Rangareddy | యాచారం, జూన్9 : నకిలీ విత్తనాలతో రైతులు జాగ్రత్తగా ఉండాలని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్ శాస్త్రవేత్తలు శ్రీనివాస్, రాజేశ్వర్ నాయక్, కిరణ్ కుమార్ లు అన్నారు. మండలంలోని నస్విక్ సింగారం, మొండి గౌరెల్లి గ్రామాలలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సోమవారం రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. శాస్త్రవేత్తలు రసాయన ఎరువుల వాడకం, మైక్రో ఇరిగేషన్ సిస్టమ్స్, డ్రిప్ స్ప్రింక్లర్లను స్వీకరించడం ద్వారా నీటిపారుదల, నీటి వినియోగాన్ని తగ్గించూడం, సేంద్రీయ వ్యవసాయం, స్థిరమైన వ్యవసాయం గురించి, వాతావరణ మార్పుల గురించి రైతులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు మాట్లాడుతూ.. నకిలీ విత్తనాల పట్ల రైతులు జాగ్రత్తగా ఉండాలన్నారు. విత్తనాలు ఎరువులు మందులు కొనుగోలు చేసినప్పుడు తప్పనిసరిగా రసీదు తీసుకోవాలని సూచించారు. చెట్లను పెంచి పర్యావరణాన్ని కాపాడాలని రైతులను కోరారు. తక్కువ నీటితో ఎక్కువ సాగు చేసేందుకు డ్రిప్ స్ప్రింక్లర్ లను వాడాలని కోరారు. అంతర పంటల సాగుతో అధిక దిగుబడి పొందవచ్చు అన్నారు. ముఖ్యంగా పంట మార్పిడి తప్పనిసరి చేయాలని వారు సూచించారు. ఆధునిక పద్ధతులు, ఆధునిక యంత్రాలతో సాగు చేయడంతో అధిక దిగుబడితోపాటు అధిక లాభాలు పొందవచ్చు అన్నారు. పంట దిగుబడికి వ్యవసాయ అధికారుల సలహాలు సూచనలు తప్పనిసరి పాటించాలన్నారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ రాజేందర్ రెడ్డి, మండల వ్యవసాయ అధికారి రవినాథ్, వ్యవసాయ శాఖ సిబ్బంది, రైతులు ఉన్నారు.