కులకచర్ల, నవంబర్ 23 : రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్ని వర్గాల ప్రజలకు ఇబ్బందులు తప్పడంలేదు. పవర్లోకి వచ్చిన 11 నెలల కాలంలోనే విద్యుత్తు సరఫరా సక్రమంగా లేకపోవడంతో అన్నదాతలు.. పింఛన్లు రాక వృద్ధులు, దివ్యాంగులు, ఫీజు రీయింబర్స్మెంట్ సకాలంలో విడుదల కాక విద్యార్థులు.. ఇలా జనం బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. కాగా మండలంలోని రైతువేదిక భవనంలో శని వారం కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చీకట్లో జరిగింది.
చెక్కులను తీసు కునేందుకు లబ్ధిదారులు మధ్యాహ్నం రెండు గంటల సమయంలోనే వేదిక వద్దకు వచ్చారు. అప్పటి నుంచి పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి కోసం నిరీక్షించారు. ఇది గో ఎమ్మెల్యే వస్తున్నారు.. అదిగో వస్తున్నారని అధికారులు చెప్పడంతో అక్కడే చీకట్లో కూర్చుని పడిగాపులు కాశారు. సహనం కోల్పోయిన కొంతమంది లబ్ధిదారు లు ఎమ్మెల్యే ఇంకా ఎప్పుడు వస్తారని ప్రశ్నించారు.
మధ్యాహ్నం అని చెప్పి రాత్రి వరకు కూర్చోబెట్టడం సరికాదని ..రాత్రివేళ తమ గ్రామాలు, తండాలకు ఎలా వెళ్లాలని అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే రాత్రి 7:48 గంటలకు అక్కడికి రాగా.. తమకే ముందుగా చెక్కులను పంపిణీ చేయాలని పలు గ్రామాల లబ్ధిదారులు కోరడంతో అక్కడ కొద్దిసేపు గందరగోళ పరిస్థితి నెలకొన్నది. ఎమ్మెల్యే కల్యాణలక్ష్మి చెక్కులను బ్యాటరీలు, సెల్ఫోన్ల లైట్ల వెలుతురులో లబ్ధిదారులకు పంపిణీ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. తండాలకెళ్లే లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.