వికారాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ) : యాసంగి కొనుగోళ్లు పూర్తైనా సన్నరకం ధాన్యానికి బోనస్ చెల్లింపులపై కాంగ్రెస్ ప్ర భుత్వం నిర్లక్ష్యంగా వ్యవహస్తున్నది. కొనుగోళ్లు పూర్తై నెల రోజులు దాటినా ఆ ఊసే ఎత్తడంలేదు. సన్నాలు సాగు చేసిన రైతులకు క్వింటాల్‌కు రూ. 500 ఇస్తామని ప్రకటించిన సర్కార్ ఆ హామీని తుంగలో తొక్కింది. కేవలం ధాన్యాన్ని సేకరించిన వాటికే డబ్బు లు చెల్లించడంతో.. జిల్లాలోని రైతులు బోనస్ డబ్బులు ఇంకా అందకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.
సన్నరకం వడ్లకు బయట మార్కెట్లో అధిక ధర ఉన్నా బోనస్ కోసం రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించారు. యాసంగి సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ఏప్రిల్ నుంచి ప్రారంభమైనా ఇప్పటివరకు సన్నాలు పండించిన ఏ ఒక్క రైతుకు కూడా బోనస్‌ను ప్రభుత్వం అందించలేదు. యాసంగిలో జిల్లాలోని రైతుల నుంచి 8,921 మెట్రిక్ టన్నుల సన్నరకాన్ని ప్రభుత్వం సేకరించింది. ఇందుకు వారికి రూ.4.46 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉన్నది. బోనస్ డబ్బులను ఎప్పుడు చెల్లిస్తారని రైతులు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను నిలదీస్తున్నా ప్రభుత్వం ఇంకా ప్రకటన రాకపోవడం గమనార్హం.
సీఎంఆర్ ఇవ్వడంలో జాప్యం..
జిల్లాలో సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) ఇవ్వడంలో తీవ్ర జాప్యం జరుగుతున్నది. పౌరసరఫరాల శాఖ ఇచ్చిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి బియ్యంగా ఇవ్వాల్సిన రైస్‌మిల్లర్లు బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తూ అక్రమంగా ఆర్జిస్తున్నారు. మిల్లర్లపై సంబంధిత శాఖ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో సర్కార్కే టోకరా పెడుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం సీఎంఆర్ కింద ఇచ్చిన ధాన్యాన్ని మిల్లర్లు మిల్లింగ్ చేసి తిరిగి బియ్యం రూపంలో పౌరసరఫరాల శాఖకు విధించిన నిర్ణీత గడువులోగా ఇవ్వాల్సి ఉంటుంది.
కానీ, ఒకరిద్దరు మిల్లర్లు మినహా మిగిలిన వారందరూ పౌరసరఫరాల శాఖ మిల్లింగ్‌కు ఇచ్చిన ధాన్యాన్ని బ్లాక్ మార్కెట్‌కు తరలించి ఎలాంటి అనుమానం రాకుండా విడతల వారీగా పౌరసరఫరాల శాఖకు నాసిరకం బియ్యాన్ని అందజేస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. జిల్లాలో మిల్లర్ల నుంచి యాసంగికి సంబంధించి 20 శాతం మాత్రమే సీఎంఆర్ బియ్యంరాగా, మరో 80 శా తం మిల్లర్ల నుంచి రావాల్సి ఉన్నది.85,678 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ రైస్‌ను తిరిగివ్వాల్సి ఉండగా.. ఇప్పటివరకు 12,400 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ రైస్‌ను మాత్రమే మిల్లర్లు అందజేశారు.
బోనస్ మాటలకే పరిమితమైంది..
సన్న రకం ధాన్యానికి రూ. 500 బోనస్‌గా ఇస్తామని ప్రభుత్వం ప్రకటించి నెలలు గడుస్తున్నా ఇప్పటివరకూ ఆ డబ్బులు మాత్రం రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ కాలేదు. బోనస్ మాటలకే పరిమితమైనది. సన్న రకం సాగు చేసిన రైతులకు నిరాశే మిగిలింది. సన్న వడ్లకు బోనస్ వస్తుందని చాలామంది రైతులు దానిని సాగు చేశారు.
-ముక్తార్, రైతు, హస్నాబాద్.
కొడంగల్ నిరాశే మిగిలింది..
సన్న రకం ధాన్యాన్ని పండించిన రైతులకు రూ.500 బోనస్‌గా చెల్లిస్తామని రేవంత్‌డ్డి ప్రకటించారు. కానీ నేటి వరకూ ఏ ఒక్క రైతుకూ బోనస్ అందలేదు. ప్రభుత్వం ప్రకటించినట్లు సన్నరకాన్ని పండించిన రైతులందరికీ బోనస్ డబ్బులు చెల్లించాలి.
– హీరూనాయక్, సూర్యనాయక్‌తండా, బొంరాస్‌పేట