మొయినాబాద్ : గ్రామీణ రోడ్ల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అధిక నిధులు మంజూరు చేస్తుందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద 51మంది లబ్ధిదారులకు రూ. 51లక్షల చెక్కులు ఎంపీపీ గునుగుర్తి నక్షత్రం, జడ్పీటీసీ కాలె శ్రీకాంత్తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుపేద కుటుంబాల్లో పెళ్లి ఈడుకు వచ్చిన ఆడపిల్లల వివాహనికి ఆర్థికసాయం అందించాలనే దృఢ సంకల్పంతో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టి వారి కుటుంబాలకు అండగా ఉంటున్నారని పేర్కొన్నారు. మొయినాబాద్లో చిలుకూరు నుంచి వయా మొయినాబాద్ మీదుగా సురంగల్ గ్రామం వరకు రీ బీటీ రోడ్డు విస్తరణ పనుల కోసం రూ. 2.20కోట్లు మంజూరు అయ్యాయని, అదే విధంగా హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రోడ్డు నుంచి వయా ఎన్కేపల్లి గ్రామం మీదుగా బాకారం వరకు రీబీటీ కోసం రూ. 2కోట్లు మంజూరు అయ్యాని చెప్పారు.
అదే విధంగా చిన్నమంగళారం, నక్కలపల్లి వద్ద మూసీ, ఈసీల మీద వంతెన నిర్మాణాల కోసం సుమారుగా రూ. 10కోట్లు మంజూరు అయ్యాయని తెలిపారు. 5వేల హెక్టార్ల భూమి విస్తీర్ణానికి ఒక క్లష్టర్ను ఏర్పాటు చేసి ఒక రైతు వేదికను నిర్మించిన గొప్ప ప్రభుత్వం టీఆర్ఎస్దని అన్నారు.