రంగారెడ్డి, ఆగష్టు 15 (నమస్తేతెలంగాణ) : రంగారెడ్డిజిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకు ముందు ఆయన పోలీసుల నుంచి గౌరవ వంద నం స్వీకరించారు. అనంతరం ముఖ్యమంత్రి సలహాదారు పలువురు పుర ప్రముఖులు, అధికారులకు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లా ప్రగతిపై ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా గ్రామీణాభివృద్ధి, అటవీశాఖ, హౌసింగ్, సంక్షేమ, సివిల్‌సప్లయ్, వైద్యారోగ్యశాఖ, విద్యాశాఖ, అగ్నిమాపక, ఐసీడీఎస్ శాఖలకు సంబంధించిన శకటాలను ఆయన తిలకించారు. అనంతరం పరిశ్రమలు, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, ఉద్యానవనం, పౌర సరఫరాలు, విద్యుత్‌శాఖలకు సంబంధించిన పలు స్టాల్స్‌ను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం జిల్లా పౌరసంబంధాల అధికారి వెంకటేశంతో పాటు పలువురు ఆర్డీఓలు, జిల్లా అధికారుల్లో ఉత్తమ సేవలందించిన వారికి ప్రశంసా పత్రాలు అందజేశారు. తర్వాత జిల్లాలోని పదోతరగతి, ఇంటర్లో అధిక మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలను అందజేశారు.
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు..
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో వివిధ పాఠశాలలకు సంబంధించిన చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. విద్యార్థులు దేశభక్తిని పెంపొందించే సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించి ఆహూతుల మన్ననలు పొందారు. ఈ సందర్భంగా ఆమనగల్లు కేజీబీవీ స్కూల్, మహేశ్వరం, ఏవీఎన్ ఇంటర్నేషనల్ పాఠశాల, హయత్‌నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, తుక్కుగూడ డిల్లీ పబ్లిక్‌స్కూల్, ఇబ్రహీంపట్నం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు చేసిన నృత్యాలు ఆహూతులను ఎంతగానో అలరించాయి. ఈ సందర్భంగా ఆయా పాఠశాలల విద్యార్థులను అభినందించి బహుమతులు అందజేశారు. ఈ వేడుకల్లో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి, టీయుఎస్ ఐడీసీ చైర్మన్ చల్లా నర్సింహారెడ్డి, కలెక్టర్ నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి, మార్కెట్ కమిటీ ఛైర్మన్ చిలుకల మధుసూదన్‌రెడ్డి, మహేశ్వరం డీసీపీ సునితారెడ్డి, డీఆర్ఓ సునిత, కలెక్టరేట్ ఏఓ సునిల్ తదితరులు పాల్గొన్నారు.
ఫ్యూచర్‌సిటీ, గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు జిల్లాకు తలమానికం : వేం నరేందర్‌రెడ్డి
రంగారెడ్డిజిల్లాలో ప్రతిపాదిత రీజనల్ రింగ్‌రోడ్డు (ట్రిబుల్ఆర్ఆర్) అలాగే, ఫ్యూచర్సిటీలు జిల్లాకు తలమానికంగా నిలుస్తాయని ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొని ఆయన ప్రసంగిస్తూ….ఔటర్‌రింగ్‌రోడ్డు నుంచి ప్రతిపాదిత రీజనల్ రింగ్‌రోడ్డు వరకు అనుసంధానం చేయటానికి వివిధ ప్రాంతా ల్లో నిర్మిస్తున్న రేడియల్ రోడ్లు జిల్లాకు తలమానికంగా నిలుస్తాయని అన్నారు. జిల్లాలో మొట్టమొదటగా 330 అడుగుల వెడల్పుతో రేడియల్ రోడ్డును 4వేల కోట్ల అంచనాతో ప్రభుత్వం నిర్మిస్తుందన్నారు. కొత్తగా గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు రావిర్యాల ఓఆర్ఆర్ నుంచి ఆమనగల్లు మండలంలోని ఆకుతోటపల్లి గ్రామాల మధ్య 41.5కిలోమీటర్లతో నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ రోడ్డు హైదరాబాద్ మహానగరంతో పాటు ఫ్యూచర్‌సిటీ మధ్య ప్రాంతీయ కనెక్టివిటీని మెరుగు పరుస్తుందన్నారు. నగరంలోని వివిధ పారిశ్రామిక జోన్ల మధ్య వేగవంతమైన, సురక్షితమైన ప్రయాణానికి ఈ రోడ్డు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. రీజనల్ రింగ్‌రోడ్డుతో పాటు జిల్లాలో ఫ్యూచర్‌సిటీని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయటానికి వేగంగా ముందుకెళుతుందన్నారు. ఇప్పటికే ఫ్యూచర్‌సిటీ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటుచేసి దానికి ప్రత్యేకాధికారిగా ఐఏఎస్ అధికారిని నియమించటం జరిగిందన్నారు. జిల్లా పరిధిలోని పలు మండలాలను కలుపుతూ ఫ్యూచర్‌సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఫ్యూచర్‌సిటీతో రంగారెడ్డిజిల్లాకు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు లభిస్తుందన్నారు. అలాగే, కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చి ప్రజల మన్ననలు చూరగొంటుందన్నారు. 500లకే వంటగ్యాస్, గృహజ్యోతి, రైతుబీమా, ఇందిరమ్మ ఇండ్లు, మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు, కొత్త రేషన్‌కార్డులు, రాజీవ్ ఆరోగ్యశ్రీ, మహాలక్ష్మీ 200యూనిట్ల లోపు వారికి ఉచిత విద్యుత్ వంటి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు.
అధికారులకు ప్రశంసా పత్రాలు..
జిల్లా పరిధిలోని పలువురు ఉత్తమ అధికారులను స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రశంసా పత్రాలు అందజేశారు. జిల్లా అధికారులు నవీన్‌రెడ్డి, రామారావు, మహ్మద్ రియాజ్, సుశీందర్‌రావు, సౌమ్య, శ్రీలత, గోపీకృష్ణ, బీసీ నాయక్, వెంకటేశ్వర్రావు, సురేశ్‌మోహన్, సంతోష్, వెంకటేష్, రాజు, రాజశేఖర్, నాగయ్య, వెంకట్రాజిరెడ్డి, జనార్దన్‌రావు తదితరులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. వీరితో పాటు ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంతరెడ్డి, జిల్లాకు చెందిన పలువురు 52మంది అధికారులకు ఉత్తమ ప్రశంసాపత్రాలు అందజేశారు.