కొడంగల్ : వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని స్థానిక మహాలక్ష్మి వేంకటేశ్వరస్వామి దేవాలయంలో అత్యంత దేదీప్యమానంగా పూజ కార్యక్రమాలు జరిగాయి. గురువారం వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని శ్రీదేవి, భూదేవి సమీతుడై ఆ దేవదేవుడు ఏడుకొండలవాడు ఉత్తర ద్వారం నుంచి భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్తర ద్వార దర్శనం.. పుణ్య సార్థకంగ భావించడం భక్తుల ప్రగాఢ నమ్మకం. ముక్కోటి దేవతలు కూడా యోగనిద్రలో ఉన్న మహావిష్ణువును దర్శించుకొని పుణీతులైనట్లు పురాణాల గాధ. కాబట్టే ముక్కోటి ఏకదశికి అత్యం ప్రాముఖ్యత ఉంది. ఈ విశిష్టమైన ఏకాదశి నాడు శ్రీమన్నారాయణుడిని దర్శించుకుంటే పునర్జన్మ లేకుండా ఆ భగవంతుడి సన్నిధిలో నీలమైపోయే భాగ్యం కలుగుతుందని భక్తుల నమ్మకం.
ఆలయంలో ఉదయం 4గంటల నుంచి ఆలయంలో విశేష పూజ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీనివాసుని నిత్యనూతనంగా వెలుగొందేవిధంగా వివిధ రకాల పూలతో, ఆభరణాలతో అలంకరించారు. ఆ దేవదేవుడిని దర్శించుకునేందుకు భక్తులు ఉత్తర ద్వారం ముందు పెద్ద ఎత్తున బారులుతీరారు. అనంతరం భూదేవి, శ్రీదేవి సమీతుడైన శ్రీవారిని మాడవీధుల్లో ఊరేగింపు చేపట్టారు.
అనంతరం ఆయల ప్రాంగణంలోని ఆస్తాన మంటపంలో స్వామిని కొలువుదీర్చి ఉ.ప.వే శ్రీనివాసాచార్యులచే తిరుప్పావై పారాయణం, గీతా పారాయణం, ప్రవచనాలు పారాయణ పఠనం శ్రవణానందంగా కొనసాగింది. భక్తుల గోవిందనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్రెడ్డి, తాండూర్ ఆర్డివో అశోక్‌కుమార్ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.