వికారాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపిక కోసం మంగళవారం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామసభలు, వార్డు సభల్లో రెండో రోజు కూడా నిరసనలు, నిలదీతలు కొనసాగాయి. ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు, ఆత్మీయ భరోసా, రైతు భరోసా పథకాలకు సంబంధించి ఈనెల 24 వరకు గ్రామ, వార్డు సభలు నిర్వహించి లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేసి, ఈ నెల 26న సంబంధిత నాలుగు పథకాలను ప్రారంభించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అర్హులైనప్పటికీ లేనిపోని కొర్రీలు పెట్టి దాదాపు లక్ష మంది రైతులకు రుణమాఫీని దూరం చేసిన రేవంత్ ప్రభుత్వం ఈ నాలుగు పథకాలకు సంబంధించి కూడా నామమాత్రంగా కొంత మందికే ఇచ్చి ఎగనామం పెడుదామని చూస్తున్నది.
ఆయా పథకాల లబ్ధిదారుల ఇంటింటి సర్వేలోనే కొత్త రేషన్ కార్డుల విషయంలో అర్హులై ఉండి దరఖాస్తు చేసుకుంటే తమ దరఖాస్తులను మాయం చేశారంటూ ప్రజలు నిలదీశారు. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం గ్రామసభల్లో ఎలాంటి నిరసనలు, నిలదీతలు కాకుండా కొత్త రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అంటూ చెప్పుకొచ్చారు. ప్రజాపాలన సమయంలో పడిగాపులు గాచి జిరాక్స్ కేంద్రాల చుట్టూ గంటల తరబడి క్యూలో నిల్చొని కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకుంటే ఇప్పుడు లేకపోవడం ఏమిటని అధికారులను ప్రశ్నిస్తున్నారు.
ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు నిరంతర ప్రక్రియ అంటూ ప్రభుత్వం దాటవేస్తున్నదని ప్రచారం జరుగుతున్నది. ఇప్పటికే రుణమాఫీ విషయంలో ఏఈవో మొదలుకొని జిల్లా వ్యవసాయాధికారి కార్యాలయంలో అర్హులైనప్పటికీ రుణమాఫీకాని రైతుల దరఖాస్తులను స్వీకరించి ప్రభుత్వానికి అందజేసినప్పటికీ ఇప్పటి వరకు పట్టించుకోకుండా ఒక్క దరఖాస్తును కూడా పరిష్కరించని కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పటికే వారు అనుకున్న లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేసి, గ్రామ సభల్లో దరఖాస్తులు తీసుకోవడం కేవలం ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను తగ్గించేందుకు మాత్రమేననే ప్రచారం జోరందుకున్నది.
కాంగ్రెస్ పార్టీకి చెందిన వారికి మాత్రమే ఇందరమ్మ ఇండ్ల పథకానికి లబ్ధిదారులుగా ఎంపిక చేస్తారా అంటూ ప్రజలు ప్రభుత్వాన్ని, అధికారులను నిలదీస్తున్నారు. ఇందిరమ్మ పథకానికి లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి ప్రభుత్వం నియమించిన కమిటీల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే ఉండడంతో వారికి అనుకూలంగా ఉన్నవారిన మాత్రమే లబ్ధిదారులుగా ఎంపిక చేశారనే ఆరోపణలు ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టినా పార్టీలకు అతీతంగా అర్హులైన వారందరకీ ఆయా పథకాల ఫలాలను అందజేశారు.
కానీ మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నది. పార్టీల వారీగా వేరు చేస్తూ కేవలం కాంగ్రెస్ పార్టీకి చెందిన వారిని మాత్రమే ఆయా పథకాల ఫలాలను అందించేలా వ్యవహరిస్తున్నది. కమిటీల ఏర్పాటు మొదలుకొని లబ్ధిదారుల ఎంపిక వరకు అంతా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నవారికి ప్రయోజనం చేకూర్చేలా ముందుకెళ్తుండడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇండ్లు ఉన్నవారికే ఇండ్లు ఇస్తారా అంటూ అధికారులను నిలదీస్తున్నారు.
బుధవారం కోట్‌పల్లి మండలంలోని కరీంపూర్ గ్రామంలో ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక సరిగ్గా జరగలేదని అధికారులను నిలదీశారు. నియోజకవర్గానికి 3500 ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేయగా, ప్రజాపాలనతోపాటు గతంలో స్వీకరించిన వాటిలో 2.50 లక్షల దరఖాస్తులుండగా, వీటిలో 1.70 లక్షల దరఖాస్తుదారులను అర్హులుగా తేల్చారు. మంగళవారం ఒక్కరోజు జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల పథకానికిగాను 3500 దరఖాస్తులు రావడం గమనార్హం.
నా కుటుంబంలో ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాలేదు. నాకు ఇద్దరు పిల్లలు వారెవరికీ రాలేదు. ఒక కొడుకు వినోద్‌కుమార్ పెండ్లి అయింది. వారికి ఇద్దరు పిల్లలు. ఇంకో కొడుకు విశ్వనాథం నాతోనే ఉంటున్నాడు. ఇల్లు లేక చిన్న పాడుబడ్డ ఇంట్లో ఉంటున్నాం. ఇలా ఉన్నప్పటికీ దరఖాస్తు చేసుకున్న, సర్వేలో సైతం అధికారులు ఫొటోలు తీసుకున్నా జాబితాల్లో పేర్లు రాలేదు. కాంగ్రెసోళ్లే కుట్రలు చేశారని అనిపిస్తున్నది.
– కావలి బిచ్చన్న, కరీంపూర్ గ్రామం, మండలం
మా అమ్మ, మేము ఇద్దరం అన్నదమ్ములం ఒకే ఇంట్లో ఉంటున్నాం. గత ప్రజా పాలనలో ఇల్లు కావాలని దరఖాస్తు చేసుకున్న. దరఖాస్తు చేసుకున్నాక ఇంటికి వచ్చి సర్వే చేసుకున్నారు. ఇంటి స్థలం ఉన్నది ఇల్లు ఇవ్వాలన్న. అయినా ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో నా పేరు లేదు. ఇదేం పాలన….ఉన్నోళ్లకే ఇండ్లు ఇస్తారా.. ఇప్పుడు వచ్చిన వాటిలో పేరు ఎందుకు లేదని అడిగితే తర్వాత వస్తది అంటున్నారు. ఇలా ఎన్ని సార్లు దరఖాస్తు చేసుకోవాలె.
– కావలి లక్ష్మయ్య, కరీంపూర్