Rajasekhar | గత కొంతకాలంగా సోషల్ మీడియాలో “రాజశేఖర్ గోటీల ఫ్యాక్టరీ” అనే ట్రెండ్ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. సీనియర్ హీరో డా. రాజశేఖర్ గోటీల వ్యాపారం చేస్తూ నెలకు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారని, అక్కడ పనిచేసే ఉద్యోగులకు లక్షల్లో జీతాలు ఇస్తున్నారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఎక్స్ వంటి అన్ని సోషల్ మీడియా వేదికల్లో ఈ విషయానికి సంబంధించిన వీడియోలు, పోస్టులు విపరీతంగా వైరల్ అయ్యాయి. అయితే ఈ ప్రచారంపై తాజాగా రాజశేఖర్ స్వయంగా స్పందించి స్పష్టత ఇచ్చారు.
కొద్ది రోజుల క్రితం ఒక వీడియోలో “రాజశేఖర్ గోటీల వ్యాపారంతో నెలకు రూ.3 నుంచి రూ.4 కోట్లు సంపాదిస్తున్నారు” అంటూ ప్రచారం మొదలైంది. అక్కడి నుంచి ‘రాజశేఖర్ గోటీల ఫ్యాక్టరీ’ అనే ట్రెండ్ సోషల్ మీడియాలో విస్తరించింది. కొందరు అయితే రాజశేఖర్ గోటీల కంపెనీలో ఉద్యోగం పొందడం తమ డ్రీమ్ అని పోస్టులు చేయగా, మరికొందరు అక్కడ జాబ్ వచ్చిందంటూ సోషల్ మీడియాలో షేర్ చేశారు. అంతేకాదు ‘గోటీల కౌంటింగ్ స్పెషలిస్ట్’, ‘గోటి డెవలపర్’ వంటి పేర్లతో నకిలీ అపాయింట్మెంట్ లెటర్లు, ఐడీ కార్డులు కూడా తయారు చేసి వైరల్ చేశారు.
అంతేకాకుండా రాజశేఖర్, ఆయన భార్య జీవిత కలిసి గోటీల ఫ్యాక్టరీని సందర్శించినట్లు, మీడియాతో మాట్లాడినట్లు కూడా కొన్ని ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీంతో అసలు విషయం ఏంటో తెలియని పరిస్థితి ఏర్పడింది.ఈ నేపథ్యంలో తాజాగా ఒక పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడిన రాజశేఖర్ ఈ ప్రచారంపై స్పందించారు. తనకు ఎలాంటి గోటీల ఫ్యాక్టరీ లేదని స్పష్టంగా చెప్పారు. “ఇదేమిటమ్మా మాయ మాయ ఒకపక్క, గోటీల ఫ్యాక్టరీ ఇంకోపక్క… అందరూ మాట్లాడుకుంటుంటే నవ్వు వస్తోంది. కానీ కొందరు దాన్ని నిజంగానే తీసుకుని ‘సార్ మీకు నిజంగా గోటీల ఫ్యాక్టరీ ఉందా?’ అని అడుగుతున్నారు. నాకు బాగా తెలిసిన వాళ్లు కూడా ఫోన్ చేసి నిజమేనా అని అడిగారు. ఆ వీడియో చూసి నాకే తెలియకుండా ఫ్యాక్టరీ ఎలా వచ్చింది అని అనిపించింది. నేనెక్కడ నెలకు రూ.3 కోట్లు సంపాదిస్తున్నాను?” అంటూ రాజశేఖర్ నవ్వుతూ చెప్పారు.
ఇక రాజశేఖర్ హీరోగా నటించిన ‘ఆయుధం’ సినిమాలోని ‘ఇదేమిటమ్మా మాయ మాయ’ పాట కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇటీవల ‘కె-ర్యాంప్’ సినిమాలో ఈ పాటను రీమిక్స్ చేసిన తర్వాత మళ్లీ వైరల్ కావడంతో ఎక్కడ చూసినా ఈ పాటకు డ్యాన్స్ వీడియోలు కనిపిస్తున్నాయి. దీనిపై రాజశేఖర్ స్పందిస్తూ, సినిమా విడుదలైన సమయంలో ఈ పాటకు మంచి స్పందన వచ్చినప్పటికీ ఇప్పటి తరహాలో వైరల్ కాలేదని చెప్పారు. అయితే ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఈ పాట ట్రెండ్ అవుతుండటం తనకు చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ పాటకు డ్యాన్స్ చేస్తున్నారని, అది తన సినిమా మళ్లీ హిట్ అయినట్టే అనిపిస్తోందని ఆయన అన్నారు.