పరిగి : తెలంగాణ తీసుకొచ్చిన మహానేత కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం కులకచర్ల మండలంలోని దాస్యనాయక్తండాలో అంబేద్కర్ విగ్రహాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, అంబేద్కర్‌ను మరచిపోవద్దనే ఉద్దేశంతోనే హైదరాబాద్‌లో 125 అడుగుల విగ్రహాన్ని కేసీఆర్ ఏర్పాటు చేయించారని గుర్తు చేశారు.
14 నెలల కాంగ్రెస్ పాలనలో అంబేద్కర్ విగ్రహానికి దండేసే దిక్కు లేదని, ఆ పరిసరాలను శుభ్రం చేయడం లేదన్నారు. రేవంత్ పాలనలో ప్రజలు విసిగిపోతున్నారని.. అన్ని వర్గాల ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని ఆరోపించారు. అన్ని కులాలకు సమాన హక్కులు ఇవ్వాలని, అందరూ ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతోనే కేసీఆర్ అనేక కార్యక్రమాలు అమలు చేయడంతోపాటు అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అక్షరాలా అమలు చేశారని కొనియాడారు. ఏడాది క్రితమే పొరపాటు చేశామని ప్రజలు బాధపడుతున్నారని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మరోసారి తప్పు చేయకుండా మంచి నాయకుడిని ఎన్నుకోవాలని సూచించారు.