వికారాబాద్, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ) : రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వికారాబాద్ నియోజకవర్గంలోని ఆరు జడ్పీటీసీలు, ఆరు ఎంపీపీలను గెలిపించి జిల్లా పరిషత్‌పై గులాబీ జెండా ఎగురవేసేలా ఐకమత్యంగా పని చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. శనివారం హైదరాబాద్‌లోని బీఆర్ఎస్ భవన్లో మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితాఇంద్రారెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌తో కలిసి నిర్వహించిన వికారాబాద్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.
త్వరలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో స్పీకర్ నియోజకవర్గంలోనే ఆరింటికి ఆరు గెలిచి కాంగ్రెస్‌పై ఎంత వ్యతిరేకత ఉన్నదో తెలిసేలా చేద్దామని పిలుపునిచ్చారు. ఎన్నికలన్నప్పుడు మండలంలో పది మంది బరాబర్ టికెట్ అడుగుతారని కానీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ తదితర సామాజిక సమీకరణాలు చూసుకొని, గెలిచే వారినే బరిలో దింపాలని, ఎవరు బరిలో ఉన్నా కలిసికట్టుగా పని చేయాలన్నారు. పార్టీకి దూరంగా ఉన్న వారిని దగ్గరికి తీసుకోవాలని, మాజీ ఎమ్మెల్యే ఆనంద్‌పై కోపతాపాలుంటే తీసేయాలని, ఇకపై వర్గపోరు లేకుండా సమన్వయంతో ముందుకెళ్లాలని కేటీఆర్ సూచించారు.
4-5 దశాబ్దాల కల అయిన వికారాబాద్ జిల్లా ఏర్పాటు డిమాండ్‌ను ఇంద్రారెడ్డి ఉన్నప్పటి నుంచి వింటున్నామని, జిల్లా ఏర్పాటు కలను మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నెరవేర్చారని కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్‌కు పక్కనే ఉన్న వికారాబాద్‌లో ఒక్క మెడికల్ కాలేజీ లేని పరిస్థితి ఉండేది, కనీసం డిగ్రీ కాలేజీ వస్తదో, రాదో అనుకున్న పరిస్థితుల్లో మెడికల్ కాలేజీతో నర్సింగ్ కాలేజీలను మంజూరు చేసిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. అనంతగిరి ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాల్సి ఉండేది కానీ ఏ కారణం చేతనో చేయలేకపోయామని, తప్పకుండా చేసుకుందామన్నారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు 90 శాతం పూర్తయ్యాయని, రిజర్వాయర్లు, పంప్‌హౌస్‌ల నిర్మాణం పూర్తైందని, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలకు సాగునీరిచ్చే పనులు కొంత ఆలస్యమైన మాట వాస్తవమని, మళ్లీ బీఆర్ఎస్ పార్టీతోనే వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలకు సాగునీరందిస్తామని కేటీఆర్ మాటిచ్చారు. రియల్ ఎస్టేట్ రంగం వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌లోనే కాదు మా సిరిసిల్లలో కూడా కుప్పకూలిందని, రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్‌పై ఆధారపడినవారి పొట్టకొట్టారన్నారు.
వికారాబాద్ ప్రజలు విశ్వాసం ఉన్నవారు కాబట్టి 2014, 2018 ఎన్నికల్లో గెలిపించారని, మనమే చిన్న చిన్న పొరపాట్లు చేశామని, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలని కేటీఆర్ అన్నారు. కొంతమందిని కలుపుకొని పోయేది ఉండేదని, అయినప్పటికీ తక్కువ తేడాతోనే వికారాబాద్ నియోజకవర్గంలో ఓడిపోయామన్నారు. వాస్తవంగా మాట్లాడాలంటే ఆనంద్ బ్రహ్మాండంగా పని చేశారని, రాజకీయాల్లో అనుభవం లేకపోయినా నిజాయితీపరుడని అన్నారు. బీఆర్ఎస్ శ్రేణులు కలిసికట్టుగా పని చేసి స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుదామని బీఆర్ఎస్ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నాగేందర్ గౌడ్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఎన్.శుభప్రద్‌పటేల్, జడ్పీ మాజీ వైస్ చైర్మన్ విజయ్‌కుమార్, సీనియర్ నాయకుడు రామచంద్రారావు తదితరులు పాల్గొన్నారు.