వికారాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో సబ్బండ వర్గాల ప్రజలకు అన్యాయం చేసింది. ఎన్నికలకు ముందు ఎన్నో హామీలనిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఆశతో ఎదురుచూసిన అన్ని వర్గాల ప్రజలకు నిరాశను మిగిల్చింది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్లో రైతులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, కార్మికులు, కులవృత్తిదారులకు మొండిచెయ్యి చూపింది. సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తుందని ఆశించిన సబ్బండ వర్గాల ఆశలపై రేవంత్ ప్రభుత్వం నీళ్లు చల్లింది.
ప్రధానంగా జిల్లాకు సాగు నీరందించే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి ఎలాంటి నిధులు కేటాయించకపోవడం శోచనీయం. పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో భాగంగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కూడా పూర్తి చేస్తామని బడ్జెట్లో ప్రస్తావించడం తప్ప కొత్తగా పాలమూరు ప్రాజెక్టు నిర్మాణానికి నయాపైసా నిధులివ్వలేదు. మొదటి నుంచి పాలమూరు ప్రాజెక్టుపై పగబట్టిన కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి వచ్చిన తర్వాత రెండున్నరేండ్లుగా పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుపై కక్షపూరిత విధానాన్ని కొనసాగిస్తున్నది.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుతో జిల్లాలోని వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ నియోజకవర్గాల్లోని సుమారు 5 లక్షల ఎకరాలకు సాగునీరందించేందుకు ప్రాజెక్టు నిర్మాణ పనులు దాదాపు పూర్తి చేసి కాల్వలు తవ్వేందుకు కూడా గత బీఆర్ఎస్ సర్కారు నిధులివ్వగా.. కాంగ్రెస్ ప్రభుత్వం పక్కన పెట్టింది. కేవలం కొడంగల్ నియోజకవర్గంతోపాటు సొంత జిల్లాపై ప్రేమతో మక్తల్, నారాయణపేట జిల్లాలకు సాగునీరందించేందుకు కొడంగల్-నారాయణపేట్ ఎత్తిపోతల ప్రాజెక్టుకు మాత్రమే ప్రాధాన్యతనిస్తుండటం గమనార్హం. ఏడాదిలో సాగునీరొస్తది.. తమ ప్రాంతం పచ్చబడుతది, తమ బతుకులు బాగుపడుతాయనుకున్న వికారాబాద్, తాండూరు, పరిగి నియోజకవర్గాల ప్రజల జీవనం ప్రశ్నార్థకంగా మారింది.
ఉమ్మడి మహబూబ్‌నగర్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకు సాగు నీరందించే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు 80 శాతం వరకు పూర్తయ్యాయి. ఏడాదిలో సాగునీరొస్తుందని ఆశతో ఎదురుచూసిన జిల్లా రైతాంగానికి కాంగ్రెస్ సర్కారు తీరుతో రైతులకు అన్యాయం జరుగుతున్నది. మరోవైపు ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును చేపడుతామని బడ్జెట్లో ప్రస్తావించారు.
మున్సిపల్ ఎన్నికల సమయంలో పరిగి బహిరంగ సభలోనూ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు గురించి ప్రస్తావించిన సీఎం.. జిల్లాకు ప్రాణహిత ద్వారా సాగునీరు తీసుకువస్తామన్నారు. దీన్ని అసాధ్యమని గుర్తించిన మాజీ సీఎం కేసీఆర్ పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని చేపట్టి దాదాపు తుది దశకు నిర్మాణాన్ని తీసుకువస్తే.. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి ఇమేజ్ వస్తుందన్న కారణంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
అనంతగిరి హిల్స్ అందాలపై రాష్ట్రవ్యాప్తంగా ఆదరణ పెరిగినప్పటికీ పర్యాటకంగా అభివృద్ధి చేయడంపై కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తున్నది. బడ్జెట్లో అనంతగిరి పర్యాటకాభివృద్ధి ఊసే లేకపోవడం గమనార్హం. నిత్యం అనంతగిరి ప్రకృతి అందాలను వీక్షించేందుకు వస్తున్న పర్యాటకులు కనీస వసతులు లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ ఊటీగా పేరొందిన అనంతగిరి హిల్స్‌పై సర్కారు సవతి తల్లి ప్రేమను చూపిస్తుండటంపై జిల్లా ప్రజానీకం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం గతంలోనే కొంతమేర నిధులు కేటాయించగా.. రాష్ట్ర సర్కారు ఇవ్వాల్సిన నిధులకు సంబంధించి ఒక్క రూపాయి కూడా అనంతగిరి హిల్స్ పర్యాటక అభివృద్ధికి కేటాయించలేదు. ఇటీవల సీఎం అనంతగిరి పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని చెప్పి మున్సిపల్ ఎన్నికల్లో హామీనిచ్చి బడ్జెట్లో ప్రస్తావించకపోవడంపై ఓట్ల కోసమే హామీ ఇచ్చారని విమర్శలు వస్తున్నాయి. అనంతగిరి హిల్స్ పర్యాటక అభివృద్ధిపై ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవడంపై జిల్లా మేధావులు, విద్యావంతులు ప్రభుత్వంపై పెదవి విరుస్తున్నారు.
ఎన్నికలకు ముందు అనంతగిరిని పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని హామీలిచ్చిన జిల్లా ఎమ్మెల్యేలు ఇప్పుడు మాట్లాడకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా నుంచి సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తుండటంతోపాటు అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్‌కుమార్ సొంత నియోజకవర్గంలోనే అనంతగిరి హిల్స్ ఉన్నప్పటికీ ఆయన కూడా పట్టించుకోకపోవడం గమనార్హం.
మరోవైపు గత బీఆర్ఎస్ సర్కారు హయాంలో జిల్లాలో ఏర్పాటు చేసేందుకు నిర్ణయించిన మొబిలిటీ వ్యాలీకి సంబంధించి ఒక్క రూపాయి నిధులు కూడా కేటాయించలేదు. రెండున్నరేండ్లుగా నిలిచిపోయిన మొబిలిటీ వ్యాలీ అభివృద్ధి పనులు.. బడ్జెట్ అనంతరం దూసుకుపోతుందని అనుకున్న జిల్లా ప్రజల ఆశలపై కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు చల్లింది. అయితే కొడంగల్ మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్కు అభివృద్ధికి సంబంధించి బడ్జెట్ ప్రస్తావించిన సర్కారు.. మొబిలిటీ వ్యాలీని మాత్రం మరోసారి విస్మరించడంపై జిల్లా ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఒకే విడతలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీలనిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకువచ్చి అర్హులైన సుమారు లక్ష మంది రైతులకు రుణమాఫీ చేయకుండా నష్టం చేకూర్చింది. జిల్లాలో రూ.2 లక్షలకుపైగా రుణాలున్న సుమారు 2 వేల మంది అన్నదాతలు కటాఫ్‌కు పైన ఉన్న రుణ మొత్తాన్ని చెల్లించారు. రైతుల్లో చాలామంది ఇప్పటికే సంబంధిత రశీదులను వ్యవసాయాధికారులకు అందజేసినప్పటికీ రుణమాఫీ పథకాన్ని ముగించి చాలా మంది అన్నదాతలకు అన్యాయం చేసింది.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం వానకాలం, యాసంగి సీజన్లకు తప్పనిసరిగా పంట పెట్టుబడి సాయాన్ని ఎలాంటి షరతులు లేకుండా అందజేస్తే, అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత పెట్టుబడి సాయం అందించడం షురూ చేసిన కాంగ్రెస్ సర్కారు మొదట కేవలం 3 ఎకరాల వరకు అందజేసి నిలిపివేసింది. తదనంతరం ఇప్పటివరకు రైతు భరోసా పెట్టుబడి సాయాన్ని అన్నదాతలకు అందించకపోవడం గమనార్హం.
సన్నరకం వడ్లను పండించే రైతులకు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. గత యాసంగికి సంబంధించి బోనస్ ఇప్పటివరకు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయకుండా అన్యాయం చేసింది.
అన్ని వర్గాల ఆర్థికాభివృద్ధి కోసం చేపట్టిన గొర్రెల పంపిణీ కార్యక్రమంతో గొల్ల, కుర్మల జీవితాల్లో గత బీఆర్ఎస్ సర్కారు వెలుగులు నింపగా.. కాంగ్రెస్ ప్రభుత్వం గొల్ల, కుర్మలను విస్మరించి వారి జీవితాలను అగాథంలోకి నెట్టేసింది.
మహిళలకు ప్రతి నెలా రూ.2 వేల సహాయం, పింఛన్ల పెంపునకు సంబంధించి బడ్జెట్లో ప్రస్తావించలేదు. అయితే కొత్తగా 2 లక్షల పింఛన్లను మంజూరు చేస్తామని ప్రస్తావించారే తప్ప.. గత రెండున్నరేండ్లుగా ఒక్కరికి కూడా కొత్త పింఛన్ మంజూరు చేయకపోవడం గమనార్హం.
అంకెల గారడి.. అరచేతిలో వైకుంఠంలా ఉన్నది ఈ బడ్జెట్. అన్ని వర్గాలను దగా చేసి, నయవంచన చేసిన బడ్జెట్. కేసీఆర్ ఎప్పుడో చెప్పారు.. తప్పిదారి కాంగ్రెస్‌కు ఓటు వేస్తే రైతు బంధుకు రాంరాం, దళిత బంధుకు జై భీమ్ అంటారని.! ఆ మాటలను రేవంత్ సర్కార్ నిజం చేస్తున్నది. కౌలు రైతుల ఊసే లేదు. ఆటో వాళ్లకు, ఆర్టీసీ కార్మికులకు అన్యాయం జరిగింది. మహిళలు, విద్యార్థులకు అవమానం జరిగింది. ఉద్యోగులు, నిరుద్యోగులకు దగా జరిగింది.
భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందని మనందరికి తెలుసు కానీ, ప్రభుత్వం ఏ పని చేసినా భూముల చుట్టూ తిరుగుతున్నది. రియల్ ఎస్టేట్ దందా మాత్రమే గుర్తుకొస్తున్నది. ఐదు బడ్జెట్లలో మూడు బడ్జెట్లు ఈ రోజుతో పూర్తయ్యాయి. మిగిలినవి రెండు మాత్రమే.. కానీ వీళ్లిచ్చిన హామీల్లో ఏ ఒక్క హామీ కూడా పూర్తిగా నెరవేర్చలేకపోయారు. ప్రజలందరూ అన్ని విషయాలు గమనిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా సమాధి చేయడం ఖాయం.
– డాక్టర్ మెతుకు ఆనంద్, బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు
ఆరు గ్యారెంటీలు, 11 డిక్లరేషన్లు అంతా మోసం. అంకెల గారడి కాదు.. అంకెలనే మార్చడం.. ఇదే కాంగ్రెస్ దగాకోరుతనానికి నిదర్శనం. దేశ చరిత్రలో ఏ రాష్ట్ర సర్కారూ ఇంత మోసంతో కూడిన బడ్జెట్‌ను ప్రవేశపెట్టలేదు. భట్టి బడ్జెట్.. వట్టి బడ్జెటే. అబద్దాల మాటలే.. పనికిరాని, పసలేని రాతలే. ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేరుస్తామని చెప్పలేదు. వృద్ధుల శాపం, మహిళల చేసిన పాపం కచ్చితంగా తగులుతుంది. విద్యార్థులు, యువతకు అన్యాయం చేశారు.
అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన బడ్జెట్. తెలంగాణ తిరోగమన బడ్జెట్. ఉద్యోగులు, నిరుద్యోగులు, కార్మికులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు తీరని ద్రోహం చేశారు. దళిత బంధు, రైతు బంధు, బీసీ బంధు అన్నీ బందని తేల్చిచెప్పిన బడ్జెట్. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే కష్టాలు, కన్నీళ్లు, కూల్చివేతలు, పేల్చివేతలని నిస్సిగ్గుగా ప్రకటించినట్లు అర్థమైంది.
– శుభప్రద్‌పటేల్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు
కాంగ్రెస్ సర్కారు ప్రవేశపెట్టిన మూడో బడ్జెట్లో ఏ ఒక్క వర్గానికీ పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదు. అంకెల గారడీతో అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు. రైతులు, కౌలు రైతులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, ఆర్టీసీ ఉద్యోగులు, ఆటో కార్మికులు, విద్యార్థులను నయవంచన చేసి నట్టేట ముంచింది. 5 బడ్జెట్లలో మూడు బడ్జెట్లు పూర్తయ్యాయి. ఈ బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదు. ఇచ్చిన 5 గ్యారెంటీల అమలుపై స్పష్టత లేదు. విద్యారంగంలో కూడా అనేక మార్పులన్నారు. కానీ నిరుద్యోగుల సమస్యను పూర్తిగా గాలికి వదిలేశారు. ఇది పూర్తిగా ప్రజలకు వ్యతిరేక బడ్జెట్.
– జి.నాగేందర్‌గౌడ్, టీఎస్ఈడబ్ల్యూఐడీసీ మాజీ చైర్మన్