పెద్దఅంబర్‌పేట, డిసెంబర్ 13 : కుంట్లూరు పెద్దఅంబర్‌పేట మున్సిపాలిటీ పరిధిలోని మేజర్ గ్రామపంచాయతీ. 18 వేలకుపైగా ఓటర్లున్నారు. ఇందులోనుంచి కల్వంచ అనే ప్రాంతాన్ని హయత్‌నగర్‌లోని ఓ డివిజన్లో కలిపారు. అయినప్పటికీ కుంట్లూరులో 15 వేలకుపైగా ఓటర్లు ఉన్నారు. జీహెచ్ఎంసీ డివిజన్ల ఏర్పాటులో భాగంగా ఇప్పుడు కుంట్లూరు పేరుతో 51వ డివిజన్ ఏర్పాటు చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఆ డివిజన్లో కుంట్లూరు గ్రామాన్నే చేర్చలేదు. ఒక్క ఓటరును కూడా ఆ డివిజన్లో వేయలేదు.
కుంట్లూరు పేరుతో ఏర్పాటైన 51వ డివిజన్లో ఇటీవలే పెద్దఅంబర్‌పేట మున్సిపాలిటీలో కలిసిన కుత్బుల్లాపూర్, గౌరెల్లి, బాచారం, తారామతిపేట మాత్రమే ఉన్నాయి. ఆ నాలుగు పంచాయతీల్లో కలిపి దాదాపు 12 వేల ఓట్లు మాత్రమే ఉన్నాయి. ఇదీ డివిజన్ పేరుకే పరిమితమైన కుంట్లూరు కథ. పేరు ప్రకటించి.. ఊరిని కలపడం మరిచిన జీహెచ్ఎంసీ అధికారుల తీరుపై స్థానికులు భగ్గుమంటున్నారు. ఇవేం లెక్కలంటూ నిలదీస్తున్నారు.
అవుటర్ రింగ్ రోడ్డు లోపలున్న మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేయడంతో పెద్దఅంబర్‌పేట కూడా అందులో చేరింది. తాజాగా కొత్త డివిజన్ల ఏర్పాటుకు హద్దులు నిర్ధారిస్తూ ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. ఇందులో 51వ డివిజన్‌గా కుంట్లూరును, 52వ డివిజన్‌గా పెద్దఅంబర్పేటను పేర్కొన్నది. కుంట్లూరు పేరుతో ఉన్న 51వ డివిజన్లో కుంట్లూరు గ్రామాన్నే చేర్చలేదు. కేవలం నాలుగు గ్రామపంచాయతీలకు సంబంధించిన దాదాపు 12 వేల పైచిలుకు ఉన్న ఓటర్లను మాత్రమే లెక్కలోకి తీసుకుని కుంట్లూరు పేరుతో డివిజన్ ఏర్పాటు చేశారు.
నాలుగు గ్రామాల విలీనానికి ముందు పెద్దఅంబర్‌పేట మున్సిపాలిటీలో 24 వార్డులుండేవి. అందులోనుంచి 2 వార్డులను హయత్‌నగర్ పరిధిలోని డివిజన్లో చేర్చారు. మరో గ్రామపంచాయతీ సాయినగర్‌ను సైతం ఇంకో డివిజన్‌లోకి మార్చారు. మిగతా 22 వార్డులకు సంబంధించి దాదాపు 55 వేల పైచిలుకు ఓటర్లను మొత్తం కలిపి పెద్దఅంబర్‌పేట పేరుతో 52వ డివిజన్‌ను ఏర్పాటు చేశారు. పక్కపక్కనే ఉన్న రెండు వార్డుల మధ్య ఓటర్ల తేడా ఇంత మొత్తం ఉండటమేంటని నాయకులు గగ్గోలుపెడుతున్నారు.
ఇటీవల విలీనం చేసిన గ్రామాలతో కలిపి పెద్దఅంబర్‌పేట మున్సిపాలిటీని మూడు డివిజన్లుగా ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు దండెం రాంరెడ్డి డిమాండ్ చేశారు. పెద్దఅంబర్‌పేట, కుంట్లూరు, తట్టిఅన్నారం పేర్లతో విభజించి డివిజన్లుగా ఏర్పాటు చేయాలన్నారు. తట్టిఅన్నారం, ఆర్కేనగర్, మర్రిపల్లి, కుత్బుల్లాపూర్, గౌరెల్లి, బాచారం గ్రామాలను కలిపి కొత్తగా డివిజన్ ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ నేత, మాజీ కౌన్సిలర్ మండల కోటేశ్వర్ డిమాండ్ చేశారు. వరుసన ఉన్న గ్రామాలను కలిపి డివిజన్ చేస్తే పాలన కూడా బాగుంటుందని పేర్కొంటున్నారు.
పెద్దఅంబర్‌పేట, పసుమాముల, తారామతిపేట, బాచారం గ్రామాలతోపాటు కుంట్లూరులోని కొంత ప్రాంతాన్ని కలిపి పెద్దఅంబర్‌పేట డివిజన్‌గా ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ నాయకులు.. ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిని కలిసి విన్నవించినట్టు తెలుస్తున్నది. కుంట్లూరులోని ఎక్కువ భాగం, తట్టిఅన్నారం, ఆర్కేనగర్, మర్రిపల్లి, కుత్బుల్లాపూర్, గౌరెల్లిని కలిపి కుంట్లూరు డివిజన్‌గా మార్చాలని విన్నవించారు. మరోవైపు ఫతుల్లాగూడ, తట్టిఅన్నారం, ఆర్కేనగర్, మర్రిపల్లి, కుత్బుల్లాపూర్, గౌరెల్లి, బాచారం గ్రామాలను కలుపుతూ కొత్తగా తట్టిఅన్నారం పేరుతో డివిజన్ ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు శనివారం జీహెచ్ఎంసీ అధికారులకు విన్నవించారు. పాత డివిజన్లపై అభ్యంతరం తెలియజేశారు.