రంగారెడ్డి, జనవరి 12(నమస్తే తెలంగాణ) : రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్దే ఘన విజయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. భువనగిరి సహా అన్ని ఎంపీ స్థానాల గెలుపునకు రెట్టించిన ఉత్సాహంతో పనిచేద్దామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శుక్రవారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భువనగిరి పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సమావేశానికి బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డితోపాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, తాజా, మాజీ ప్రజా ప్రతినిధులు, పార్టీ ముఖ్య నేతలు హాజరయ్యారు. భువనగిరి గడ్డపై గులాబీ జెండాను ఎగరవేయాలని నేతలకు ఈ సందర్భంగా కేటీఆర్ దిశానిర్దేశం చేశారు.
తెలంగాణ గళం..బలం..దళం బీఆర్ఎస్ సొంతమని కేటీఆర్ పేర్కొన్నారు. పార్లమెంటులో తెలంగాణ గళం వినిపించేందుకు భారీ స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకునేలా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. యాచించి కాకుండా శాసించి తెలంగాణ హక్కులను సాధించుకోవాలన్న ప్రొఫెసర్ జయశంకర్ నినాదాన్ని నిజం చేయాలన్నారు. ఎక్కడ కోల్పోయామో అక్కడే వెతుక్కోవాలని, 37 శాతం వచ్చిన ఓట్ల భాగస్వామ్యానికి మరో 4.5శాతం జోడిస్తే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీదే విజయమని ధీమా వ్యక్తం చేశారు.
పార్లమెంటు ఎన్నికల్లో జయకేతనం ఎగురవేయడం ద్వారా ఆతర్వాత వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పార్టీ కార్యకర్తలు సత్తా చాటాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి గడిచిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ప్రజలు బ్రహ్మరథం పట్టారన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ మరవకూడదన్నారు. తెలంగాణ ప్రజానీకం ఎల్లవేళలా బీఆర్ఎస్ వెన్నంటే ఉంటుందని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడానికి ప్రధానంగా కొన్ని కారణాలను ఇటీవల నిర్వహించిన పది పార్లమెంట్ సన్నాహక సమావేశాల్లో గుర్తించామన్న కేటీఆర్ వాటిని ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు వివరించి అవసరమైన సూచనలు చేశారు.
అమలుకాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. వాటిని అమలు చేయలేక చేతులెత్తేసే క్రమంలో శ్వేత పత్రాలను విడుదల చేసి ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తున్నదని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఆరు గ్యారెంటీలు కాదని, ఎస్సీ, బీసీ, మహిళా తదితర డిక్లరేషన్లతో కలిపి 420 హామీలను ఇచ్చిందన్నారు.
నిరుద్యోగ భృతి, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ హోదా వంటి హామీలపై ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం నాలుక మడతేసిందని ఎద్దేవా చేశారు. రైతు బంధు రాక, కరెంటు కోతలతో ఇప్పటికే గ్రామాల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు అసహనంతో ఉన్నారని పేర్కొన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ కాంగ్రెస్ నేతలను నిలదీయాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు.
భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో మరోసారి పాగా వేసేందుకు బీఆర్ఎస్ పార్టీ ఆచితూచి అడుగులు వేస్తున్నది. 2009లో ఏర్పాటైన ఈ పార్లమెంట్ నియోజకవర్గానికి ఇప్పటివరకు మూడుసార్లు ఎన్నికలు జరగగా.. ఒకసారి బీఆర్ఎస్, రెండుసార్లు కాంగ్రెస్ గెలుపొందింది.
ఈ పార్లమెంట్ పరిధిలో నల్లగొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాలకు చెందిన భువనగిరి, ఆలేరు, మునుగోడు, తుంగతుర్తి, నకిరేకల్తోపాటు జనగామ జిల్లాలోని జనగామ, రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం సెగ్మెంట్లు ఉన్నాయి. మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ.. బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది. ఈసారి ఈ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకునేలా బీఆర్ఎస్ పార్టీ వ్యూహాన్ని రచిస్తున్నది. బలమైన నేతను ఇక్కడి నుంచి బరిలో నిలిపేలా ఆలోచన చేస్తున్నట్లు సన్నాహక సమావేశంలో కేటీఆర్ పార్టీ నేతలతో ప్రస్తావించినట్లు తెలిసింది.