యాచారం, ఏప్రిల్ 21: అసలే ఎండాకాలం ఆపై మండలంలో ఒకపక్క చెరువులు, కుంటలు ఎండిపోవడం మరో పక్క వ్యవసాయ బోర్లు క్రమక్రమంగా ఆగుతూ పోయడంతో రైతన్నలకు సాగునీటి కష్టాలు మొదలయ్యాయి. మండే ఎండలతో వరి పంట ఎండు ముఖం పడుతున్నది. పంట చేతికొచ్చే సమయంలో కండ్లముందే పంటలు ఎండిపోవడంతో రైతన్నలు అల్లాడుతున్నారు. గత పదేళ్ల తరువాత చెరువు, కుంటలు చుక్కనీరు లేకుండా ఎండిపోవడంతో భూగర్భజలాలు అడుగంటి పాతాలగంగ పైకి రాలేకపోతున్నది. దీంతో మండలంలో అత్యంత కరువు, కాటకాలు అలుముకుని అన్నదాతలు అల్లాడుతున్నారు. ఇప్పట్టికే మండలంలోని అన్ని చెరువు, కుంటలు పూర్తిగా చుక్కనీరు లేకుండా ఎండిపోయాయి. దీంతో సాగునీటి ఎద్దడి రైతన్నలకు భారమైపోయింది. గతంతో పోలిస్తే పంటల సాగు సైతం ఘననీయంగా తగ్గింది. ముఖ్యంగా వరి పంటసాగు చాలా తగ్గింది. ఒకప్పుడు ఆయకట్టు ప్రాంతాల్లో విస్తారంగా పంటలు పండిన భూములు నేడు సాగునీరు లేకా ప్రస్తుతం ఆ భూములు బీడు భూములుగా మారాయి. రైతులు ఆహార పంటలను వదిలేసి వాణిజ్య పంటలపై మక్కువ పెంచుకుంటున్నారు. అందులోనూ నష్టాలు రావడంతో, కొంతమంది రైతులు ఉన్నకొద్దిపాటి నీటితో డ్రిప్పు పద్దతితో కూరగాయల సాగును చేస్తున్నారు. బోరుబావులు ఎండి పోవడంతో కూరగాయలు సైతం ఎండిపోతున్నాయని రైతులు వాపోతున్నారు.
మండలంలో ఈ మధ్య కాలంలో ఆశించిన స్థాయిలో అసలే వర్షాలు కురువకపోవడంతో భూగర్బజలాలు పూర్తిగా అడుగంటి పోయాయి. బోరుబావుల్లో ఉన్న నీరు పాతాళానికి పడిపోయింది. వేసవికాలం ఆరంబంలోనే సాగునీటి సమస్యతో రైతులు ఎంతో సతమతమవుతున్నారు. ఇప్పటికే కొన్ని బోరుబావులు ఆగుతూ పోస్తుండగా, మరికొన్ని పూర్తిగా ఎండి పోయాయి. నూతనంగా ఎన్నిబోర్లు వేసినా ఫలితం లేకుండా పోతుంది. 500 ఫీట్లలోతు వరకు వేసినా దుమ్ము, దూలి తప్ప చుక్క నీరు రాకపోవడంతో రైతులు లబోదిబో మంటున్నారు. వ్యవసాయాన్నే నమ్ముకున్న రైతులు చేసేదేమిలేక ఉన్న కొద్దిపాటి నీటితో పంటలు సాగుచేస్తున్నారు. పెట్టుబడులు కూడా రాకపోవడంతో అప్పుల ఊబిలో చిక్కుకుని కొట్టుమిట్టాడుతున్నారు. దీనికితోడు పశుగ్రాసం కొరతతో పశువుల పోషణ సైతం రైతులకు భారమై పోయింది. కరువుతో పోటీ పడలేని రైతులు ఏకంగా వ్యవసాయానికే స్వస్తీ పలికి కొంత మంది ఉపాధిహామీ పథకం పనులకు వెళ్ళగా, మరికొంత మంది పట్టణాలకు వలసలు వెలుతున్నారు. వర్షాలు సమృద్ధిగా కురిస్తేతప్పా పంటలు సాగు చేయడం ఎంతో కష్టమని రైతులు వాపోతున్నారు. రాబోయే రోజుల్లో వర్షాలు కురువకపోతే వ్యవసాయం పూర్తిగా కనుమరుగవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలానికి సాగునీరు తీసుకొచ్చి రైతుల కష్టాలు తీర్చాలని ప్రజలు, ప్రజాప్రతినిధులు కోరుతున్నారు.
ఒకవైపు మండుతున్న ఎండలు.. మరోవైపు నీటి సమస్యతో పంటలు ఎండిపోతున్న తరుణంలో రైతన్నలకు ఇది చాలదన్నట్టు అప్రకటిత విద్యుత్ కోతలు అసలు సమస్యగా మారింది. వ్యవసాయానికి సైతం ఎడాపెడా కోతలు విధించడంతో పంటల తడారడంలేదని రైతులు వాపోతున్నారు. దీంతో పంటలు ఎండిపోవడానికి ఎండలు, సాగునీటి ఎద్దడితో పాటు విద్యుత్ కోతలు రైతన్నలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. కొన్ని చోట్ల లోఓల్టేజ్, మరికొన్ని చోట్ల ఓవర్‌లోడ్‌తో మోటార్లు చెడిపోవడం జరుగుతున్నదని రైతులు పేర్కొంటున్నారు. వాటిని మరమ్మతు చేయించేలోపు సాగునీరు పంటలకు సరిపడా అందక పంటలు ఎండిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. విద్యుత్ కోతలు లేకుండా వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్‌ను పరఫరా చేయాలని రైతులు కోరుతన్నారు.
ఈ ఏడాది వేసవిలో ఆరంభం నుంచే ఎండలు మండిపోవడం, మరో వైపు పంటలు ఎండిపోవడం రైతన్నలకు కంటినిండా కునుకు లేకుండా పోతుంది. పంటలకు సరిపడ సాగు నీరులేక పోవడంతో కూరగాయల పంటలు ఎండుముఖం పట్టగా వరిపంట క్రమంగా ఎండిపోతుంది. బోర్లు ఆపుతూ పోయడంతో పంటలకు పూర్తి స్థాయిలో నీరందక అవి ఎండిపోతున్నాయి. పంటలను కాపాడుకునేందుకు రైతులు పగలు రాత్రి కష్టపడుతున్నారు. అసలే సాగునీటి సమస్యతో సతమతమవుతున్న రైతులకు టమాట, ఉల్లి పంటలకు సరిపడా ధరలేక అల్లాడుతున్నారు. ఎండిపోతున్న పంటలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని రైతులు కోరుతున్నారు.
ఎండిపోయిన పంటలకు సాగునీరు సక్రమంగా అందకపోవడంతో రైతులు చేసేదేమిలేక ట్యాంకర్ల ద్వారా పంటలకు నీరందిస్తున్నారు. నానక్‌నగర్ గ్రామానికి చెందిన జోగు విజయ అనే మహిళా రైతు అప్పుచేసి ఒక్కో ట్యాంకర్‌కు రూ, 1000 ఖర్చుతో వరి పంటకు నీరందించి కాపాడుకునేందుకు ఆమె తాపత్రాయపడుతున్నది. మండలంలోని మేడిపల్లి, నానక్‌నగర్, తాటిపర్తి, కుర్మిద్ద, చింతపట్ల, కొత్తపల్లి, తమ్మలోనిగూడ, నల్లవెల్లి, మంథన్‌గౌరెల్లి తదితర గ్రామాలలో మండుతున్న ఎండలకు పంటలు ఎండిపోతున్నట్లు రైతులు పేర్కొంటున్నారు. వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఎండిపోయిన పంటలను గుర్తించి రైతులకు తగిన నష్టపరిహారాన్ని అందించాలని రైతులు కోరుతున్నారు.