వికారాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ) : పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా ఏందో చూపించారని, ఈ ఎన్నికల స్ఫూర్తితో రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. తాండూరు నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్‌లను శనివారం ఆయన హైదరాబాద్‌లోని బీఆర్ఎస్భవన్లో అభినందించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ నిధులపై రాష్ట్ర ప్రభుత్వంతోపాటు ఎవరి కీ అధికారం ఉండదని సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డుల సభ్యులకే ఉం టుందన్నారు.
పంచాయతీలకిచ్చే నిధులు రేవంత్‌రెడ్డి జేబు నుంచో, స్పీకర్ ప్రసాద్‌కుమార్ ఇంటి వెనుక ఉన్న పొలాన్ని అమ్మో ఇస్తున్న పైసలు కావని.. ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన సొమ్మునే తిరిగి మళ్లీ ప్రజల అవసరాలకు వినియోగించేందుకే సర్పంచ్‌లుగా, ఎమ్మెల్యేలుగా మనం ఉన్నామన్నారు. కేసీఆర్ హయాం లో ఫైనాన్స్ కమిషన్ నుంచి రూపాయి వస్తే, మేము మ రో రూపాయి కలిపి పల్లెప్రగతి కార్యక్రమం కింద ఉద్యోగులకు జీతాలిచ్చినట్టు పంచాయతీలకు నిధులిచ్చామన్నా రు. బీఆర్ఎస్ సర్పంచ్‌లకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వనని ఓ ఎమ్మెల్యే పేర్కొన్నడని.. ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చేది ఆయన చేతుల్లో ఏమి లేదని, ఇందిరమ్మ కమిటీలు పెట్టారని.. పంచాయతీల తీర్మానం మేరకే ఇస్తారని, కొత్త పింఛన్లు, కొత్త పథకాలు ఏమొచ్చినా పంచాయతీల తీర్మానంతోనే జరుగుతాయన్నారు. రెండేండ్లుగా సెక్రటరీలు, అధికారులను అడ్డం పెట్టుకొని పాలకులు ఆటలాడిండ్రు.. ఇక నుంచి సాగవన్నారు.
పంచాయతీ ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తుందని తాను అనుకోవడంలేదని కేటీఆర్ పేర్కొ న్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో గల్లీ నుంచి ఢిల్లీ దాకా మనమే గెలిచామన్నారు. ఇటీవల జరిగిన ప్రెస్మీట్లో సీఎం రేవంత్‌రెడ్డి మొదటి 5 నిమిషాలు పంచాయతీ ఎన్నికల్లో 66శాతం గెలిచామని చెప్పారని.. చాలా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలవలేదని మీడియా అడిగితే అవన్ని మావి కావు, స్థానిక పరిస్థితులను బట్టి ఉంటాయని మాట మార్చారని ఎద్దేవా చేశారు. రేవంత్‌రెడ్డిలో ఇద్దరు మనుషులు ఉంటారని అందులో ఒకరు రాము, మరొకరు రెమో అని పేర్కొన్నారు. గ్లోబల్ సమ్మిట్ ద్వారా రూ.5 లక్షల కోట్లు, 6 లక్షల కోట్లు వచ్చాయని డ్రామా చేస్తడని.. ‘అప్పుడే మనది బిచ్చపు బతుకు.. మన దగ్గర ఎట్ల పైసలుంటాయి.
ఢిల్లీకి వెళ్తే చెప్పులు ఎత్తుకుపోతున్నారంటున్నారని మనల్ని అనుమానిస్తున్నారని’ సీఎం పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశా రు. కేసీఆర్ హయాంలో ప్రతి ఊర్లోనూ నర్సరీ, మొక్కలు పెంచే కార్యక్రమం, ట్రాక్టర్, చెత్త కోసం డంపింగ్ యార్డు, వైకుంఠధామాలు, క్రీడా ప్రాంగణాలు, పల్లెప్రకృతివనాలు ఏర్పాటు చేశామని.. దేశంలో మూడు శాతం ఉన్న తెలంగాణ 30% జాతీయ ఉత్తమ పంచాయతీ అవార్డులను గెలుచుకున్నదన్నారు. రెండేండ్లు కొంత కష్టముంటుందని.. అధైర్యపడొద్దు.. తాము అండగా ఉంటామన్నారు. గ్రామాల్లో రైతులు కోపంతో ఉన్నారని, యూరియా కోసం యుద్ధా లు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయన్నారు. యూరియా కోసం కొత్తగా యాప్ తీసుకొచ్చారని.. షాపులో లేని యూరియాను యాప్‌లో ఎట్ల తెస్తారని కేటీఆర్ ప్రశ్నించారు.
పదేండ్ల కేసీఆర్ పాలనలో ఎందుకో యూరియా కోసం లైన్లు లేకుండే, ఎందుకంటే నడిపేటోడికి రైతులపై ప్రేమ ఉండాలి, అది కేసీఆర్‌కు ఉండే.. రేవంత్‌రెడ్డికి లేనే లేదన్నారు. మరోవైపు రోహిత్‌రెడ్డి నాయకత్వంలో తాండూరు నియోజకవర్గానికి రూ.వందల కోట్ల నిధులను కేసీఆర్ మంజూరు చేశారని.. ఇప్పుడున్న ఎమ్మె ల్యే ఆ నిధులను తానే తెచ్చానని పోజులు కొడుతున్నారని, నిజానికి ఆ నిధులను రోహిత్‌రెడ్డి తీసుకొచ్చారని.. కేసీఆర్ ఇచ్చారని కేటీఆర్ గుర్తు చేశారు. రానున్న జనవరి, ఫిబ్రవరిల్లో మున్సిపల్ ఎన్నికలు వస్తాయని అంటున్నారని.. తాండూరులో మున్సిపాలిటీలో ని 36 వార్డుల్లో బీఆర్ఎస్ గెలిచేలా మంచిగా పనిచేసే వారిని నిలబెట్టి, గెలిపించాలన్నా రు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పంజగుల శ్రీశైల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వికారాబాద్ సెగ్మెంట్ నుంచి గెలిచిన ప్రసాద్‌కుమార్ స్పీకర్ కావడంతో వికారాబాద్ వాళ్లమంతా సంతోషించాం. కానీ, మొన్న ఆయన మాట్లాడిన మాటలు వికారాబాద్ ఇజ్జత్ తీశాయి. ఎందుకంటే ఎవర్ని అడిగినా పదిమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారా..? లేదా..? అనేది చెప్తారు. అంతేకాకుండా వాళ్లే స్వయంగా మేము అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరామని ట్విట్టర్లో పెట్టారు. కండ్లున్నా ప్రతి ఒక్కరికీ కనపడుతుంది. వాళ్లే మైకుల్లో స్వయంగా చెప్పడంతో చెవులున్నందరికీ వినిపిస్తుంది. కానీ, స్పీకర్‌కు కండ్లు, చెవులు లేవని దీనిని బట్టి తెలుస్తున్నది.
తొందర్లోనే కండ్లు, చెవుల పరీక్షలు చేయించుకుని మంచి తీర్పు ఇవ్వాలని కోరుకుంటున్నా. జిల్లాలోని తాండూరుతోపాటు వికారాబాద్లోనూ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు అరాచకానికి పాల్పడ్డారు. వికారాబాద్ సెగ్మెంట్లోనూ 52 పంచాయతీల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు సర్పంచ్‌లుగా గెలిచారు. రానున్న రోజులు మనవే. బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది. కేసీఆర్ మరోసారి సీఎం అవుతారు.
– డాక్టర్ మెతుకు ఆనంద్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే
పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అరాచకాలను ఎదుర్కొని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నిలబడ్డారు. మంచి ఫలితాలను సాధించారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో తాండూరు మున్సిపాలిటీని కైవసం చేసుకుంటాం. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ అత్యధిక స్థానాలను సాధిస్తాం. మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వామే.
– పైలట్ రోహిత్‌రెడ్డి, తాండూరు మాజీ ఎమ్మెల్యే