రంగారెడ్డి, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ) : యాసంగి సీజన్ ముగుస్తున్నప్పటికీ అన్నదాతలకు రైతు భరోసా కింద పెట్టుబడి సాయం నేటికీ అందలేదు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం ఎన్నికల కోడ్ అమలులో ఉందంటూ రైతు భరోసా నిధులను నిలిపివేసింది. ఎన్నికలు ముగిసి 15 రోజులు కావస్తున్నప్పటికీ సాయం ఊసే ఎత్తడంలేదు. వ్యవసాయాన్ని బలోపేతం చేయాల్సిన సర్కారు రైతులకు పెట్టుబడి సాయం అందించకపోగా.. యూరియా కూడా అందుబాటులో లేకపోవడంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
పెట్టుబడి సాయంలో ఏటా కోతలు విధించడమే కాకుండా సాగు చేసిన భూమికే పెట్టుబడి సాయం ఇస్తామన్న ప్రభుత్వం ఆ నిధులను కూడా జమచేయడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వానకాలం సీజన్లోనూ రైతు భరోసాను నాలుగెకరాల వరకు మాత్రమే వేసి సర్కారు చేతులు దులుపుకొన్నదని విమర్శలొస్తున్నాయి. పంటలు చేతికందే సమయంలో కూడా పెట్టుబడి సాయం అందించకపోవడంతో తాము పండించిన పంట అంతా వడ్డీ వ్యాపారులకే చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నదాతలు వాపోతున్నారు.
రంగారెడ్డి జిల్లాలో రైతు భరోసాకు అర్హులైన రైతులు 2,82,853 మంది ఉన్నారని ప్రభుత్వం ప్రకటించింది. 2025 వర్షాకాలం సీజన్లో జిల్లాలోని ఈ రైతులకు సర్కారు రూ.323.43 కోట్లను., గత 2024-25 సంవత్సరంలోని యాసంగికి 2,19,418 మంది రైతులకు రూ.180.92 కోట్లు విడుదల చేసింది. కాని, ఈ యాసంగి సీజన్ ముగుస్తున్నప్పటికీ రైతు భరోసా నిధులు విడుదల కాలేదు. వెంటనే భరోసా నిధులు విడుదల చేయాలని పలువురు రైతులు కోరుతున్నారు. మళ్లీ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు వస్తే కోడ్ ఉందనే సాకుతో భరోసా నిధులు నిలిచిపోతాయని అన్నదాతలు భయపడుతున్నారు.
రైతు భరోసా నిధుల విడుదలలో సర్కారు అనేక రకాల కోతలను విధిస్తున్నదని పలువురు రైతులు వాపోతున్నారు. గత వర్షాకాలం సీజన్లో ఓఆర్ఆర్ లోపల ఉన్న గ్రామాల్లో వ్యవసాయమే లేదంటూ ఓఆర్ఆర్ లోపల ఉన్న గ్రామాలన్నింటికీ రైతు భరోసాను ప్రభుత్వం నిలిపివేసింది. దీంతో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహించారు. ఈ విషయంపై అనేక రకాలుగా బీఆర్ఎస్ నిర్వహించిన ఆందోళనలకు ఫలితంగా ఓఆర్ఆర్ లోపల గ్రామాల్లో కూడా సర్కారు దిగివచ్చి రైతు భరోసా నిధులు విడుదల చేశారు. మళ్లీ ఈ యాసంగి సీజన్లో శాటిలైట్ ద్వారా పంటలు సాగు చేసిన భూములను గుర్తించి వాటికే రైతు భరోసా నిధులిస్తామని ప్రభుత్వం చెప్తుండటంతో అన్నదాతలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎకరాకు రెండు విడతల్లో రూ.15వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించిన హామీని పూర్తిగా విస్మరించిదని రైతులు వాపోతున్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రెండు విడతల్లో పంటల సాగు సమయంలోనే సర్కారు రైతు బంధు పథకం కింద ఆర్థిక సాయం అందించేది. ఎంతో ధీమాతో వ్యవసాయం చేసుకునేందుకు వీలుండేది. కాని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి సరైన నిధులు విడుదల చేయకపోవడంతో పంటల సాగు విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనవలసిన పరిస్థితి నెలకొన్నది. మళ్లీ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి దాపురించింది. వెంటనే సర్కారు నిధులను విడుదల చేయాలి.
– మొద్దు అంజిరెడ్డి, రైతు