వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ సరిపోతదన్న కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల్లో గట్టి షాక్ ఇస్తామని జిల్లా అన్నదాతలు చెబుతున్నారు. రేవంత్‌రెడ్డి అవగాహనలేని ప్రకటనలిస్తూ అన్నదాతలను ఆందోళనకు గురి చేస్తుండడంపై భగ్గుమంటున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు అరిగోస తప్పదని అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ హయాంలో పడిన కష్టాలు ఎప్పటికీ మరిచిపోలేమంటున్నారు. రాత్రనక, పగలనక కరెంట్ కోసం పడిగాపులు కాసేవాళ్లమని గుర్తుచేసుకుంటున్నారు. విద్యుదాఘాతాలు, పాములు, తేళ్ల కాటుకు బలైన ఘటనలు ఇప్పటికీ కండ్లముందే కదలాడుతున్నాయని, అలాంటి పాత రోజులను మళ్లీ తెచ్చుకొనే ప్రసక్తేలేదని కుండ బద్దలు కొట్టినట్లు చెబుతున్నారు.
మూడు గంటల కరెంట్‌తో కనీసం ఒక మూల కూడా తడవని పరిస్థితి.. కాంగ్రెస్ నేతలకు తెలువదా అన్ని ప్రశ్నిస్తున్నారు. నిరంతరం కరెంటిచ్చి, పుష్కలంగా సాగునీరిచ్చి బీడుభూములను సైతం సాగులోకి తెచ్చిన ఘనత బీఆర్ఎస్దేనన్నారు. ప్రస్తుతం జిల్లాలో 3.50 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం ఉందంటే సీఎం కేసీఆర్ సుపరిపాలననే కారణమన్నారు. కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా మరోసారి బీఆర్ఎస్ను గెలిపించుకుంటామని రైతులు చెబుతున్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 3 గంటల కరెంటు ఇస్తామని ఊకదంపుడు ప్రకటనలు చేస్తున్నది. వ్యవసాయానికి 24 గంటల కరెంటు అవసరం లేదు.. 3 గంటలు చాలు అంటున్న కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు చూస్తే గతంలోని కష్టాలు మళ్లీ చూడాల్సి వస్తుందేమోనని రైతులు భయాందోళనలు చెందుతున్నారు. కాంగ్రెస్ హయాంలో బోర్లు, బావుల్లో నీరు ఉన్నా సాగుకు నోచుకోని పరిస్థితి. కాంగ్రెస్ హయాంలో కరెంట్ ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి.
రాత్రి సమయాల్లో దీపాలు పట్టుకుని బోర్ల వద్దకెళ్లి కరెంట్ కోసం పడిగాపులు కాయాల్సి వచ్చేది. ఇప్పుడు కాంగ్రెస్ నేతలు తాము అధికారంలోకి రాగానే 3 గంటల కరెంట్ ఇస్తామని రైతులను మోసం చేయాలని చూస్తున్నది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అవకాశమిస్తే కష్టాలు తప్పవని జిల్లా రైతులు ఆందోళన చెందుతున్నారు. 2014లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 24 గంటల కరెంట్ ఇచ్చి రైతన్నలను ఆదుకున్నది.
తెలంగాణ వచ్చాకే రైతుల దశదిశ మారింది. గత ఉమ్మడి పాలనలో విద్యుత్ కోతలతో సతమతమయ్యేవాళ్లం. ఎప్పుడు కరెంటు వస్తుందో తెలియక పొలం వద్దనే కాలం గడిపేవాళ్లం. ఎక్కువగా రాత్రి సమయాల్లోనే విద్యుత్ సరఫరా చేసేవారు. దీంతో రైతన్నలు చీకట్లో పొలం వద్దకు వెళ్తూ విషసర్పాల కాటుకు, విద్యుత్ ప్రమాదాలకు గురై మృతి చెందేవారు. కోతల కరెంటుతో ఏదైనా శుభ, అశుభకార్యాలు ఉంటే వెళ్లేవాళ్లం కాదు. పొలం వద్దనే పడిగాపులు కాసేవాళ్లం. కాంగ్రెస్ నాయకులు నేడు వ్యవసాయం పట్ల ఎలాంటి సోయి లేకుండా మాట్లాడడం సరికాదు. మిషన్ కాకతీయ పథకం ద్వారా భూగర్భ జలాలు పెరిగాయి.
వ్యవసాయానికి మావద్ద చాలా మేరకు 5 హెచ్‌పీ మోటర్లు మాత్రమే వాడుతున్నారు. ఎవరూ కూడా 10 హెచ్‌పీ మోటర్లు వాడరు. కాంగ్రెస్ నాయకులు వ్యవసాయదారులకు కేవలం 3 గంటల కరెంట్ సరిపోతుందని, 10 హెచ్‌పీ మోటర్లతో వ్యవసాయం చేయాలంటూ చెప్పడం వారి అవివేకానికి నిదర్శనం. రైతుల కష్టాలు తెలియకుండా కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మాట్లాడడం విడ్డూరంగా ఉంది. తెలంగాణ వచ్చాకే 24 గంటల విద్యుత్‌తో రైతులు హాయిగా వ్యవసాయం చేసుకుంటూ కుటుంబంతో సంతోషంగా ఉన్నాం.
– నర్సింహులు, చిన్న ఎల్కిచర్ల, షాద్‌నగర్
వ్యవసాయానికి 3 గంటల కరెంట్ సరిపోతుందన్న కాంగ్రెస్ పార్టీని రైతులమందరం కలిసి ఇంటికి పంపుతాం. కాంగ్రెస్ వస్తే మళ్లీ పాతరోజులు వచ్చేలా ఉన్నాయి. రాత్రింబవళ్లు బోర్ల దగ్గర ఉన్న రోజులు రైతులెవరూ ఇప్పటికీ మరిచిపోలేరు. 3 గంటల కరెంటు సరిపోతుందన్న రేవంత్‌రెడ్డిని సాగనంపాలి. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేయాలి. మళ్లీ బీఆర్ఎస్ వస్తేనే వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్ ఉంటుంది. కేసీఆర్ సీఎం అయితేనే రైతులకు మేలు జరుగుతుంది.
– మధుసూదన్‌రావు, మల్లాపూర్, కొత్తూరు
గత సీమాంధ్ర పాలనలో కాంగ్రెస్ సర్కారు హయాంలో ఎప్పుడు కరెంటు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియదు. రాత్రివేళల్లో పొలం వద్దకు పోయి కరెంటు షాక్‌లు, పాములు కరవడం వంటి ప్రమాదాలు జరిగి రైతులు చనిపోయేవారు. ఈ కష్టాలు తీర్చేందుకు 3 గంటల కరెంట్‌తో 10 గుంటల భూమి కూడా తడవదు. సీఎం కేసీఆర్ 24 గంటలు కరెంట్ ఇస్తుంటే.. అది ఓర్వలేక కాంగ్రెస్ నాయకులు 3 గంటలే ఇస్తాం అంటూ బయలుదేరడం సిగ్గుచేటు. కష్టాలకు గురిచేసే కాంగ్రెస్‌కు మరోసారి ఓటుతోనే బుద్ధి చెప్పాలి.
– బాలుగౌడ్, ఇబ్రహీంపట్నంరూరల్
కాంగ్రెస్ నేతలు చెబుతున్నట్లుగా 10 హెచ్‌పీ పంపు వాడటం వల్ల రైతులకు మోయలేని భారంగా మారుతుంది. మార్కెట్లో లభించే ఒక్కో పంపు సగటు ధర రూ.50వేల వరకు ఉంది. మోటర్తో పాటు పైపులు, క్లాంపులు, వైర్లు, డబ్బా, స్ట్రాటర్కు మరో రూ.50వేల వరకు ఖర్చవుతుంది. దీంతో ఒక్కో మోటర్‌కు రూ.లక్ష వరకు ఖర్చు వస్తుంది. నీరు పుష్కలంగా ఉంటేనే 10 హెచ్‌పీ మోటర్తో ఉపయోగం. లేదంటే మొదటికే మోసం వస్తుంది. అందుకే బోర్లకు 3 హెచ్‌పీ, 5 హెచ్‌పీ మోటర్లను వాడుతారు. ఇవన్నీ తెలువని కాంగ్రెస్ నాయకులు రైతులను ఇబ్బందులకు గురిచేసేందుకు ఏదేదో మాట్లాడుతున్నారు. కేసీఆర్ నేతృత్వంలో 24 గంటల నిరంతర కరెంట్‌తో రైతులు సంతోషంగా వ్యవసాయం చేసుకుంటున్నారు. మేమంతా కేసీఆర్ వెంటే ఉంటాం.
– పి. కృష్ణయ్య, రైతు, కుమ్మరిగూడ, షాబాద్
రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు రైతులకు ఏమాత్రం ఉపయోగపడనివి. పనికిమాలిన హామీలు చెయ్యడంతప్ప కాంగ్రెస్ వాళ్లకు మంచి చేయడం తెలియదు. ఆయన చెప్పినట్లు 3 గంటల విద్యుత్ సరిపోతుందనడంలో అజ్ఞానం తప్ప మరేం లేదు. 10 హెచ్‌పీ మోటర్తో ఒక బావిలో గంటన్నరలోపు నీళ్లు ఖాళీ అయిపోతాయి. తరువాత ఇబ్బంది అవుతుంది. రైతులందరూ ఒకేసారి నీరు పారిస్తే మోటర్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతాయి. మళ్లీ పాత కథ మొదటికి వస్తుంది. రైతుల బాధలు తెలిసినోళ్లు ఇలా మాట్లాడరు. ముఖ్యమంత్రి రైతు కష్టాలు తెలిసినవాడు. కాంగ్రెస్ మాయమాటలు నమ్మే స్థితిలో ప్రజలు, రైతులు లేరు. 24 గంటల విద్యుత్ సరఫరా ఉండాలంటే కేసీఆర్ సర్కార్ మళ్లీ రావాలి. సీఎం కేసీఆర్‌కే మా రైతులందరి మద్దతు.
– పెంటారెడ్డి, రైతు, సింగప్పగూడ, చేవెళ్ల
రైతులు వ్యవసాయానికి 10 హెచ్‌పీ మోటర్లు పెట్టుకోవాలని రేవంత్‌రెడ్డి అనడం బాధాకరం. ప్రస్తుతం రైతులు 3 హెచ్‌పీ, 5 హెచ్‌పీ మోటర్లే వాడుతున్నారు. కాని, 10 హెచ్‌పీ మోటర్లు పెట్టుకుని 3 గంటల పాటు విద్యుత్ ఇస్తే సరిపోతుందని కాంగ్రెస్ నాయకులు వాదిస్తున్నారు. 10 హెచ్‌పీ మోటర్లు అనేది సరైన చర్యకాదు. కాంగ్రెస్‌కు ఓట్లేస్తే మళ్లీ విద్యుత్ సరఫరా అస్తవ్యస్తంగా మారడంతో పాటు రైతులు కూడా ఇబ్బందులకు గురికావాల్సి వస్తుంది.
– జైపాల్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం
24 గంటల ఉచిత విద్యుత్‌తో రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారు. ప్రభుత్వం ఇస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్‌తో వ్యవసాయ సాగుకు అనుకూలంగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మళ్లీ 3 గంటలే విద్యుత్ ఇవ్వాలని యోచిస్తున్నది. దీంతో కరెంటు కష్టాలు తప్పవు. దీనిని గమనించి ప్రజలంతా 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్న బీఆర్ఎస్కు ఓటు వేసి గెలిపించాలి. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కరెంటు ఎప్పుడు వస్తుందో.. పోతుందో తెలియక రైతులు పొలాల వద్దనే పడుకుని విద్యుత్ షాక్‌కు గురై మరణించేవారు. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే మరోమారు బీఆర్ఎస్ గెలువాలి.
– చెరుకూరి రవీందర్, ఇబ్రహీంపట్నం
ఓట్లేస్తే గ్రామాల్లో మళ్లీ చీకటి రోజులు చూడాల్సి వస్తుంది. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తరచుగా విద్యుత్ కోతలు, మరోవైపు లోవోల్టేజీ సమస్యతో మోటర్లు కాలిపోయేవి. వ్యవసాయానికి ఏమాత్రం కరెంటు సరిపోక రైతులు పంటలు ఎండిపోయి తీవ్రంగా నష్టపోయేవారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 24 గంటల కరెంటు ఇస్తుండటంతో రైతులు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకుని ముందుకెళుతున్నారు. రైతులు క్షేమంగా ఉండటం కాంగ్రెస్‌కు ఇష్టంలేదు. కాంగ్రెస్‌కు ఓట్లేస్తే కష్టాలు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరోమారు బీఆర్ఎస్ను గెలిపించుకోవాలి.
– కాయితి మోహన్‌రెడ్డి, ఇబ్రహీంపట్నంరూరల్
ప్రభుత్వం అందిస్తున్న 24 గంటల కరెంట్‌తో ఆనందంగా వ్యవసాయం చేసుకుంటున్నాం. ఉదయం పొలం వద్దకు వచ్చి బోర్ మోటర్ ఆన్ చేసి, సాయంత్రం ఇంటికి వెళ్లేటప్పుడు మోటర్ బంద్ చేసి వెళ్తున్నాం. కాంగ్రెస్ నాయకులు వ్యవసాయంపై అర్థం లేకుండా మాట్లాడుతున్నారు. వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ సరిపోతుంది అనడం వారి అవివేకం. పొలాల వద్ద 3 హెచ్‌పీ, 5 హెచ్‌పీ మోటర్లనే వాడుతారు. 10 హెచ్‌పీ మోటర్తో రైతుకు ఖర్చు ఎక్కువ అవ్వడమే కాకుండా బోర్లు ఎండిపోవుడు ఖాయం. ఈ మోటర్లను బిగించి రైతులందరూ ఒకేసారి బోర్లు ఆన్‌చేస్తే ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతాయి. కాంగ్రెస్ పాలనలో వ్యవసాయం పాడైపోయింది. కరెంట్ ఎప్పుడు వచ్చేదో, ఎప్పుడు పోయేదో తెలువకపోతుండే. కాంగ్రెస్ హయాంలో రాత్రిపూట వదిలే కరెంట్‌తో అనేక ఇబ్బందులుపడ్డాం. వ్యవసాయానికి 24 గంటల కరెంట్ అందిస్తున్న సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు.
– బాచిరెడ్డి సుధాకర్‌రెడ్డి, కడ్తాల్
10 హెచ్‌పీ మోటర్లతో రైతులకు లక్షల రూపాయల ఖర్చు అవుతుంది. మూడు గంటల కరెంట్ సరిపోతుందని కాంగ్రెస్ నాయకులు అనడం వ్యవసాయంపై వారికి అవగాహన లేకపోవడమే. 10 హెచ్‌పీ మోటర్ ఒకసారి కాలిపోతే బాగుచేసేందుకు రైతుకు పదివేల రూపాయల వరకు ఖర్చవుతుంది. 3 హెచ్‌పీ, 5 హెచ్‌పీ మోటర్లతోనే రైతులకు మేలు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇస్తున్న 24 గంటల కరెంట్‌తో ఇబ్బందులు లేకుండా వ్యవసాయం చేస్తున్నాం. రైతుల పక్షాన ఉన్న ప్రభుత్వానికి అండగా ఉంటాం.
– బోల్ల జంగయ్య, దేవునిపడకల్, తలకొండపల్లి