రంగారెడ్డి, మే 9 (నమస్తే తెలంగాణ) : ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో మితిమీరిన రాజకీయ జోక్యంతో అర్హులకు ఇండ్లు అందడంలేదనే ఆరోపణలున్నాయి. ఇందిరమ్మ కమిటీ సభ్యులు సూచించిన వారు అనర్హులైనా ఇండ్లు వస్తున్నాయని..అన్ని అర్హతలు ఉన్న వారికి రాజకీయ అండదండలు లేకపోవడంతో ఇండ్లు రావడంలేదని పలువురు పేర్కొంటున్నారు.
ప్రభుత్వం లబ్ధిదారుల ఎంపిక కోసం ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీల్లో కాంగ్రెస్ పార్టీ సూచించిన వారే సభ్యులు గా ఉన్నారు. దీంతో వారే లబ్ధిదారులను ఎం పిక చేస్తుండడంతో కొన్నేండ్లు సొంతింటిని నిర్మించుకుందామనుకున్న పేదలకు నిరాశే మిగులుతున్నది. ఈనెల 10లోపు మొదటి విడత ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఎంపికలో అక్రమార్కులకే పెద్దపీఠ వేస్తున్నారనే ఆరోపణలొస్తున్నాయి.
జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు మొదటి విడతలో 15,000 ఇండ్లను ప్రభుత్వం కేటాయించింది. నియోజకవర్గానికి 3000 చొప్పు న ఇండ్లను లబ్ధిదారులకు ఇవ్వనున్నారు. ఈ నెల 10తో మొదటి విడత లబ్ధిదారుల ఎంపికకు తుది గడువు ఉండగా.. ఇప్పటికీ 7000 ఇండ్లనే లబ్ధిదారులకు కేటాయించారు. మిగిలిన వాటిని మరో 2 రోజుల్లో పూర్తి చేయాల్సి ఉన్నది. దీంతో ఇందిరమ్మ కమిటీల సభ్యులు, అధికారులు హడావిడిగా వాటిని పూర్తిచేసే పనిలో ఉన్నారు.
జిల్లాలోని పైలెట్ గ్రామాల్లో ఇండ్ల నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. లబ్ధిదారులు బేస్మెంట్ వరకు ఇండ్ల నిర్మాణం చేపట్టినా అధికారులు బిల్లులు మంజూరు చేయకపోవడంతో వారి నిర్మాణం అర్ధాంతరంగా నిలిచిపోయింది. మరోవైపు నిబంధనల మేరకు నిర్మాణాలు చేపట్టలేదని అధికారులు మరికొన్ని ఇండ్ల నిర్మాణ బిల్లులను నిలిపివేశారు. దీంతో చాలామంది లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణంపై శ్రద్ధ చూపడంలేదని సమాచారం.
గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేదల సొం తింటి కల నెరవేరడం లేదు. ఇందిరమ్మ ఇండ్లలోనైనా తమకు ఇల్లు మంజూరైతే నిర్మించుకుందామని భావిస్తుండగా.. కాంగ్రెస్ నాయకుల మితిమీరిన జోక్యంతో అర్హులకు ఇల్లు రావడంలేదు. ఇప్పటికే ఎంపిక పూర్తైన పలు గ్రామాల్లో పేదలకు కాకుండా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకే ఇందిరమ్మ ఇండ్లు కేటాయించినట్లు ఆరోపణలొస్తున్నాయి. దీంతో పేదల సొంతింటి కల కళగా మిగిలిపోనున్నది.