సిటీబ్యూరో, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలోని వైద్య, ఆరోగ్యశాఖ అవినీతి, అక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. నర్సింగ్ ఆఫీసర్ల బదిలీల దగ్గర నుంచి మొదలు పెడితే వైద్యుల బదిలీలు, పదోన్నతులు, ఇలా ఏ విభాగంలో చూసినా అవినీతి, అక్రమాలు రాజ్యమేలుతున్నట్లు అన్ని స్థాయిల ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నర్సింగ్ ఆఫీసర్ల బదిలీల సమయంలో కూడా పెద్ద ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపిస్తూ బాధితులు ఇటీవల కోఠిలోని డీహెచ్ కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. ఇలా బదిలీలు జరిగినా, పదోన్నతులు వచ్చినా, పోస్టింగ్‌లు ఇచ్చినా అర్హులైన వారికి మాత్రం అన్యాయమే జరుగుతున్నట్లు బాధిత ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) పరిధిలోని బయో కెమిస్ట్‌ల పదోన్నతులలో అక్రమాలు చోటు చేసుకుంటున్నట్లు బాధిత ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. కొందరు ఉద్యోగులు తమ పలుకుబడిని ఉపయోగించుకుని, డబ్బుతో అక్రమ మార్గంలో పదోన్నతులను కొంటున్నట్లు అర్హులైన ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. దీని వల్ల సంవత్సరాల తరబడి కష్టపడి పనిచేస్తున్న తమకు తీవ్ర అన్యాయం జరుగుతున్నట్లు వారు వాపోతున్నారు. ఆరోగ్యశాఖలో డీఎంఈ పరిధిలోని బయోకెమిస్ట్ల పదోన్నతులకు సంబంధించిన ప్రక్రియను మొదలుపెట్టారు. బయోకెమిస్ట్ పదోన్నతికి ఎమ్మెస్సీ బయో కెమిస్ట్రీ పూర్తిచేసిన ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-II ఉద్యోగులు అర్హులు. ఈ క్రమంలో అర్హులైన ఉద్యోగులు పూర్తి వివరాలు సమర్పించాల్సిందిగా గత సంవత్సరం అక్టోబర్‌లో ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేశారు. ఉద్యోగులు సమర్పించిన వివరాల ఆధారంగా ఈ సంవత్సరం మే 14న ప్రొవిజినల్ సీనియారిటీ లిస్ట్‌ను రూపొందించి, విడుదల చేశారు. ఈ ప్రొవిజనల్ లిస్ట్‌లో కొన్ని ముఖ్యమైన నిబంధనలను పొందుపరిచారు.
నిబంధనలకు విరుద్ధంగా…
1. ప్రొవిజనల్ సీనియారిటీ లిస్ట్‌లోని నిబంధనల ప్రకారం ఇన్‌సర్వీస్‌లో ఉన్న ఉద్యోగులు సంబంధిత విభాగం నుంచి ముందస్తు అనుమతి పొంది, దూర విద్య ద్వారా ఎమ్మెస్సీ పూర్తిచేసిన వారు మాత్రమే అర్హులు.
2.ప్రియర్ పర్మిషన్, యూజీసీ గుర్తింపు, జన్యూనిటీ సర్టిఫికెట్ ఉన్నవారు మాత్రమే తుది జాబితాకు అర్హులు. ఇవి లేని వారు 7రోజుల్లోపు సమర్పించాల్సిందిగా గడువు విధించారు. 7రోజుల్లో సంబంధిత సర్టిఫికెట్లు సమర్పించని వారి పేర్లను పదోన్నతులకు సంబంధించిన తుది జాబితా నుంచి తొలగిస్తామని పేర్కొన్నారు. కానీ ముందస్తు అనుమతి లేకుండా ఎమ్మెస్సీ పూర్తి చేసిన ఉద్యోగులు, అభ్యర్థులు, చేసిన డిగ్రీకి యూజీసీ గుర్తింపు లేనివారు, అర్హతకు సంబంధించిన అన్ని సర్టిఫికెట్లు సరైనవే అంటూ ధృవీకరించే జన్యునిటీ సర్టిఫెట్లు సమర్పించని ఉద్యోగుల పేర్లు సైతం పదోన్నతులకు సంబంధించిన తుదిజాబితాలో పొందుపర్చడంతో అర్హులైన ఉద్యోగులకు తీవ్ర నష్టం కలుగుతోందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
నిబంధనల ప్రకారం…ప్రతి సంవత్సరం ఆగస్టు 31కి ప్యానల్ ఇయర్ ముగింపు ఉంటుంది. పదోన్నతలకు సంబంధించిన డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ(డీపీసీ) ప్రక్రియను ప్యానల్ ఇయర్ ముగింపులోపు పూర్తిచేయాలి. అంటే ఆగస్టు 31లోపు పూర్తిచేయాలి. అంతే కాకుండా డీపీసీ ఏర్పాటుకు కనీసం 15 నుంచి నెల రోజుల ముందు పదోన్నతులకు సంబంధించిన తుదిజాబితా విడుదల చేయాలి. తుదిజాబితా విడుదల చేసిన తర్వాత ఏసీఆర్(గత 5సంవత్సరాలకు సంబంధించిన ఆన్యువల్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్), ఏపీఆర్(ఆన్యువల్ ప్రాపర్టీ రిపోర్ట్)ను సమర్పించాల్సి ఉంటుంది. ఈ నివేదికలు సమర్పించేందుకు కనీసం వారం పదిరోజుల సమయం ఇవ్వాలి. కానీ ప్రస్తుతం జరుగుతున్న బయోకెమిస్ట్(గెజిటెడ్) పదోన్నతుల ప్రక్రియలో మాత్రం నిబంధనలకు విరుద్ధంగా డీపీసీకి 15రోజుల ముందు విడుదల చేయాల్సిన తుది జాబితాను కేవలం 2రోజుల ముందు విడుదల చేశారు. అంతే కాకుండా ఏసీఆర్, ఏపీఆర్ నివేదికలు లేకుండానే తుది జాబితాను విడుదల చేయడం దారుణమని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏసీఆర్, ఏపీఆర్ నివేదికలు ఒక్క రోజులోనే ఎలా సమర్పిస్తారో ఉన్నతాధికారులకే తెలియాలని మండిపడుతున్నారు.
నిబంధనల ప్రకారం ప్రొవిజనల్ సీనియారిటీ లిస్టులో ఉన్న వారికే పదోన్నతులు కల్పిస్తారు. కానీ ప్రొవిజనల్ లిస్టులో లేని ఒక ఉద్యోగి పేరును అక్రమ మార్గంలో తుదిజాబితాలోని 5వ స్థానంలో చేర్చి, పదోన్నతి కట్టబెట్టినట్లు తోటి ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఈ అక్రమ పదోన్నతి కల్పించడంలో పెద్ద ఎత్తున ముడుపులు చేతులు మారినట్లు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. అంతే కాకుండా ఇద్దరు ఉద్యోగుల పదోన్నతులకు సంబంధించి హైకోర్టులో కేసు విచారణ ఉండటంతో పాటు తుది తీర్పు వెలువడే వరకు వారికి ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-1 మాత్రమే ఇవ్వాలని న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసిందని, కాని కొందరు ఉన్నతాధికారులు పెద్దఎత్తున డబ్బులు తీసుకుని కోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా అనర్హులకు గెజిటెడ్ ర్యాంక్ పదోన్నతి కల్పించినట్లు అర్హులైన ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. కాగా, బయోకెమిస్ట్ పదోన్నతుల్లో జరిగిన అక్రమాలపై ఇప్పటికే కొందరు ఉద్యోగులు న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు సమాచారం.