రంగారెడ్డి, జనవరి 6 (నమస్తే తెలంగాణ): రెండోవిడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం రంగారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జరిగిన ‘కం టివెలుగు’ అవగాహన సదస్సులో మంత్రి పాల్గొని ‘కంటివెలుగు’ డెమో వీడియోను వీక్షించి మాట్లాడారు. ఈ నెల 18 నుంచి కొనసాగనున్న రెండోవిడుత ‘కంటి వెలుగు’ను ప్రజాప్రతినిధులు, అధికారులు స మన్వయంతో పనిచేసి జయప్రదం చేయాలన్నారు. 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు నిర్వహించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు.
ఈ నెల9న మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, మండల స్థాయిలో.. 10వ తేదీ న గ్రామ పంచాయతీల్లో ‘కంటివెలుగు’పై అవగాహన సదస్సులు నిర్వహించాలని సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులకు ఆమె సూచించారు. పరీక్షలు నిర్వహించిన అనంతరం అవసరమైన వారికి అద్దాలు, మందులు ఇవ్వడం జరుగుతుందన్నారు. దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలాంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టలేదన్నారు. ఇది పేదల జీవితాల్లో వెలు గు నింపే కార్యక్రమమని కొనియాడారు. కంటి వెలుగు రెండో విడుత కార్యక్రమం ఈ నెల 18న ప్రారంభమైన జూన్ 30వరకు కొనసాగుతుందన్నారు.
జిల్లా అంతటా శిబిరాలు : కలెక్టర్
జిల్లాలోని 558 గ్రామ పంచాయతీలు, 23 జీహెచ్ఎంసీ వార్డులు, యూఎల్బీసీలు 358 కేంద్రాల్లో కంటి వెలుగు శిబిరాలను ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ అమ య్‌కుమార్ తెలిపారు. ‘కంటి వెలుగు’ను సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే నిర్వహించడం జరుగుతుందని.. శని, ఆదివారాల్లో.. సెలవు రోజుల్లో కొనసాగదని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో జడ్పీచైర్‌పర్సన్ అనితాహరినాథ్‌రెడ్డి, ఎమ్మెల్సీలు వాణీదేవి, దయానంద్‌గుప్తా, పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, అరెకపూడి గాంధీ, సుధీర్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, వైద్యారోగ్యశాఖ అధికారి వెంకటేశ్వర్రావు, జడ్పీ సీఈవో దిలీప్‌కుమార్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్‌రెడ్డి, డీఆర్డీఏ ప్రభాకర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.