బొంరాస్‌పేట, జూన్ 6 : సీఎం సొంత నియోజకవర్గంలో పథకాల అమలు అస్తవ్యస్తంగా ఉండడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బొంరాస్‌పేట పరిధిలోని బాపల్లి గ్రామపంచాయతీకి అనుబంధంగా ఉన్న అనంతపూర్‌లో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో గందరగోళం నెలకొన్నది. శుక్రవారం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం ముగ్గువేయడానికి వచ్చిన అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులను ప్రజలు నిలదీశారు. అర్హత ఉన్నవారిని వదిలి ఇప్పటికే పక్కా ఇల్లు ఉన్నవాళ్లకు ఇందిరమ్మ ఇండ్లు ఎలా మంజూరు చేశారని నిలదీశారు. గ్రామపంచాయతీకి మొదటి విడతలో అర్హత కలిగినవారు 16 మంది ఉండగా.. అందులో 10 మందికి ఇండ్లు మంజూరయ్యాయి. అందులో 8 మందిని బాపల్లితండాకు, ఒకరిని అనంతపూర్‌కు, మరొకరిని పాలబావితండాకు కేటాయించారు.
ఇందిరమ్మ ఇండ్ల మంజూరు లిస్టులో ఉన్నవారిని కాదని ఇతరుల పేరుపై ఇండ్లను మంజూరు చేస్తున్నారని అరోపించారు. ఎంపిక చేసినవారికి ప్రస్తుతం ఆర్సీసీ ఇండ్లు ఉన్నాయని.. పాతవాటిని తొలగించి కొత్తగా నిర్మాణం చేస్తున్నారని.. ఇండ్లు ఉన్నవారికి ఇండ్లను కేటాయించడమేంటని ప్రశ్నించారు. ఇండ్లులేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక కమిటీలో చాలా వరకు కాంగ్రెస్ కార్యకర్తలకే అవకాశం కల్పించడంతో ఇండ్ల ఎంపికలో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. ఎంపిక కమిటీలకు కూడా తెలియకుండా లబ్ధిదారులను ఎంపిక చేయడం చాలా విడ్డూరంగా ఉందని పేర్కొంటున్నారు. నియోజకవర్గంలో ఇటువంటి పరిస్థితిని చూస్తుంటే ఇందిరమ్మ రాజ్యంలా లేదని, కాంగ్రెస్ రాజ్యంగా తలపిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఓటేసి గెలిపిస్తే అన్యాయం చేస్తారా..
రేవంత్‌రెడ్డి సీఎం కావడం వల్ల నియోజకవర్గానికి అన్నింటా మేలు జరుగుతుందని భావించామని, కానీ కాంగ్రెస్ నాయకుల వైఖరి కారణంగా ప్రజలు సంక్షేమ పథకాలు అందుకోలేక ఇబ్బందులు పడుతున్నట్లు వాపోయారు. ఇండ్లులేని పేదలకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తుందని సీఎం హామీ ఇచ్చారు, కానీ అసలైన లబ్ధిదారులకు కాకుండా కాంగ్రెస్ నాయకులు కనుసన్నల్లో ఉన్నవారికే ఇండ్లు మంజూరు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అసలైన లబ్ధిదారులు అధికారులను సంప్రదించినా ఎటువంటి ఫలితం లేకుండా పోయిందని, అధికారులను కాకుండా స్థానికంగా కాంగ్రెస్ నాయకులను సంప్రదించాల్సిన పరిస్థితి ప్రజలకు ఏర్పడిందని వాపోతున్నారు.
సీఎం నియోజకవర్గంలోనే ఇటువంటి పరిస్థితి నెలకొనడమేంటని, కాంగ్రెస్ కార్యకర్తలకు అర్హతలు లేకున్నా సంక్షేమ పథకాలిచ్చి, అర్హులైన సామాన్యులకు అన్యాయం చేస్తారా.. అని నిలదీస్తున్నారు. ఓటేసి గెలిపించినందుకు సీఎం రేవంత్‌రెడ్డి తీసుకునే బాధ్యత ఇదేనా అని ఆయా గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు కాంగ్రెస్ కార్యకర్తలే అవసరమా..? ప్రజలు అవసరం లేదా అని ప్రశ్నిస్తున్నారు. ఇందిరమ్మ ఇల్లు వస్తుందని కొన్ని ప్రాంతాల్లో ఉన్న ఇంటిని కూడా కూల్చుకొని ఇందిరమ్మ ఇంటి కోసం ఎదురుచూస్తున్న పరిస్థితులున్నాయని, ఇప్పటికైనా సీఎం స్పందించి ప్రజలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.