వికారాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి రావడంలేదని అంటున్నాడు.. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చుడు కాదు.. దమ్ముంటే సెక్యూరిటీ లేకుండా లగచర్లకు ఒక్కడివే రా.. నీవు వస్తావో.. రావో.. నాకు తెల్వదు కానీ నేను మాత్రం పక్కా కొడంగల్‌కు తొందర్లొనే వస్తా.. నీకు దమ్ముంటే ఆపుకో.. అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్‌రెడ్డికి సవాల్ విసిరారు. శనివారం పరిగి నియోజకవర్గంలోని సోమన్గుర్తి, బొంపల్లి, బాసుపల్లిలలో బీఆర్ఎస్ జెండాలను ఆవిష్కరించిన అనంతరం కులకచర్ల మండలం దాస్యనాయక్ తండాలో సేవాలాల్ సేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని మాజీ మంత్రులు సబితాఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, శ్రీనివాస్ గౌడ్‌తో కలిసి కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ బాజాప్తా కొడంగల్‌కు పోతాం, నీ సంగతేందో చూస్తాం.. అని కేటీఆర్ ధ్వజమెత్తారు.
భయపడి, భయపడి ఎందుకు పోతాం, నీవు రాలేదా గతంలో సిరిసిల్లకు నాలుగు సార్లు వచ్చినవ్, మహేశ్వరం వచ్చినవ్, వికారాబాద్ వచ్చినవ్ అంతటికి వచ్చినవ్, రాష్ట్రం అంతా తిరిగావు, మమ్ములను తిట్టావు, నీకు సెక్యూరిటీ కూడా ఇచ్చాం, కానీ నేడు మాకు తిరగడానికి అనుమతులు అంటున్నవ్, ఇది నీ చేతగాని పాలనకు నిదర్శనమని విమర్శించారు. కొడంగల్‌లో రానున్న రోజుల్లో భారీ బహిరంగ సభను నిర్వహిస్తాం.. రానున్న ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయం.. అని అన్నారు. లగచర్ల ఘటనలో 45 రోజులు జైలుకు వెళ్లి వచ్చిన సురేశ్, గోపాల్‌లాంటి వారు చాలా మంది గిరిజన బిడ్డలు ఉన్నారని అన్నారు. హీర్యానాయక్‌కు జైలులో గుండెనొప్పి వస్తే బేడీలు వేసి పోలీసు జీపులో దవాఖానకు తీసుకెళ్లారు.. బెడ్ మీద కూడా బేడీలతోనే ఉంచారు..
కొడంగల్ రైతులకు బేడీలు వేసిన రేవంత్‌రెడ్డికి రానున్న రోజుల్లో చుక్కలు చూయించాలని పిలుపునిచ్చారు. దవాఖానలో ఉన్నా కూడా గిరిజన బిడ్డలను ఇబ్బందులకు గురి చేసిన రేవంత్‌కు గట్టిగా సమాధానం చెప్పాలని, కేసీఆర్ అందరికీ అండగా ఉంటారని భరోసానిచ్చారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా స్వేచ్ఛను ఇచ్చారని, మాట్లాడే, కొట్లాడే, ప్రజాప్రతినిధులను నిలదీసే స్వేచ్ఛను ఇచ్చారని, ఎన్నికల్లో హామీలిచ్చి యాదిమరిస్తే కచ్చితంగా నిలదీయొచ్చని ప్రజలకు సూచించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వచ్చే స్థానిక ఎన్నికల్లో అడుగడుగునా నిలదీయాలన్నారు.
పోలీసోళ్లను అడ్డం పెట్టుకొని లగచర్ల రైతులను కలుస్తా అంటే అక్కడికి పర్మిషన్ ఇయ్యడు, రైతుల కోసం నల్లగొండలో ధర్నా చేస్తామంటే దానికీ పర్మిషన్ ఇయ్యడు.. కోర్టుకు పోవాలి, ఆఖరికి దాస్యనాయక్ తండాలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి పర్మిషన్ ఇయ్యలేదని అన్నారు. ప్రజాస్వామ్యంలో గెలుపు, ఓటములు సహజమని, గెలిచిన వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అధికారం వస్తుంది, ఓడిన వారు ప్రజల తరఫున ప్రశ్నించే అవకాశం ఉంటుందన్నారు.
రాష్ట్రం సాధించిన తరువాత 10 సంవత్పరాలు అధికారం కేసీఆర్‌కు ఇచ్చారు. ప్రజలను ఆదుకొని అత్యద్భుతంగా రాష్ర్టాన్నీ అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారన్నారు. గిరిజనుల కష్టాలు తెలిసిన వ్యక్తిలా పరిగి నియోజకవర్గంలో 52 తండాలను గ్రామ పంచాయతీలుగా మారాయని, రాష్ట్రంలో 3200లకు పైగా తండాలు గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసిన ఘనత మహానేత కేసీఆర్‌కు దక్కిందన్నారు. పరిపాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను, రెవెన్యూ డివిజన్లు చేశారని, మండలాలను వర్గీకరణ చేశారని అన్నారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కొందరి వాడు కాదు.. అందరి వాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. అంబేద్కర్ చెప్పినట్లు బోధించు.. సాధించు.. సమీకరించు.. పోరాడు అనే నినాదాన్ని నాడు అంబేద్కర్ రాజ్యాంగంలో చూయించాడని, ఈ విషయాన్ని ఆచరణలో పెట్టిన మొట్టమొదటి వ్యక్తి కేసీఆర్ అని, తెలంగాణ ప్రాంతంలోని అన్ని వర్గాల ప్రజల సమస్యలను దృష్టిలో పెట్టుకొని వారిని సమీకరిస్తూ రాజ్యాంగంలో ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ రాష్ర్టాన్ని సాధించారన్నారు. సావు నోట్ల తలబెట్టి రాష్ర్టాన్ని సాధించుకున్నామన్నారు. 14 సంవత్సరాల పోరాట ఫలితమే తెలంగాణ రాష్ట్రం సాధించామని, రాజ్యాంగమే లేకపోతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది కాదని అన్నారు.
ప్రపంచ మేధావుల్లో బీఆర్ అంబేద్కర్ ఒకరని పలు సంస్థలు గుర్తించాయని, మన దేశంలో మాత్రం ఆయన కేవలం దళితులకు మాత్రమే పరిమితం చేసేలా కొందరు చేశారన్నారు. కానీ దాస్యనాయక్ తండాలో అంబద్కేర్ అందరివాడని తెలియజేస్తూ సేవాలాల్ సేన ఆధ్వర్యంలో తండాలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని నాయకులు అజయ్‌నాయక్, శంకర్‌నాయక్‌లను అభినందించారు. అమెరికాలాంటి దేశాల్లో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 100 ఏండ్లకు మహిళలకు ఓటు హక్కు కల్పిస్తే, దేశంలో 1952 లోనే ఆడబిడ్డలందరికీ ఓటు హక్కును కల్పించిన గొప్పవ్యక్తి అంబేద్కర్ అని అన్నారు. ఆర్టికల్ 19 ప్రకారం కల్పించిన వాక్స్వాతంత్య్రపు హక్కును కల్పించారన్నారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించాలని కేటీఆర్ ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి, మాజీ మంత్రులు మహమూద్ అలీ, శ్రీనివాస్‌గౌడ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, నవీన్‌కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, పట్నం నరేందర్ రెడ్డి, కొప్పుల మహేశ్‌రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి, బాల్క సుమన్, సేవాలాల్ సేనా రాష్ట్ర అధ్యక్షుడు సంజీవ్ నాయక్, మాజీ కార్పొరేషన్ చైర్పర్సన్ రజినీసాయిచంద్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్‌పటేల్, సేవాలాల్ సేన రాష్ట్ర నాయకులు అజయ్‌నాయక్, శంకర్ నాయక్ పాల్గొన్నారు.