ఆమనగల్లు, ఏప్రిల్ 14 : ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో దేశంలో 56 శాతం జనాభా ఉన్న బీసీలకు అన్ని రంగాల్లో 56 శాతం రిజర్వేషన్లు కల్పించేలా ప్రధాని మోదీ పార్లమెంట్లో బిల్లు పెట్టించి అమోదింపజేయాలని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆమనగల్లు పట్టణంలో నిర్వహించిన జయంతి వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ పాల్గొన్నారు. అనంతరం యువజన సంఘం అధ్యక్షుడు వగ్గు మహేష్‌తో కలిసి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహనికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామాని ఆయన తెలిపారు. ప్రస్తుతం దళితులకు 15 శాతం, గిరిజనులకు 6 శాతం మాత్రమే రిజర్వేషన్లు అమలు అవుతున్నాయాని ప్రస్తుత తరుణంలో ఎస్సీలకు 17 శాతం, ఎస్టీలకు 10శాతం రిజర్వేషన్లు అన్ని రంగాల్లో కల్పించి చట్టబద్దత చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. గత బీఆర్ఎస్ పాలనలో మండల పరిషత్ ఆవరణ ముందు బాగంలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు కోసం 600 గజాల స్థలాన్ని కేటాయించి మండల పరిషత్ జనరల్ బాడీ సమావేశంలో మరియు జిల్లా పరిషత్ జనరల్ బాడీ సమావేశంలో కూడా తీర్మానం చేయడం జరిగిందని ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ గుర్తు చేశారు.
ఈ స్థలంలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు రా్రష్ట్ర ప్రభుత్వమే రూ. 25 లక్షలు కేటాయించాలని జైపాల్‌యాదవ్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అంతకుముందే అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు కేటాయించిన స్థలాన్ని యువజన సంఘం నాయకులు, బీఆర్ఎస్ నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ పరిశీలించారు. కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు వగ్గు మహేష్, ప్రధాన కార్యదర్శి ఎనుమల్ల రమేష్, రాష్ట్ర సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షుడు లక్ష్మీనర్సింహ్మరెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సయ్యద్ ఖలీల్, వస్పుల సాయిలు, జంతుక అల్లాజీ, జహంగీర్, కొమ్ము ప్రసాద్ తదితరులు ఉన్నారు.