక్షించకపోవడం గమనార్హం. తాండూరు ఎస్టీ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్తో సుమారు 15 మంది విద్యార్థులు అస్వస్థతకు గురి కావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో కేజీబీవీలు, మోడల్ స్కూళ్లలోని పురుగుల బియ్యాన్ని వెనక్కి తెప్పిస్తున్నారు. జిల్లాలోని 125 ప్రభుత్వ హాస్టళ్లకు ప్రతి నెలా 4500 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సరఫరా చేస్తున్నట్లు జిల్లా యంత్రాంగం తెలుపుతుండడం గమనార్హం.