వికారాబాద్, మార్చి 5 : ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. పరీక్ష రాసేందుకు విద్యార్థులు ఆయా పరీక్ష కేంద్రాలకు గంట ముందుగానే చేరుకున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష సజావుగా సాగింది. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా అధికారులు, పోలీసులు తగిన ఏర్పాట్లు చేశారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో జనరల్ విద్యార్థులు 6638 మందికిగాను 6492 మంది పరీక్షలు రాశారు. ఒకేషనల్ విద్యార్థులు 1539 మంది రాయాల్సి ఉండగా 1,445 మంది రాసినట్లు ఇంటర్ నోడల్ అధికారి తెలిపారు.
పరిగి : ఓ ప్రైవేట్ కళాశాల విద్యార్థి జీవితంతో ఆడుకున్నది. ఫీజు పూర్తిగా చెల్లించేంతవరకూ హాల్ టికెట్ ఇవ్వకపోవడంతో ఆ విద్యార్థి సమయానికి సదరు కేంద్రానికి చేరుకోకపోవడంతో పరీక్ష రాయకుండానే వెనుదిరగాల్సి వచ్చింది. వికారాబాద్ జిల్లా పరిగిలోని శ్రీసాయి ఒకేషనల్ జూనియర్ కళాశాలలో వార్ల నగేశ్ అనే విద్యార్థి చదువుతున్నాడు. ఫీజు చెల్లించలేదనే కారణంతో కళాశాల నిర్వాహకులు అతడికి హాల్టికెట్ ఇవ్వలేదు. మంగళవారం రూ.3వేలు చెల్లించినా తనకు హాల్టికెట్ ఇవ్వలేదని, బుధవారం ఉదయం మిగిలిన మొత్తాన్ని చెల్లించిన తర్వాతే హాల్ టికెట్ ఇచ్చారని.. దానిని తీసుకుని తుంకులగడ్డలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉన్న పరీక్షా కేంద్రానికి అతడు ఉదయం 9.20కి చేరుకున్నాడు. అప్పటికే సమయం మించిపోవడంతో అక్కడి సిబ్బంది అతడిని లోనికి అనుమతించలేదు. దీంతో నగేశ్ కంటతడిపెడుతూ వెనుదిరిగాడు.