కర్ణాటకలో కాంగ్రెస్ ఐదు పద్దుల హామీలన్నీ బూటకమని.. తెలంగాణలోనూ గ్యారంటీ స్కీమ్‌ల పేరిట మోసం చేసేందుకు యత్నిస్తున్నదని.. ఇదంతా నమ్మి మోసపోవద్దని కన్నడ రైతులు చెబుతున్నారు. బుధవారం కర్ణాటకలోని కొంతన్‌పల్లి, మల్లాబాద్, సిలార్కోట్రికె, నాడెపల్లి, పాకాల్, కానడగడ్డ తదితర ప్రాంత రైతులు వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణంలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. కర్ణాటకలో కాంగ్రెస్ పని తీరుపై ప్లకార్డులను ప్రదర్శించారు. ‘మా రాష్ట్రంలో కాంగ్రెస్ ఏ ఒక్క ఎన్నికల హామీనీ నెరవేర్చడం లేదు.. ముఖ్యంగా రైతుల బతుకులు ఆగమవుతున్నాయి.. మేము నమ్మి గోసపడుతున్నాం.. మీరు నమ్మొద్దు’ అని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఎన్నికల్లో వ్యవసాయానికి 7 గంటల కరెంట్ సరఫరా చేస్తామని చెప్పిన కాంగ్రెస్.. కేవలం 3 గంటల మాత్రమే ఇస్తున్నదన్నారు. దీంతో సరిపడ నీరు లేక పంటలు ఎండుతున్నాయన్నారు. ఓటేసి కాంగ్రెస్‌ను గెలిపిస్తే అన్నదాతల జీవితాలతో చెలగాటమాడుతున్నదని, తెలంగాణ రైతులు కూడా మోసపోకూడదనే ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రజలు ఎంతో అదృష్టవంతులని, సీఎం కేసీఆర్ అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలను అందిస్తున్నారన్నారు. కాంగ్రెస్ వస్తే చీకటి రోజులేనని.. అద్భుత పథకాలు అమలు చేస్తున్న బీఆర్ఎస్ను వదులుకోవద్దని సూచించారు. కర్ణాటకలో కాంగ్రెస్ పాలన వాస్తవ పరిస్థితులను తెలంగాణ ప్రజలకు చెప్పుకోవడానికి వచ్చిన రైతులను కాంగ్రెస్ నాయకులు అడ్డుకోగా.. స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
-కొడంగల్, అక్టోబర్ 25
కొడంగల్, అక్టోబర్ 25: కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వంతో రైతుల బతుకులు ఆగమవుతున్నాయని… మాలా తెలంగాణ రైతులు బాధలు పడొద్దంటే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో హస్తం పార్టీకి ఓటు వేయొద్దని కర్ణాటక ప్రాంత రైతులు పేర్కొంటున్నారు. బుధవారం కర్ణాటక రాష్ట్రంలోని కొంతన్‌పల్లి, మల్లాబాద్, సిలార్కోట్రికె, నాడెపల్లి, పాకాల్, కానడగడ్డ తదితర ప్రాంతాలకు చెందిన రైతులు కొడంగల్ పట్టణంలోని మహాలక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయం నుంచి అంబేద్కర్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించి కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును ఎండగట్టారు.
పట్టణంలో ఊరేగింపు నిర్వహించి దారి పొడవునా కాంగ్రెస్ పార్టీని నమ్మొద్దు.. కర్ణాటకలో ఇచ్చిన హామీల్లో ఒక్క దానిని కూడా నెరవేర్చడంలేదని.. అక్కడ రైతులకు ఆత్మహత్యలే శరణ్యమంటూ నినాదాలు చేశారు. ఆ పార్టీ ఇచ్చిన హామీలను నమ్మి.. ఎన్నికల్లో ఓటేసి గెలిపించుకుంటే.. ప్రభుత్వం ఏర్పడి కొన్ని నెలలైనా ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క దానినీ అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో కనీసం ఎనిమిది గంటలైనా విద్యుత్తు సరఫరా అయ్యేదని కనీసం ఒక్క పంటనైనా పండించుకునే వాళ్లమని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏడు గంటలపాటు కరెంట్ ఇస్తామని ఎన్నికల్లో ప్రచారం చేశారని.. కానీ.. ప్రస్తుతం మూడు గంటల కరెంటు మాత్రమే ఇస్తున్నారన్నారు.
దీంతో ఆ విద్యుత్తుతో పంటలకే కాకుండా ఇంట్లో కూడా కరెం టు కష్టాలు తప్పడంలేదని, పిల్లల చదువు కూడా సాగడం లేదన్నారు. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం అన్న హామీ అటకెక్కిందని.. మహిళలు కొప్పులు పట్టుకొని కొట్టుకొంటున్నట్లు పేర్కొన్నారు. బస్సు ఎక్కే క్రమంలో ఇద్దరు మహిళలు ఇప్పటికే చనిపోయినట్లు ఆరోపించారు. పేదలకు పది కిలోల చొప్పున బియ్యాన్ని పంపిణీ చేస్తామని చెప్పి మూడు కిలోలు మాత్రమే సరఫరా చేస్తున్నారని మండిపడ్డారు. దీంతో పేదలు అర్థాకలితో అలమట్టిస్తున్నారని కర్ణాటక ప్రాంత వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. చెప్పుకునేందుకు మాత్రమే 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు అని.. ఆపైన వచ్చే బిల్లుకు రెండు రెట్లు అదనంగా బిల్లులు వసూలు చేసి రైతులను ప్రభుత్వం దోచుకుంటున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన యువనిధి పథకం హామీగానే మిగిలిపోయిందని.. నేటికీ అమలుకు నోచుకోలేదన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీ లేని పథకాలను ప్రవేశపెట్టి కన్నడ ప్రజలను అన్ని విధాలా మోసం చేసిందన్నారు.
తెలంగాణ ప్రజలు ఎంతో అదృష్టవంతులని సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసి అండగా నిలుస్తున్నారని కర్ణాటక ప్రాంత రైతులు కొనియాడారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేని సంక్షేమ పథకాలు కేవలం తెలంగాణలో మాత్రమే అమలవుతున్నాయని పేర్కొన్నారు. వరాలిచ్చే దేవుడు లాంటి సీఎం కేసీఆర్‌ను ప్రజలు మళ్లీ గెలిపించుకోవాలని.. దురదృష్టవశాత్తు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణవాసులకు చీకటి రోజులు తప్పవని హెచ్చరించారు. మేము పడుతున్న ఇబ్బందులు తెలంగాణ ప్రజలు పడొద్దనే సదుద్దేశంతోనే కొడంగల్‌కు వచ్చి వివరిస్తున్నట్లు కర్ణాటక ప్రాంత రైతులు పేర్కొన్నారు. ఎన్నికల సమయంలోనే ఓటర్లు అప్రమత్తంగా ఉండాలని, ఆలోచించకుండా కాంగ్రెస్‌కు ఓటేస్తే బతుకులు ఆగమేనని సూచించారు.
తాము పడుతున్న బాధలను తెలంగాణ ప్రజలకు వివరించేందుకు వస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులు తమను అడ్డుకుని.. ప్లకార్డులను విరగ్గొట్టారని కర్ణాటక ప్రాంత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కర్ణాటకలో జరుగుతున్న బాగో తం బయటపడుతుందనే భయంతోనే కాంగ్రెస్ నాయకులు తమను అడ్డుకుంటున్నారని వారు ఆరోపించారు. కాంగ్రెసోళ్లకు భయపడకుండా మా గోడును తెలంగాణ ప్రజలకు వినిపిస్తామని.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాక ముందే ఈ విధంగా దౌర్జన్యం ఉంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఏలా ఉంటుందో తెలంగాణవాసులు ఆలోచించాలని పేర్కొన్నారు. మేం మోసపోయాం.. మీరూ మోసపోవద్దనే సదుద్దేశంతోనే కొ డంగల్‌కు వచ్చామని.. ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించి ..ప్రజల కోసం పని చేసే సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్నే మరోసారి గెలిపించాలని సూచించారు.