రంగారెడ్డి, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ) :అందరికీ చూపును ప్రసాదించాలన్న సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అద్భుత కార్యక్రమం రెండో విడుత ‘కంటి వెలుగు’ నెల రోజులుగా విజయవంతంగా కొనసాగుతున్నది. రంగారెడ్డి జిల్లాలోని 35 పీహెచ్‌సీలు, 21 యూపీహెచ్‌సీలు, 2 పీపీ యూనిట్లు, 2 సీహెచ్సీలలో ‘కంటి వెలుగు’ సేవలందుతున్నాయి. జిల్లావ్యాప్తంగా వైద్య, ఆరోగ్య బృందాలు పని చేస్తుండగా, ఒక్కో బృందంలో ఐదుగురి నుంచి ఎనిమిది మంది సభ్యులు కంటి శిబిరాల్లో సేవలందిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 2,20,177 మందికి స్క్రీనింగ్ చేశారు. 40,534 మందికి రీడింగ్ గ్లాసెస్ పంపిణీ చేయడంతో పాటు 35,388 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాలు రావాల్సి ఉన్నది. కంటి సమస్యలు అధికంగా ఉన్నవారు ఆపరేషన్ చేయించుకునేందుకు రెఫర్ చేశారు. ఉచితంగా కంటి పరీక్షలు, మందులు, అద్దాలను అందిస్తుండడంతో పాటు అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుండడంతో ‘కంటి వెలుగు’ శిబిరాలకు విశేష స్పందన లభిస్తుండడం గమనార్హం.
చూపును కోల్పోయి అంధకారంలో మగ్గుతున్న ఎంతోమందికి తిరిగి చూపును ప్రసాదించే ప్రయత్నం, ఆయా సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు వైద్య సేవలందించే ఆలోచన చేసింది.. చేస్తున్నది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. 18 ఏండ్లకు పైబడిన ప్రతి ఒక్కరికి వైద్య, ఆరోగ్య పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు ‘కంటి వెలుగు’ చికిత్సా పూర్వక సేవలను విజయవంతంగా అందిస్తున్నది. ఇదివరకే ఈ కార్యక్రమాన్ని గతంలో నిర్వహించి రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు వైద్య సేవలను, అద్దాలను అందించి ప్రభుత్వ యంత్రాంగం సఫలీకృతమైంది. అవసరమైన వేలాది మందికి చికిత్సలు అందించారు. రెండో విడుతలో భాగంగా జనవరి 19 నుంచి జిల్లావ్యాప్తంగా ‘కంటి వెలుగు’ సేవలు మరోమారు ప్రారంభమయ్యాయి. కాగా, ఈ సేవలు జనానికి చూపును ప్రసాదిస్తూ జనరంజకంగా కొనసాగుతున్నాయి. రెండో విడుత కంటి వెలుగు ప్రారంభమై నెల రోజులు పూర్తయ్యాయి.
102 కేంద్రాల్లో సేవలు
జిల్లాలో ‘కంటి వెలుగు’ కార్యక్రమానికి 80 బృందాలు మాత్రమే ఉన్నప్పటికీ, అదనపు సేవలను కూడగట్టుకొని 102 కేంద్రాల్లో సేవలను డీఎంఅండ్‌హెచ్‌వో కార్యాలయం వారు ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. ప్రతి బృందంలో ఒక మెడికల్ ఆఫీసర్, ఒక ఆప్తాల్మాలజిస్ట్, ఒక సూపర్వైజర్, ఒక డీఈవో, ఇద్దరు ఏఎన్ఎమ్స్, ఇద్దరు/ముగ్గురు ఆశా వర్కర్లు పని చేస్తున్నారు. కాగా, 80 బృందాల్లో జిల్లా వ్యాప్తంగా 640 నుంచి 720 మంది వైద్య ఆరోగ్య నిపుణులు పని చేస్తున్నారు. కంటి వెలుగు కార్యక్రమం ద్వారా క్యాంపులను నిర్వహించి కంటి వ్యాధులున్న వారికి అవసరమైన చికిత్సలు ఉచితంగా అందిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఆయా బృందాలు కంటి సమస్యలతో బాధపడుతున్న వారిని గుర్తించే పనిలో ఉన్నాయి. జిల్లాలో ఇప్పటికే 58.02% అద్దాలను బాధితులకు పంపిణీ చేశారు.
అన్ని పీహెచ్సీలలో ‘కంటి వెలుగు’ సేవలు..
జిల్లాలోని 27 మండలాలు 558 గ్రామాల ప్రజానీకానికి అనుబంధంగా ఉన్న 35 పీహెచ్‌సీలు, 21 యూపీహెచ్‌సీలు, 2 పీపీ యూనిట్లు, 2 సీహెచ్సీలలో ‘కంటి వెలుగు’ సేవలు జోరుగా కొనసాగుతున్నాయి. జిల్లావ్యాప్తంగా ఇప్పటికే 2,20,177 మందికి కంటి పరీక్షలకు సంబంధించిన స్క్రీనింగ్ చేశారు. 40,534 మందికి రీడింగ్ అద్దాలు పంపిణీ చేశారు. ప్రత్యేకంగా అవసరం ఉన్నవారికి ప్రిస్క్రిప్షన్ ద్వారా అద్దాలు తయారు చేసి ఆ తరువాత ఇస్తున్నారు. ప్రస్తుతం 35,388 మందికి కంపెనీల నుంచి ప్రత్యేకంగా అద్దాలు రావాల్సి ఉంది. ఇంకా అవసరమైన చికిత్సలు ఉన్నవారికి అనంతర సేవలను కూడా అందిస్తున్నారు.
చూపులో ఇబ్బందులున్నవారికి సేవలందించేందుకే..
అంధత్వ నివారణతోపాటు ప్రతి ఒక్కరికీ కంటి సమస్యలకు సంబంధించిన వ్యాధులను నిర్మూలించి, సంపూర్ణంగా చూపునివ్వాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ‘కంటి వెలుగు’ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. 18 ఏండ్లు పైబడినవారికి కంటి పరీక్షలు చేసి, విలువైన చికిత్సలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నది. మొదటి విడుతలో 2018లో సేవలందించింది. ప్రస్తుతం రెండో విడుత బ్రహ్మాండంగా కొనసాగుతున్నది. జిల్లాలో లక్షలాది మందికి కంటి చూపు సేవలు అందుతున్నాయి. 40,534 రీడింగ్ అద్దాలను పంపిణీ చేశాం. 35,388 మందికి అవసరరమైన ప్రిస్ర్కైబ్డ్ అద్దాల కోసం ఆర్డర్ చేశాం.
– వెంకటేశ్వర్రావు, డీఎంఅండ్‌హెచ్‌వో
పరీక్షలు చేసిండ్రు
కండ్లు అస్సలు కనిపిస్తలేవు. అందుకే చెక్ చేపించుకోనీకె వచ్చిన. డాక్టర్ సార్లు మంచిగ కంటి పరీక్షలు చేసిండ్రు. దూరంగున్న వస్తువులు కనిపిస్తలేవు. ఆపరేషన్ అవసరమని చెప్పిండ్రు. అన్ని వివరాలు చెప్పిన. గప్పుడు నాకు కండ్లు కనిపిస్తలేవని ప్రైవేటు దవాఖానకు పొయిన. ఆపరేషన్ చెయ్యనీకె 20 వేల రూపాయలు అయితయని చెప్పిండ్రు. పైసల్లేక గమ్మున కూసున్న. ఇప్పుడు సర్కారోళ్లు పైసా ఖర్సులేకుంట చేపిస్తరని డాక్టర్లు చెప్పిండ్రు. శానా సంతోషంగ ఉన్నది.
–బాలమణి, పెద్దఅంబర్‌పేట
చూపు మందగించింది
రానురాను నా చూపు మందగిస్తోంది. పరీక్షలు చేయించుకోవాలనుకున్నా. ఇంతలోనే కేసీఆర్ సారు కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి ఊర్లకే వైద్యులను పంపి పరీక్షలు చేసి మందులు, అద్దాలు ఇచ్చేలా ఏర్పాటు చేశారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలతో మాలాంటి పేదలకు చాలా మేలు కలుగుతుంది. నాకు పరీక్షలు చేసి మందులు, అద్దాలు ఇచ్చారు.
–పి.నరేందర్‌రెడ్డి, తంగడిపల్లి, చేవెళ్ల మండలం
సీఎం కేసీఆర్ సారుకు రుణపడి ఉంటా..
కంటి వెలుగు శిబిరం పేదలకు వరంలా మారింది. గత ప్రభుత్వాలు 70 సంవత్సరాల పాలనలో ఇలాంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టలేదు. గతంలో కంటి పరీక్షల కోసం నగరానికి వెళ్లాల్సి ఉండేది. కేసీఆర్ సారు కంటివెలుగు వైద్య శిబిరం ఏర్పాటు చేయడంతో ఇబ్బందులు తప్పాయి. వైద్యులు గ్రామానికి వచ్చి ఉచితంగా కంటి పరీక్షలు చేసి, అద్దాలు, మందులు అందజేస్తున్నారు. కేసీఆర్ సారుకు రుణపడి ఉంటా.
– సువర్ణ, చేవెళ్ల