ఆదిభట్ల, మే 28: రంగారెడ్డి జిల్లాలో ఇప్పటివరకు 16,617 మందికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యాయని ఇంకా 839 మందికి ఇండ్ల మంజూరు ఇవ్వాల్సి ఉందని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి తెలిపారు. బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని సమావేశం మందిరంలో ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ వికాసం పథకాల అమలుపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ నారాయణ రెడ్డి మాట్లాడుతూ.. మంజూరైన లబ్ధిదారుల ఇండ్ల గ్రౌండింగ్ వెంటనే చేపట్టాలని, ఇంకా గ్రౌండింగ్ కానీ మండల, మున్సిపల్ పరిధిలో అధికారులు చొరవ చూపి వారంలో అన్ని గ్రౌండింగ్ అయ్యేలా చర్యలు చేపట్టాలని అన్నారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని పక్కాగా అమలు చేయాలని మండల స్థాయిలో నియంత్రణ కమిటీ వేయాలని మేస్త్రి చార్జీలు, క్రషర్ టోన్, ఇసుక, ఇటుక ధరల నిర్ణయానికి వేయాలని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక ఉచితంగా ఇస్తున్నామని, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రతి ఒక్కరికీ ఇది అందుబాటులో ఉండే విధంగా చూడాలని ఆయన పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇండ్ల మోడల్ ఇండ్ల ఫొటోలను మండల గ్రామ కూడళ్లలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి లబ్ధిదారులకు చూపించాలని కలెక్టర్ తెలిపారు. రాజీవ్ వికాసం పథకంలో ఎంపిక చేయబడిన లబ్ధిదారుల లిస్టును కలెక్టర్ లాగిన్లోకి పంపించాలని, జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున మంజూరీ పత్రాలు (ప్రోసిడింగ్స్) స్వయం ఉపాధి కల్పించి యువతకు అందజేయడం జరుగుతుందని కలెక్టర్ వివరించారు. జూన్ మాసంలో ఇచ్చే రూ. 50 వేలు రూ.లక్ష రూపాయల లోపు, లబ్ధిదారులను అధికంగా ఎంపిక చేయాలని అన్నారు.