వికారాబాద్/నవాబుపేట, ఫిబ్రవరి 5 : ‘రైతులకు, ప్రజలకు కేసీఆర్ సైన్యం అండగా ఉంటుంది.. ఎవరూ అధైర్యపడొద్దు..’ అని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం నవాబుపేట మండల కేంద్రంలోని రైతు వ్యతిరేక కాంగ్రెస్ సర్కార్‌పై పోరుకు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆనంద్‌లతో కలిసి రైతు ధర్నా నిర్వహించారు. ముందుగా మండల కేంద్రంలో పార్టీ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం రైతులు, ప్రజలు, పార్టీ నాయకులు ఘనస్వాగతం పలికారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సబితారెడ్డి మాట్లాడారు. రుణ మాఫీ కాలేదని, రైతుభరోసా రాలేదని, పింఛన్ రాలేదని దాదాపుగా 100 మందికిపైగా తమ దృష్టికి తీసుకొచ్చారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 14 నెలలవుతున్నా 6 గ్యారెంటీల అమలులో పూర్తిగా విఫలమైందన్నారు. పావు వంతు మందికి కూడా రుణమాఫీ కాలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలతో పబ్బం గడుపుతున్నదన్నారు. రుణ మాఫీకి రూ.49వేల కోట్లు కావాలని బ్యాంకువారు చెప్పారన్నారు.
అసెంబ్లీలో మాత్రం రూ.31వేల కోట్ల ఇస్తామని తీర్మానం చేసి, మరో సారి రూ.29వేల కోట్లు అంటూ మాటతప్పి.. చివరకు రూ.18వేల కోట్లు మాత్రమే మాఫీ చేయడం సిగ్గుచేటన్నారు. జనవరి 26న రైతులకు రైతుభరోసా అందుతుందని మాట ఇచ్చి తప్పారన్నారు. ఏడాదికి రూ.15వేలు ఇస్తామని గొప్పలు చెప్పిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చి 14 నెలలు దాటినా ఇవ్వలేదన్నారు. ఆసరా పింఛన్, రేషన్ కార్డులు, మహిళలకు రూ.2500, తులం బంగారం వంటి ఆరు గ్యారెంటీలు ఎక్కడికి పోయాయని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఎద్దు ఏడ్చిన ఎవుసం.. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదని విమర్శించారు. బీసీ రిజర్వేషన్లు 42 శాతం చేస్తామని మాట ఇచ్చి .. మళ్లీ మాట మార్చడం అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ముందే చెప్పిండు.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పథకాలు రావు.. ప్రజలు, రైతులు ఆగం ఆగం అవుతారన్న మాటలు నిజమవుతున్నాయన్నారు. ప్రజలందరూ మా కుటుంబ సభ్యులే… వారికి ఏ కష్టం వచ్చినా బీఆర్ఎస్ సైన్యం అండగా ఉంటుందన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో నవాబుపేట మండలానికి సాగు నీరు అందిస్తే రైతుల బతుకులు బాగు పడుతాయన్నారు. ఇప్పటికే 416 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని గుర్తు చేశారు. 420 రోజులు గడిచినా కనీసం 6 గ్యారెంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. రాబోయే ఎన్నికలలో ఇండ్ల ముందుకువచ్చే కాంగ్రెస్ నాయకులను నిలదీయాలన్నారు. రైతులకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని ధైర్యం చెప్పారు. రైతుల సమస్యలపై సీఎంకు పోస్టుకార్డులు పంపిస్తున్నట్లు మాజీ మంత్రి సబితారెడ్డి తెలిపారు.
అనంతరం నవాబుపేట మండలం పులుమామిడి గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో టీఎస్ఈడబ్ల్యూఐడీసీ మాజీ చైర్మన్ నాగేందర్‌గౌడ్, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ విజయ్‌కుమార్, నాయకులు దేశమోళ్ల ఆంజనేయులు, వెజ్ బోర్డు మాజీ చైర్మన్ నారాయణ, పార్టీ మండల అధ్యక్షుడు దయాకర్‌రెడ్డి, గౌరవ అధ్యక్షుడు భరత్‌రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శాంత్‌కుమార్, విజయ్‌కుమార్, మహేశ్‌రెడ్డి, జగన్‌రెడ్డి, మల్లారెడ్డి, గౌస్, వెంకట్‌రెడ్డి, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
రైతులు గోస పడుతున్నరు.. ; మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్
కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు గోసపడుతున్నారని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ అన్నారు. రైతు భరోసా రూ.15 వేలు ఇస్తామని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రెండు దఫాలుగా ఎగ్గొట్టిందన్నారు. ప్రస్తుతం ఒక్కో మండలంలో ఒక్కో చిన్న గ్రామాలను ఎంపిక చేసి కొంత మంది రైతులకే రైతు భరోసా ఇచ్చి చేతులు దులుపుకొన్నదన్నారు. చేవెళ్లలో ఉప ఎన్నికలు వస్తాయని కేటీఆర్ ముందే చెప్పారన్నారు. ఉద్యమ సమయాల్లో రైతుల బాధలు చూసిన అధినేత కేసీఆర్ రైతుబంధు, రైతుబీమా పథకాలను తీసుకొస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నదన్నారు.
బీసీల ఓట్ల కోసం రేవంత్‌రెడ్డి నాటకం అడుతున్నడు.. ; బీసీ కమిషన్ మాజీ మెంబర్ శుభప్రద్‌పటేల్
నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశంలో బీసీల కుల గణన విషయంలో మోసం చేయడం సిగ్గుచేటని, బీసీల ఓట్ల కోసం సీఎం రేవంత్‌రెడ్డి నాటకం ఆడుతున్నాడని మాజీ బీసీ కమిషన్ మెంబర్ శుభప్రద్‌పటేల్ విమర్శించారు. రాబోవు స్థానిక ఎన్నికల్లో బీసీలంతా కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలన్నారు.
కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పాలి..; బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి
రైతులను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి రాబోవు రోజుల్లో గుణపాఠం చెప్పాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి అన్నారు. రైతుభరోసా పథకం కింద ఏడాదికి రూ.15వేలు ఇస్తామని మాయమాటలు చెప్పి రూ.12 వేలకు కుదించడం ఏమిటని ప్రశ్నించారు. రూ.4వేలు ఆసరా పింఛన్, మహిళలకు రూ.2500 ఎప్పుడిస్తారని మండిపడ్డారు. కాంగ్రెస్ చేస్తున్న మోసంపై రైతులు, ప్రజలు చర్చించుకోవాలన్నారు. నవాబుపేట మండలంలో రోడ్లు పాడయ్యాయని, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులు ఏం చేస్తున్నారో ప్రజలకు జవాబు చెప్పాల్సిన బాధ్యత వారిపై ఉందన్నారు.
కాంగ్రెస్ ప్రజలను ఇబ్బందులు పెడుతున్నది..; బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు శ్రీశైల్‌రెడ్డి
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులనేకాకుండా ప్రజలనూ ఇబ్బందులు పెడుతున్నదని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు శ్రీశైల్‌రెడ్డి అన్నారు. రైతుల బాధను చూసిన కేసీఆర్ రైతుబంధు, రైతుబీమా పథకాలను తీసుకొచ్చారన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరను ఇవ్వడంతోపాటు సబ్సిడీపై ఎరువులు, విత్తనాలను అందించిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. ఒక ఏఎస్ఐ నారాయణసింగ్ రిటైర్మెంట్ అయ్యాక కూడా తనకు పైసలు రాలేదని, సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగా లేఖ రాశారని గుర్తు చేశారు. చేవెళ్ల నియోజకవర్గంలో త్వరలోనే ఉప ఎన్నిక జరగనున్నదని, బీఆర్ఎస్ అభ్యర్థి భారీ మెజార్టీతో ఘన విజయం సాధించడం ఖాయమన్నారు.