వికారాబాద్ జిల్లా ప్రజల ఆశలు ఆడియాశలయ్యాయి. ఏడాదిలో జిల్లాకు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నుంచి సాగు నీరొస్తుందని సంతోషిస్తున్న తరుణంలో రేవంత్ సర్కార్ నీళ్లు చల్లింది. కేవలం తాను ప్రాతినిథ్యం వహిస్తున్న కొడంగల్ సెగ్మెంట్‌కే సాగు నీరందించేందుకు ప్రణాళికతో ముందుకెళ్తున్న సీఎం.. మిగిలిన వికారాబాద్, పరిగి, తాండూరు నియోజకవర్గాలపై సవతి తల్లి ప్రేమను చూపుతున్నారు. ఇక ఈ ప్రాంతాలకు పాలమూరు నీళ్లు రావడం ప్రశ్నార్థకంగా మారింది. ఓటేసి గెలి పించిన పాపానికి కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని నిలువునా మోసం చేస్తున్నదని రైతులు మండిపడుతున్నారు.
-వికారాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ)
కొడంగల్ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన రేవంత్‌రెడ్డి.. ముఖ్యమంత్రి కావడంతో జిల్లాలోని కొడంగల్, వికారాబాద్, తాండూరు, పరిగి నియోజకవర్గాల ప్రజలు సంబురపడ్డారు. ఇక మా ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని భావించారు. అయితే తాను ప్రాతినిథ్యం వహిస్తున్న కొడంగల్ సెగ్మెంట్‌పై తప్ప జిల్లాలోని మిగతా నియోజకవర్గాలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి పట్టింపు లేదనేది ప్రజలకు ఏడా ది గడవకముందే స్పష్టంగా తెలిసిపోయింది. కొడంగల్‌కు నిధుల వరద, సాగునీరిచ్చే ప్రాజెక్టును చేపట్టిన రేవంత్‌రెడ్డి.. మిగిలిన మూడు సెగ్మెంట్లపై సవతి తల్లి ప్రేమను చూపుతున్నారు. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలైన వికారాబాద్, తాండూరు, కొడంగల్, పరిగి ప్రాంతాల్లోని సుమారు ఐదు లక్షల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు గత కేసీఆర్ ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రతిష్టాత్మంగా చేపట్టి.. రూ.వేల కోట్ల నిధులను ఖర్చు చేసిం ది. పనులు చివరి దశకు చేరుకోగా.. రాష్ట్రంలో ప్రభు త్వం మారి.. రేవంత్‌రెడ్డి సర్కారు అధికారంలోకి రావడంతో ఆయన ఈ ప్రాజెక్టును పక్కన పెట్టడంతో వికారాబాద్, తాండూరు, పరిగి నియోజకవర్గాల ప్రజల బతుకులు ప్రశ్నార్థ్ధకంగా మారాయి. కేవలం కొడంగల్ సెగ్మెంట్‌తోపాటు సొంత జిల్లాపై ఉన్న ప్రేమతో మక్తల్, నారాయణపేట జిల్లాలకు సాగు నీరందించేందుకు కొడంగల్-నారాయణపేట్ ఎత్తిపోతల ప్రాజెక్టుకు రూ. 4,300 కోట్లతో చేపట్టారు. కొడంగల్ సెగ్మెంట్లో లక్ష ఎకరాలకు సాగు నీరందించేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్న సీఎం.. మిగిలిన మూడు నియోజకవర్గాలకు సాగునీటిని ఎప్పుడు తీసుకొస్తా రు.. ఈ ప్రాంత రైతుల గోసను ఎప్పుడు తీరుస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు జిల్లా నుంచి సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తుండడంతో వికారాబాద్ జిల్లా మొత్తం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని ఆశించిన ప్రజలకు వికారాబాద్, తాండూరు, పరిగి ఎమ్మెల్యేల వైఫల్యంతో నిరాశే ఎదురవుతున్నది. ముఖ్యమంత్రి కేవలం కొడంగల్ నియోజకవర్గానికి మాత్రమే సాగు నీరందించేలా చర్యలు తీసుకుంటున్నా ముగ్గురు ఎమ్మెల్యేలు తమ సెగ్మెంట్లకు సాగు నీరందించడంపై ఇప్పటివరకు నోరు మెదపకపోవడం బాధాకరం.
ఉమ్మడి మహబూబ్‌నగర్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకు సాగు నీరందించే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు 80శాతం వరకు పూర్తయ్యాయి. అసెంబ్లీ ఎన్నికలకు మూడు నెలల ముందు నార్లాపూర్ రిజర్వాయర్ లిఫ్ట్-1 వద్ద వెట్న్‌న్రు అప్పటి సీఎం కేసీఆర్ ప్రారంభించారు. బీడులు బారిన ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలకు సాగునీరందించి ప్రజల ఏండ్ల కలను నెరవేర్చేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును చేపట్టి రూ. వేలకోట్లను ఖర్చు చేసింది. అయి తే ప్రాజెక్టు నిర్మాణం పూర్తికాగా, కేవ లం సాగు నీరందించేందుకు కాల్వల పనులను మాత్రమే తవ్వాల్సి ఉన్నది. ఆ పనులకూ బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. అయితే ఏడాదిలో సాగు నీరొస్తుందని ఆశతో ఎదురు చూసిన జిల్లా రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో నిరాశే మిగిలింది. జిల్లాకు ఉద్దండాపూర్ రిజర్వాయర్ ద్వారా సాగు, తాగు నీరందించేలా ప్లాన్ చేశారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తైతే జిల్లాలోని సుమారు 5 లక్షల ఎకరాలకు సాగు నీరందడంతోపాటు జిల్లాలోని 566 గ్రామ పంచాయతీల్లోని 910 హాబిటేషన్లకు తాగు నీరందించేలా ఈ ప్రాజెక్టును రూపొందించారు. అయితే ప్రాజెక్టు తుది దశలో ఉండగా ప్రభుత్వం మారి.. కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి రావడంతో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులపై శీతకన్ను వేయడంతో పనులు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి.
కొడంగల్-నారాయణపేట్ ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు పనులను మెఘా ఇం జినీరింగ్ కంపెనీ, రాఘవ కంపెనీలకు సగం సగం అప్పగించడంలో ఆంతర్యం ఏమిటో సీఎం ప్రజలకు చెప్పాలి. అప్పట్లో మెఘా ఇంజినీరింగ్ కంపెనీని విమర్శించిన రేవంత్‌రెడ్డి అదే కంపెనీకి ఇప్పుడు ఎందుకు ప్రాజెక్టును అప్పగించారు. నల్లగొండ జిల్లా సుంకిశాలలో రూ.75 నుంచి రూ.80 కోట్లకు పైగా నష్టం వచ్చేందుకు కారణమైన మెఘా కంపెనీని బ్లాక్ లిస్టులో పెట్టకుండా ప్రాజెక్టు పనులను ఎందుకు ఇస్తున్నారో వివరించాలి.
కృష్ణానది మహారాష్ట్ర, కర్ణాటక రా ష్ర్టాల మీదుగా వెళ్తూ తెలంగాణలోని నారాయణపేట్ జిల్లా కృష్ణ మండలంలోకి ప్రవేశిస్తుంది. కృష్ణానదిపై తెలంగాణలో జూరాలను తొలి ప్రా జెక్టుగా నిర్మించారు. జూరా ల నుంచి నికర జలాలను తమ ప్రాంతానికి సాగు, తాగు నీరు ఇచ్చే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఊట్కూరు, జాజాపూర్, జయమ్మచెరువు, కానుకుర్తి దగ్గర రిజర్వాయర్లను నిర్మించి అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా ఊట్కూరు, జాజాపూర్, జయమ్మచెరువు, కానుకుర్తి, లక్ష్మీపూర్, ఈర్గపల్లి, దౌల్తాబాద్, హస్నాబాద్, కొడంగల్, బొంరాస్‌పేట చెరువులను కాకరవాణి ప్రాజెక్టుతో నింపనున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఐదు జిల్లాలను సస్యశ్యామలం చేసేలా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని రూపకల్పన చేస్తే ఈ ప్రభుత్వం అందులోని చాలా జిల్లాలను ఎడారిగా మార్చే ప్రయత్నం చేస్తున్నది.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా వచ్చే సాగునీటిని కొడంగల్ ప్రాం తానికే అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం సమంజసం కాదు. రాష్ట్రంలోనే వికారాబాద్ జిల్లా వెనుకబడి ఉన్నది. అందువల్ల కొడంగల్తోపా టు జిల్లాలోని మిగిలిన మూడు నియోజకవర్గాలకు కూడా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీటిని అందించి వాటి అభివృద్ధికి కృషి చేయాలి. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలను సమానంగా చూడాలి.
రేవంత్ సర్కార్ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నీటిని కేవలం కొడంగల్ సెగ్మెంట్‌కే సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవడం సబబు కాదు. వికారాబాద్ జిల్లాలోని మిగిలిని పరిగి, తాం డూరు, వికారాబాద్ నియోజకవర్గాలకు సాగునీటిని అందించకుంటే ఆ ప్రాంతాల్లో నీటి వనరుల్లేక ఎడారిగా మారే ప్రమాదం ఉన్నది. ప్రభుత్వం మూడు నియోజకవర్గాలపై సవతి ప్రేమను చూపొద్దు.
తుది దశలో ఉన్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును పక్కన పెట్టి వికారాబాద్ జిల్లా ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం తీరని అన్యాయం చేసింది. వికారాబాద్, తాండూరు, కొడంగల్, పరిగి నియోజకవర్గాల్లోని 5 లక్షల ఎకరాలకు సాగునీరందించేలా.. గత బీఆర్ఎస్ ప్రభు త్వం ఈ ప్రాజెక్టును చేపట్టింది. అయితే రేవంత్ ప్రభుత్వం కేవలం కొడంగల్ సెగ్మెంట్‌కే సాగునీరందించేలా కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని చేపట్టి మూడు నియోజకవర్గాల ప్రజలను మోసం చేస్తున్నది. డబ్బులను దండుకునేందుకు కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును చేపట్టారే తప్ప కొడంగల్‌పై రేవంత్‌రెడ్డికి ఎలాంటి ప్రేమ లేదు.
సాగు, తాగు నీటి కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే నిర్లక్ష్యం చేస్తున్నది. ఈ ప్రాజెక్టు పూర్తైతే మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నారాయణపేట్, వికారాబాద్, నాగర్‌కర్నూల్, నల్లొండ జిల్లాల్లోని 70 మండలాలకు, 1226 గ్రామాలకు న్యా యం చేకూరుతుంది. కేవలం కొడంగల్‌కు సాగు నీరిచ్చే లా ప్రణాళికలు రూపొందించడం ఎంత వరకు సమంజసం. రాష్ట్రం అంటే ఒక కొడంగలేనా..?
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులకు అన్ని కష్టాలే. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా వికారాబాద్ జిల్లాలోని రైతులందరికీ నీరు అందేలా గత కేసీఆర్ ప్రభుత్వం ప్రణాళికను రూపొందించగా.. రేవంత్ సర్కారు మాత్రం కేవలం కొడంగల్ సెగ్మెంట్‌కే ఈ పథకాన్ని పరిమితం చేయడం సరికాదు. దీంతో మిగిలిన మూడు నియోజకవర్గాలకు సాగునీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతారు.