Malakpet IT Tower | సిటీబ్యూరో, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): ఐటీ రంగం అభివృద్ధి పై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. అధికారంలోకి వచ్చినా ఐటీ రంగానికి సంబంధించిన ప్రాజెక్టుల పురోగతిని ముందుకు తీసుకెళ్లడం లేదు. ప్రైవేట్ ఐటీ కంపెనీల కార్యక్రమాల్లో తప్ప, ప్రభుత్వ పరంగా చేయాల్సిన ప్రాజెక్టులను పూర్తిగా పక్కన పెట్టారు. అందుకు నిదర్శనం మలక్‌పేట ఐటీ టవర్ నిర్మాణమే. నగరంలోని మలక్‌పేటలో గతేడాది అక్టోబర్‌లో శంకుస్థాపన చేసిన ఐటీ పార్క్ టవర్ పనులు ఒక్క అంగుళం కూడా ముందుకు కదలలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలలు అవుతున్నా, ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉంది. మలక్‌పేటలో ప్రభుత్వ ఐటీ టవర్‌ను నిర్మిస్తే వేలాది మందికి ఉద్యోగావకాశాలు వస్తాయనుకున్న వారి ఆశలన్నీ నీరుగారిపోయాయి.
దేశ ఐటీ రంగంలో బెంగుళూరు తర్వాత హైదరాబాద్ అగ్ర స్థానంలో ఉంది. ఐటీ రంగానికి దోహదం చేసేలా ప్రభుత్వ విధానాలు, అత్యంత మెరుగైన మౌలిక వసతులు కల్పిస్తే ఆ రంగం మరింత విస్తరించేందుకు అవకాశాలున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం ఐటీ రంగం అభివృద్ధికి గ్రేటర్ హైదరాబాద్‌లోనే కాకుండా ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఐటీ టవర్లను నిర్మించి, దేశ, విదేశాల నుంచి ఐటీ కంపెనీలు వచ్చేందుకు వీలుగా మౌలిక వసతులు కల్పించింది. దానివల్లే వెస్ట్ హైదరాబాద్ ఐటీ రంగం ఎంతో వేగంగా విస్తరించింది. దాన్ని అలాగే ముందుకు తీసుకెళ్లాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం ఐటీ రంగాన్ని మరింత వృద్ధి చేసేందుకు చొరవ తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
రూ.700 కోట్లతో ఐటీ టవర్…
మలక్‌పేటలో ఉన్న 11 ఎకరాల ప్రభుత్వ స్థలంలో సుమారు రూ.700 కోట్లతో ఐటీ టవర్‌ను నిర్మించేందుకు కేసీఆర్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఐటీ టవర్ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసే బాధ్యతను తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ (టీఎస్ఐఐసీ)కు అప్పగించింది. టవర్‌లో ఏకంగా 15 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐటీ కంపెనీ కార్యకలాపాలను నిర్వహించుకునేలా డిజైన్ చేశారు. ముఖ్యంగా పాత నగరమైన మలక్పేటకే పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చే ఈ ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం పక్కన పెట్టడం పై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఐటీ టవర్ నిర్మాణం నిర్లక్ష్యంపై కేటీఆర్ ట్వీట్..
ఎన్నో దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోని పాతనగరంలో ఐటీ టవర్ నిర్మించాలన్న ఆలోచనలతో గత కేసీఆర్ ప్రభుత్వం మలక్‌పేటలో ఐటీ టవర్ నిర్మించాలని ప్రతిపాదనలు రూపొందించి, నిర్మాణానికి శంకుస్థాపన చేసింది. అలాంటి ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఆయా రంగాల అభివృద్ధికి, ప్రజల మెరుగైన జీవనోపాధికి దోహదం చేసే ప్రాజెక్టులను ముందుకు తీసుకువెళ్లాల్సిన ప్రభుత్వం పట్టించుకోకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని ట్వీట్ చేశారు.
ఐటీ టవర్ పూర్తయితే ఉద్యోగావకాశాలు: మంత్రి కేటీఆర్
మలక్‌పేట, సైదాబాద్, సంతోష్‌నగర్, దిల్సుఖ్నగర్ సహా రాష్ట్రంలోని యువతకు దాదాపు 50వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు కల్పించాలన్నది ఈ ఐటీ పార్క్ లక్ష్యం. గతేడాది అక్టోబర్‌లో ఐటీ మంత్రిగా నేనే శంకుస్థాపన చేశాను. మూడేళ్లలో ఐటీ పార్కును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఐటీ పార్కును పూర్తి చేసే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో ఐటీని విస్తరించాలని బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేసింది. ఆ ప్రయత్నాలను ప్రస్తుత ప్రభుత్వం కొనసాగించాలని ఐటీ మంత్రి శ్రీధర్ బాబును కోరుతున్నా.