చేవెళ్ల రూరల్, ఫిబ్రవరి 2 : తెలంగాణకు మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష అని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడి అన్నారు. ఆదివారం శంకర్పల్లి మండల పరిధి జన్వాడ గ్రామానికి చెందిన బీజేపీ నేత గౌడిచర్ల వెంకటేశ్ తన అనుచరులు వెయ్యి మందితో కలిసి సబితారెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కార్తీక్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. పార్టీలో చేరిన వారికి వారు బీఆర్ఎస్ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. జన్వాడ ప్రాంతమంతా గులాబీమయమైంది. అంతకు ముందు బోనాలు, కోలాటాలు, డప్పుల చప్పుళ్లు, బాణసంచా మోతలతో ఎమ్మెల్యే సబితారెడ్డికి ఘన స్వాగతం పలికారు. భారీ క్రేన్‌తో స్వర్గీయ ఇంద్రారెడ్డి విగ్రహానికి భారీ పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం ఎమ్మెల్యే సబితారెడ్డి మాట్లాడుతూ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే.. ఎగిరేది గులాబీ జెండానే అన్నారు. రేవంత్ సర్కార్ ప్రజలకు ఏం చేస్తారో చెప్పడం లేదని, ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. ప్రజలు ఇప్పటి వరకు మూడు సార్లు దరఖాస్తులు చేసుకున్నా ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. అత్తెసరు రుణమాఫీ చేశారని, రైతు భరోసాకు రాం..రాం చెప్పాలని చూస్తున్నారని విమర్శించారు. బీఆర్స్ ప్రభుత్వ హయాంలో అదునుకు రైతుబంధు డబ్బులు వచ్చేవన్నారు. 24 గంటల విద్యుత్తు, రోడ్లు, గురుకులాలు, పాఠశాలల భవనాలు, సమీకృత కలెక్టర్ భవనాలను నిర్మించిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో వార్డు సభ్యులతో సహా జడ్పీ చైర్మన్ల వరకు గులాబీ జెండాలు ఎగురవేసేలా ప్రతి ఒకరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
మున్సిపాలిటీ వద్దు..
జన్వాడను మున్సిపాలిటీలో కలుపొద్దని, గ్రామ పంచాయతీగా ఉంచాలని గ్రామస్తులందరూ ఏకగ్రీవంగా తీర్మానించి ప్రతిజ్ఞ చేశారు. కనీసం మున్సిపాలిటీలో కలిపితే ఒప్పుకొంటాం కానీ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్లోకి మార్పవద్దని మొరపెట్టుకున్నారు. కార్యక్రమంలో శంకర్పల్లి మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు గంచెర్ల గోవర్ధన్‌రెడ్డి, ఉద్యమకారుడు దేశమెల్ల ఆంజనేయులు, మాజీ చైర్మన్ నాగేందర్ గౌడ్, శంకర్పల్లి సొసైటీ చైర్మన్ శశిధర్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ కె. నారాయణ, మారెట్ మాజీ చైర్మన్ మాణిక్ రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ కురుమ వెంకటేశ్, బీఆర్ఎస్ నాయకులు గౌడిచర్ల నర్సింహ, నాగేందర్, కేశం గోపాల్, అశోక్, గౌడిచర్ల రాములు, బ్యాగరి సుదర్శన్, సుధాకర్ రెడ్డి, శ్రీనివాస్, లింగం, ఎజాస్, పీ సురేశ్, కే శ్రీను, సీహెచ్ వీరయ్య, జాఫర్, ఏ రాములు, నర్సింహారెడ్డి, ఇంద్రసేనా రెడ్డి, ఫరిద్ తదితరులు పాల్గొన్నారు.