బషీరాబాద్, జూలై 2 : అర్హులైన పేదలకు ఇండ్లు కేటాయించకుండా, అనర్హులకు, కాంగ్రెస్ నాయకులకే ఇందిరమ్మ ఇండ్లు కేటాయించారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ బుధవారం సీపీఎం ఆధ్వర్యంలో అర్హులైన పేదలు తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులు ఇందిరమ్మ ఇండ్లు ఇప్పిస్తామని పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి మోసం చేశారని ఆగ్రహం వ్యక్త చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు.
సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకులు డబ్బులు తీసుకుని అనర్హులకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించడమే ఇందిరమ్మ రాజ్యమా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎక్మాయి గ్రామంలో కాంగ్రెస్ నాయకులు పేద దళితుల వద్ద డబ్బులు తీసుకుని, అనర్హులకు, కాంగ్రెస్ లీడర్లకే ఇండ్లు కేటాయించారని తీవ్రంగా విమర్శించారు. ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో పేదల పేర్లు కాకుండా 70 శాతం అనర్హులు, కాంగ్రెస్ వారి పేర్లు మాత్రమే ఉన్నాయని, వారి పేర్లను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.
స్థానిక ఎమ్మెల్యే కల్పించుకుని తాండూరు నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో రీసర్వే చేయించాలని కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇండ్లు కేటాయించని పక్షంలో పేదలను సమీకరించి తాండూరు నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముందు పెద్దఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ధర్నా అనంతరం తహసీల్దార్ సాహిదాబేగంకు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు ఎ.సురేశ్, సీపీఎం నాయకులు సురేశ్, వెంకటేశ్, ఏక్మాయి గ్రామ బాధితులు గజలప్ప, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.