కడ్తాల్, నవంబర్ 10 : మండల కేంద్రం సమీపం నుంచి ఏర్పాటు చేస్తున్న 765 కేవీ హైటెన్షన్ విద్యుత్ లైన్ ఏర్పాటుకు రీ సర్వే చేపట్టవద్దని కడ్తాల్ గ్రామ రైతులు డిమాండ్ చేశారు. సోమవారం మండల కేంద్రంలో హైటెన్షన్ విద్యుత్‌లైన్ ఏర్పాటుకు పవర్‌గ్రిడ్ బీదర్ అధికారులు రీ సర్వే చేపడుతున్నారని సమాచారం అందండంతో, రైతులు పెద్ద సంఖ్యలో సర్వే చేపట్టిన స్థలానికి చేరుకొని సర్వేను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. పచ్చని పొలాల గుండా హైటెన్షన్ విద్యుత్ లైన్ ఏర్పాటుతో అన్నదాతలకు తీరని అన్యాయం జరుగుతుందని తెలిపారు.
కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ నుంచి కడ్తాల్ మండలం మీదుగా మహేశ్వరంలోని మీర్ఖాన్పేట్ వరకు ఏర్పాటు చేస్తున్న 765 కేవీ హైటెన్షన్ విద్యుత్ లైన్‌కు, కడ్తాల్ పట్టణం సమీపంలోనే నూతనంగా రీ సర్వే చేపట్టడం అన్యాయమని పేర్కొన్నారు. మండల కేంద్రానికి 50 మీటర్ల దూరంలో విద్యుత్‌లైన్ ఏర్పాటుకు పవర్‌గ్రిడ్ అధికారులు సర్వే చేపట్టడమేంటని వారు ప్రశ్నించారు. హైటెన్షన్ విద్యుత్ లైన్‌ను కొత్త రూట్లో వేయవద్దని వారు డిమాండ్ చేశారు. అనంతరం పవర్‌గ్రిడ్ డీజీఎం సంతోష్‌ను రీ సర్వే చేయవద్దని రైతులు కలిసి వినతిపత్రం అందజేశారు.