వికారాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ) : ఇందిరమ్మ ఇండ్ల పథకం లబ్ధిదారుల ఎంపిక ఇష్టారాజ్యంగా జరుగుతున్నది. అర్హుల ఎంపికకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీల్లో అందరూ కాంగ్రెస్ పార్టీకి చెందినవారే ఉండడంతో వారికి నచ్చినవారినే ఎంపిక చేస్తున్నారు. సీఎంతోపాటు మంత్రులు అర్హులనే ఎంపిక చేయాలని చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు భిన్నంగా జరుగుతున్నది. ప్రతి గ్రామంలోనూ ఇండ్లు లేని నిరుపేదలు ఐదారుగురు మినహా ఉండరు, కానీ, ఒక్కో గ్రామంలో పదికి పైగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నవారిని ఎంపిక చేస్తున్నారనే విమర్శలున్నాయి.
లబ్ధిదారుల ఎంపిక విషయంలో కొందరు మండల స్థాయి అధికారులు-కాంగ్రెస్ నాయకుల మధ్య కోల్డ్‌వార్ జరుగుతున్నట్లు సమాచారం. తాము సూచించిన వారి పేర్లు జాబితాల్లో ఉండాలంటూ కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేస్తుండగా.. అర్హులనే ఎంపిక చేస్తామని అధికారులు తెగేసి చెబుతుండడంతో అధికారులు-కాంగ్రెస్ నాయకుల మధ్య పంచాయితీ నడుస్తున్నది. కాగా, జిల్లాలోని ఓ మండలంలో కాంగ్రెస్ నాయకులు తాము చెప్పిన వారి పేర్లు లబ్ధిదారుల జాబితాలో లేకుంటే బదిలీ చేయిస్తామని ఓ అధికారిని బెదిరించినా.. సదరు ఆఫీసర్ మాత్రం మీకు నచ్చినట్లు చేసుకోండి.. అర్హులను మాత్రమే ఎంపిక చేస్తామంటూ చెప్పి కాంగ్రెస్ నాయకులు చెప్పిన పేర్లను తొలగించి.. అర్హుల పేర్లను జాబితాలో పొందుపర్చినట్లు సమాచారం.
దీంతో పలువురు కాంగ్రెస్ నాయకులు స్థానిక ఎమ్మెల్యేను కలిసి సదరు అధికారిని వెంటనే బదిలీ చేయించాలని విజ్ఞప్తి చేయగా.. ఈ విషయం బయటకు తెలిస్తే నియోజకవర్గమంతటా వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతో ఆ ఎమ్మెల్యే స్పందించలేదని సమాచారం.
కేవలం కాంగ్రెస్ పార్టీకి చెందిన వారిని మాత్రమే ఇందిరమ్మ ఇండ్ల పథకానికి లబ్ధిదారులుగా ఎంపిక చేస్తున్నారని పేదల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతున్నది. లబ్ధిదారుల ఎంపికకు ప్రభుత్వం నియమించిన కమిటీల్లో కాంగ్రెస్‌కు చెందినవారే ఉండడంతో వారికి అనుకూలంగా ఉన్న వారినే లబ్ధిదారులుగా ఎంపిక చేస్తున్నారని పలువురు మండిపడుతున్నారు. గత బీఆర్ఎస్ హయాంలో ఏ సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టినా పార్టీలకతీతంగా అర్హులందరికీ పథకాల ఫలాలు అందాయని.. కానీ, కాంగ్రెస్ పాలనలో ఆ పార్టీకి అనుకూలంగా ఉన్నవారికే అందేలా చర్యలు తీసుకుంటున్నదని.. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగడంలేదని పేర్కొంటున్నారు.
ఇప్పటికే ఎంపిక చేసిన మొదటి విడత లబ్ధిదారుల జాబితాలోనూ కాంగ్రెస్ పార్టీకి చెందినవారినే ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతున్నది. లబ్ధిదారుల ఎంపిక విషయంలో కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి.. పేదలకు న్యాయం జరిగేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. కాగా ప్రజాపాలనతోపాటు గతంలో స్వీకరించిన వాటిలో 2,50,000 దరఖాస్తులు రాగా వీటిలో 1,50,000 దరఖాస్తుదారులను అధికారులు అర్హులుగా తేల్చారు.
ఇందిరమ్మ ఇండ్ల పథకంపై ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నది. పైలెట్ ప్రాజెక్టు పేరిట మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి ఇండ్ల నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ప్రగల్భాలు పలికిన సర్కార్.. పైలెట్ గ్రామాల్లో లబ్ధిదారులను ఎంపిక చేసి నాలుగు నెలలు గడుస్తున్నా ఇండ్ల నిర్మాణంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. అయితే, లబ్ధిదారుల ఎంపిక పూర్తి కాగానే ఇండ్ల నిర్మాణానికి మొదటి విడతగా రూ. లక్ష సాయం పంపిణీ చేస్తామని చెప్పినా ఇప్పటికీ మంజూరు చేయలేదు.
ప్రభుత్వం మాట నమ్మిన లబ్ధిదారులు పాత ఇండ్లను కూల్చి.. బేస్మెంట్ వరకు కొత్తగా నిర్మాణాలు చేపట్టారు. కాగా, జిల్లాలో మొదటి విడతలో 2,285 ఇందిరమ్మ ఇండ్లకు అనుమతులు మంజూరైతే వాటిలో కేవలం 77 ఇండ్లకు మాత్రమే రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయాన్ని అందించిన ప్రభుత్వం మిగతా లబ్ధిదారులకు గుండు సున్నా చూపించింది. ఇండ్లు కూల్చేసి.. అప్పులు చేసి బేస్మెంట్ వరకు నిర్మించి నెలలు గడుస్తున్నా ఇంకా సాయం అందకపోవడంతో పలువురు లబ్ధిదారులు ప్రభుత్వ సాయం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.
లబ్ధిదారులందరికీ రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయాన్ని అందించామని ఎమ్మెల్యేలు మాట్లాడడంపై మండిపడుతున్నారు. దీంతో పైలెట్ గ్రామాల్లో ఇండ్ల నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. కాగా, సెగ్మెంట్‌కు 3,500 ఇండ్ల చొప్పున జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలకు 14,000 ఇండ్లు జిల్లాకు మంజూరయ్యాయి. వాటిలో మొదటి విడతలో 2,285 ఇండ్లకు లబ్ధిదారులను ఎంపిక చేయగా, రెండో విడతలో 2,929 ఇందిరమ్మ ఇండ్లకు పరిపాలన అనుమతులు మంజూరు కాగా, క్షేత్రస్థాయిలో దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ కొనసాగుతున్నది.