రంగారెడ్డి, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ) : సమాజంలోని అట్టడుగున, అణగారిన వర్గాల ప్రజల సర్వతోముఖాభివృద్ధికి, సంపూర్ణ సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తున్నదని, ఎన్ని అవరోధాలు ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నదని ముఖ్యమంత్రి సలహాదారు(ప్రజా వ్యవహారాలు) వేం నరేందర్‌రెడ్డి అన్నారు. గురువారం రంగారెడ్డి కలెక్టరేట్ ప్రాంగణంలో 78వ స్వాతంత్య్ర దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు.
ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం వేం నరేందర్‌రెడ్డి మాట్లాడారు. 2023 డిసెంబర్ 7న ప్రారంభమైన ప్రజాపాలనలో తొలుత స్వేచ్ఛ, స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యం పునరుద్ధరణకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తున్నదన్నారు. గ్యారంటీల అమలు కోసం ప్రజల నుంచి జిల్లాలో 5లక్షల 9వేల 849 దరఖాస్తులను స్వీకరించామన్నారు. జిల్లా ప్రగతిలో అన్నివర్గాల ప్రజలు మమేకం కావాలని పిలుపునిచ్చారు.
హామీలను ఒక్కొక్కటిగా..
ఇంటింటా సౌభాగ్యాన్ని నింపాలన్న మహా సంకల్పంతో అభయహస్తం హామీలను తూచ తప్పకుండా ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని నరేందర్‌రెడ్డి అన్నారు. మహాలక్ష్మి పథకంలో జిల్లాలో ఇప్పటి వరకు 14కోట్ల 59లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారని తెలిపారు. సుమారు రూ.355.74కోట్లను ప్రయాణ చార్జీల రూపంలో మహిళలు ఆదా చేసుకున్నారన్నారు.
జిల్లాలో లక్షా 93వేల 519 కుటుంబాలు రూ.500లకే వంటగ్యాస్ సిలిండర్ పొంది లబ్ధి పొందాయన్నారు. సబ్సిడీ కింద లబ్ధిదారులకు 1,43,946 సిలిండర్లకుగాను రూ.4.30కోట్లను చెల్లించడం జరిగిందన్నారు. గృహజ్యోతి పథకంలో భాగంగా 200 యూనిట్లలోపు విద్యుత్తు వాడే గృహ వినియోగదారులకు జీరో బిల్లులను జారీ చేయడం జరిగిందని, జిల్లాలో ఇప్పటివరకు 3లక్షల 33వేల కుటుంబాలకు జీరో బిల్లులను జారీ చేసి సబ్సిడీ కింద లబ్ధిదారులకు రూ.12.62కోట్ల లబ్ధి కలిగిందన్నారు.
అన్నదాతలకు అండగా..
జిల్లాలోని అన్నదాతలకు భరోసా కల్పించే దిశగా అనేక పథకాలను అమలు చేస్తున్నట్లు వేం నరేందర్‌రెడ్డి పేర్కొన్నారు. రుణమాఫీ ప్రక్రియలో భాగంగా జిల్లాలో మొదటి విడుతలో 49,471 మంది రైతులకు సంబంధించిన రూ.257.19కోట్ల రుణాలను మాఫీ చేయగా.. రెండో విడుతలో 22,915 మంది రైతులకు రూ.218.13కోట్ల రుణాలను ప్రభుత్వం మాఫీ చేసిందన్నారు. ఆగస్టు 15 నుంచి మూడో విడుత రుణమాఫీ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. రైతు భరోసా పథకంలో భాగంగా యాసంగి 2024 సీజన్‌కు 3,25,217 మంది రైతుల ఖాతాల్లో రూ.343.11కోట్లను ప్రభుత్వం జమ చేసిందన్నారు. రైతు బీమాతో గత ఏడాది డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు 653 మంది కుటుంబాలకు రూ.32.65 కోట్లను అందించామన్నారు.
ప్రజారోగ్యానికి పెద్దపీట..
ప్రజారోగ్యానికి పెద్దపీట వేయడంలో భాగంగా జిల్లాలోని 558 గ్రామపంచాయతీలు, 16 మున్సిపాలిటీల్లో ప్రత్యేక పారిశుధ్య ప్రణాళికను అమలు పరుస్తున్నట్లు వేం నరేందర్ రెడ్డి వివరించారు. వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందన్నారు. స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 2,326 కిలోమీటర్ల మేర రోడ్లు, 1,694 కిలోమీటర్ల మేర మురుగు కాల్వలు, 4,922 ప్రభుత్వ సంస్థలను శుభ్రపర్చినట్లు తెలిపారు. ఆరోగ్యశ్రీ పథకం కింద 10 లక్షల 3వేల 89 మందికి వైద్య సేవలను అందించామని పేర్కొన్నారు.
తలసరి ఆదాయంలో జిల్లా ప్రథమ స్థానం..
రాష్ట్ర తలసరి ఆదాయంలో రంగారెడ్డి జిల్లా ప్రథమ స్థానంలో ఉన్నదని వేం నరేందర్ రెడ్డి తెలిపారు. జిల్లాలో పరిశ్రమలను స్థాపించి ఇక్కడి యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాల కల్పనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదన్నారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి టీజీఐపాస్ ద్వారా 75 మైక్రో, 48 స్మాల్, 15 మీడియం, 5 లార్జ్ పరిశ్రమలను రూ.5,946 కోట్లతో స్థాపించేందుకు పరిపాలన అనుమతులను మంజూరు చేయడం జరిగిందన్నారు. దీనిద్వారా 9,936 మందికి ఉపాధి కల్పించడం జరుగుతున్నదన్నారు.
ఫోర్త్ సిటీ ఏర్పాటులో భాగంగా మీర్ఖాన్పేట్, ముచ్చర్ల వేదికగా నెట్ జీరో సిటీని ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నదని, రూ.100 కోట్ల వ్యయంతో నైపుణ్యాభివృద్ధికి సంబంధించిన స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాలను అందజేశారు. ప్రభుత్వం వివిధ పథకాల కింద మంజూరు చేసిన ఆర్థిక సాయాన్ని లబ్ధిదారులకు పంపిణీ చేశారు. వివిధ పాఠశాలలకు చెందిన చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
దేశభక్తిని చాటేలా కడ్తాల్ కేజీబీవీ స్కూల్, ఎల్బీనగర్ అక్షర ఇంటర్నేషనల్ స్కూల్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నాదర్గుల్, చిల్డన్స్ హోమ్స్ తుర్కయాంజాల్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తుక్కుగూడ విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు ఆహూతులను అలరించాయి. వేడుకల్లో ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి, ఎమ్మెల్యేలు మల్రెడ్డి రంగారెడ్డి, వీర్లపల్లి శంకర్, కలెక్టర్ శశాంక, అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్, మహేశ్వరం డీసీపీ సునీతా రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి సంగీత, కలెక్టరేట్ ఏవో సునీల్, ప్రజాప్రతినిధులు, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.