ఇబ్రహీంపట్నం, జూలై 1: పెరిగిన స్టీల్, సిమెంట్, ఇసుక, కంకర ధరలతో ఇందిరమ్మ ఇళ్ల (Indiramma Indlu) నిర్మాణ దారులపై భారం పడుతోంది. ఇళ్ల నిర్మాణాలు గాడిన పడుతున్న తరుణంలోనే సామాగ్రి రేట్లు అధికం కావటం ప్రతిబంధకంగా మారింది. వీటికి తోడు కంకర, కూలి ధరలు సైతం విపరీతంగా పెరిగిపోయాయి. పెరిగిన ధరలను బట్టి ఒక్కో ఇంటిపై రూ.3లక్షల నుంచి రూ.4లక్షల వరకు అదనపు భారం పడేలా ఉందని లబ్ధిదారులు వాపోతున్నారు. నిన్న మొన్నటి వరకు అంతంతమాత్రంగా ఉన్న ధరలు…ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయటంలో ఒక్కసారిగా ధరలు పెరిగిపోయి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. దీనికి తోడు అడ్డా కూలీలు, తాపీమేస్త్రీ, కూలీల ధరలు విపరీతంగా పెరిగిపోవటంతో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకోవటం కష్టతరంగా మారుతోంది. ప్రభుత్వం అందజేసే ఐదులక్షలే కాకుండా అదనంగా మరో ఐదులక్షల వరకు భారం పడుతుండటంతో తీవ్ర ఇబ్బందులెదుర్కొంటున్నారు. దీనికి తోడు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో ప్రభుత్వ నిబంధనలతో లబ్ధిదారులు ఇబ్బందులెదుర్కొంటున్నారు.
ఇందిరమ్మ ఇంటికి 500 నుంచి 550 వరకు సిమెంట్ బస్తాలు అవసమవుతాయి. నెలరోజుల క్రితం ఒక్క సిమెంట్ బస్తా ధర రూ.270 వరకు ఉండగా.. ప్రస్తుతం గ్రేడ్‌ను బట్టి ఒక్కో బస్తాపై సుమారు రూ.50 నుంచి రూ.100వరకు విక్రయిస్తున్నారు. పాత ధర ప్రకారం రూ.1.50లక్షల వరకు ఖర్చు సిమెంట్‌కు వచ్చేది. ప్రస్తుతం రేటును బట్టి కట్టకు రూ.50 అదనంగా వేసుకన్నా సుమారు రూ.2లక్షలవ రకు అవుతుంది. లెక్కన ఒక్కో లబ్ధిదారుడిపై సిమెంట్ రూపేనా రూ.35వేల వరకు అదనం భారం పడుతోంది. దీనికి తోడు స్టీల్ ధరలు కూడా విపరీతంగా పెరిగిపోవటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులెదుర్కొంటున్నారు. పెరిగిన, స్టీల్, సిమెంట్ ధరలతో చేసేదేమీలేక కొందరు లబ్ధిదారులు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులు ప్రారంభించేందుకు కూడా ముందుకు రావటంలేదు.
ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక ఉచితంగా సరఫరా చేయాల్సి ఉంది. కానీ, ట్రాక్టర్ల యాజమానులు నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు. ట్రిప్పు ఇసుకకు రూ.3,500 నుంచి రూ4వేల వరకు వసూళ్లు చేస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ముందుట్రాక్టర్ ఇసుక ఏరియాను బట్టి రూ.2వేల వరకు సరఫరా చేసేవారు. కాని, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు గ్రామాల్లో జోరుగా సాగుతున్నందున గ్రామీణప్రాంతాల్లో ఇదే అదునుగా భావించి ఇసుక వ్యాపారులు రెచ్చిపోతున్నారు. ఇసుక బహిరంగ మార్కెట్లో అమ్మవద్దని ప్రభుత్వం నిబంధనలు పెట్టినప్పటికి చాటుమాటుగ ఇష్టానుసారంగా విక్రయిస్తూ సొమ్ముచేసుకుంటూ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల నుంచి అందినకాడికి దోచుకుంటున్నారు.
Indiramma
స్టీల్ ధర కంపణీని బట్టి గతంలో క్వింటాల్‌కు కనిష్టంగా రూ.5,500 ఉండగా, ఇప్పుడు గరిష్టంగా రూ.7,800కు చేరింది. ఇంటి నిర్మాణానికి కనీసం 1.50టన్నుల స్టీల్ పడుతుందని, లబ్ధిదారులు చెబతుఉన్నారు. రూ.5,500 చొప్పున రూ.82,500అవుతుండగా. సగటున క్వింటాల్‌కు రూ.7500 చొప్పున రూ.1,12,500 ఖర్చుఅవుతుంది. ఈ లెక్కన రూ.30వేలు వరకు అదనంగా భారమవుతోందని లబ్ధిదారులు వాపోతున్నారు.
గతంలో అడ్డా కూలీలకు సక్రమంగా పనులు దొరుకక పోవటంతో తక్కువ ధరలకు పనులు చేసేవారు. కాని, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు ప్రారంభమైన నేపథ్యంలో అడ్డా కూలీలకు కూడా డిమాండ్ పెరిగింది. గతంలో అడ్డా కూలీ పురుషునికి రోజుకు రూ.800 ఉండేది. ప్రస్తుతంరూ.1,300 అడుగుతున్నారు. మహిళలకు రూ.500 ఉండగా ప్రస్తుతం రూ.1000డిమాండ్ చేస్తున్నాని కూలీ ఎక్కువ చిఇ్చనా కూలీలు దొరికే పరిస్థితి లేదని చెబుతున్నారు. దీంతో అడ్డా కూలీల డిమాండ్ కూడా పెరిగిపోయింది.
బీస్మెంట్ నిర్మాణానికి రాయి తప్పనిసరి. గతంలో ట్రాక్టర్ రాయి, దొడ్డు కంకర రూ.3200 ఉండగా, ప్రస్తుతం రూ.3,500నుంచి రూ.4వేల వరకు పలుకుతోంది. ఇక స్లాబ్‌లో ప్రత్యేకంగా సన్న కంకర వాడాల్సి ఉంటుంది. దాని ధరలు కూడా క్రషర్ల యాజమానుల అమాంతం పెంచేసారు. బేస్మెంట్లో నేలభాగంలో వేసే దొడ్డు కంకరకు కూడా ధరలు విపరీతంగా పెంచటంలో లబ్ధిదారులు ఇబ్బందులకు గురవుతున్నారు.
పెరిగిన సిమెంట్, స్టీల్, ఇసుక, రాయి, కంకర, కూలీల ధరల కారణంగా ఇంటి నిర్మాణానికి ప్రభ్తువం ఇచ్చే రూ.5లక్షలకు అదనంగా మరో రూ.4 నుంచి రూ.5లక్షల వరకు ఖర్చు వస్తుందని లబ్ధిదారులు అంటున్నారు. నేల స్వభావాన్ని బట్టి కూడా నిర్మాణ వ్యయం పెరుగుతోంది. చౌడు నేలలో తప్పనిసరిగాఫిల్లర్లు పోయాల్సి వస్తుండటంతో మరింత భారం పడుతోంది. గుంతల ప్రాంతంలో ఉన్న భూముల్లో ఇంటిని నిర్మిస్తే మట్టి ఎక్కువగా పోయాల్సిన పరిస్థితి ఉండటంతో ఖర్చు భారం పెరిగిపోతుందని లబ్ధిదారులు వాపోతున్నారు.
పెరిగిన స్టీల్, సిమెంట్ ధరలతో అదనపు భారం : బాలకృష్ణగౌడ్
పెరిగిన స్టీల్, సిమెంట్, కంకర, ఇసుక ధరలతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో అదనపు భారం పడుతోంది. ప్రభుత్వం సామాన్యులకు ఇబ్బంది కలిగించేలా ఉన్న నిబంధనలతో వెనక్కి తగ్గుతున్న లబ్ధిదారులు…పెరిగిన ధరలతో మరింత ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వం అందజేసే రూ.5లక్షలతో పాటు లబ్ధిదారులకు మరింత అదనంగా రూ.5లక్షల భారం పడుతుండటంతో ఇబ్బందులకు గురవుతున్నారు.