రంగారెడ్డిజిల్లాలో తరచుగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలతో రహదారులు రక్తసిక్తమవుతున్నాయి. అతివేగం, అజాగ్రత్తతో ఎంతోమంది కన్నవారికి దూరమవడంతోపాటు కట్టుకున్నవాళ్లకు కూడా కన్నీళ్లు మిగిలిస్తున్నారు. మరికొంతమంది అంగవైకల్యంతో ఇంటికే పరిమితమవుతున్నారు. ప్రమాదాల నివారణపై పోలీసులు ఫోకస్ పెట్టకపోవడం వలన ఈ ప్రమాదాలు అధికమవుతున్నట్లు ఆరోపణలొస్తున్నాయి. గత పదిహేను రోజుల్లో జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 20 నుంచి 30 వరకు మృత్యువాత పడ్డారు. మరో 20 మంది వరకు కాళ్లు, చేతులు పోగొట్టుకుని ఇండ్లకే పరిమితమయ్యారు.
ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున రంగారెడ్డిజిల్లా పెద్దఅంబర్‌పేట మున్సిపాలిటీ పరిధిలోని కుంట్లూరు పసుమాముల రహదారిలో ముగ్గురు యువకులు మృత్యువాతపడ్డారు. మరో యువకుడు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ ప్రమాదంలో మరణించిన ముగ్గురు కూడా తల్లిదండ్రులకు వారసులు లేకుండా చేశారు. ఈ వరుస రోడ్డు ప్రమాదాల సంఘటనలతో జిల్లావాసులు ఉలిక్కిపడుతున్నారు. ప్రమాదాలను అరికట్టాల్సిన పోలీసులు చలాన్లపై ఉన్న దృష్టి ప్రమాదాల నివారణపై పెట్టడంలేదనే ఆరోపణలొస్తున్నాయి.
– రంగారెడ్డి, మే 21 (నమస్తే తెలంగాణ)
ఓఆర్ఆర్పై గతంలో స్పీడ్ లిమిట్స్ 100 మాత్రమే ఉండగా, ప్రస్తుతం దానిని గంటకు 120 కిలోమీటర్లకు పెంచారు. దీంతో ప్రమాదాల సంఖ్య కూడా పెరిగిపోతున్నది. ఇటీవల ఔటర్ రింగ్‌రోడ్డుపై రావిర్యాల వండర్లా సమీపంలో చెట్లకు నీళ్లు పోస్తున్న ట్యాంకర్‌ను బ్రీజా కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కొంగరకలాన్‌కు చెందిన ట్యాంకర్ డ్రైవర్‌తోపాటు మరో ఇద్దరు మృత్యువాతపడ్డారు. అలాగే, ఈ నెల 10న తెల్లవారుజామున ఓఆర్ఆర్పై గండిచెరువు బ్రిడ్జి వద్ద ఆగి ఉన్న వాహనాన్ని కారు ఢీకొని చెలరేగిన మంటల్లో ఇద్దరు యువకులు మృతిచెందారు.
మరో యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. 19న ఓఆర్‌ఆర్‌పైన కొహెడ సమీపంలో ఆగి ఉన్న లారీని పాల ట్యాంకర్ ఢీకొని మరో వ్యక్తి మృతిచెందాడు. వారం రోజుల క్రితం ఓఆర్ఆర్పై బొంగ్లూరు గేటు సమీపంలో బ్రీజా కారు బోల్తాపడి నల్లవెల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మృతిచెందాడు. ఇటీవలే ఓఆర్ఆర్పై బొంగ్లూరు సమీపంలో కలకత్తాకు చెందిన హీలాల్ అనే వ్యక్తి ఓఆర్ఆర్ రెయిలింగ్‌కు ఢీకొని మృతిచెందాడు. 12న ఓఆర్ఆర్ సర్వీసు రోడ్డులో ట్రక్కును ఢీకొని మరో వ్యక్తి మృతిచెందాడు.
జిల్లా పరిధిలో హైదరాబాద్ బీజాపూర్, హైదరాబాద్ బెంగళూరు, నాగార్జునసాగర్ హైదరాబాద్, శ్రీశైలం హైదరాబాద్, విజయవాడ హైదరాబాద్ రహదారులున్నాయి. ప్రతిరోజూ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. బీజాపూర్ హైదరాబాద్ రహదారిని విస్తరించడానికి ప్రభుత్వం నిధులివ్వకపోవడంతో రెండు నెలల క్రితం రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముకుంటున్న రైతులపైకి లారీ దూసుకెళ్లి పలువురు మృత్యువాతపడ్డారు. అయినప్పటికీ ప్రభుత్వం ఈ రహదారుల విస్తరణతోపాటు అభివృద్ధి చేయడంలో శ్రద్ధ చూపడంలేదని ప్రజలు విమర్శిస్తున్నారు.
జరిగిన ప్రమాదాలన్నీ
జిల్లాలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాలన్నీ అతివేగం, అజాగ్రత్త వల్లనే జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. మితిమీరిన వేగంతో వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణమవుతున్నారు. అతివేగంగా వాహనాలు నడపడం వలన అభం, శుభం తెలియని పక్కవారు కూడా ప్రాణాలు వదులుతున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు జరిగిన ఈ ప్రమాదాల్లో కొన్ని ప్రమాదాలు మద్యం మత్తులో జరుగగా, మరికొన్ని అతివేగం, అజాగ్రత్త వల్లనే జరిగినట్లు పోలీసులు తెలుపుతున్నారు.
ప్రమాదాల్లో మరణించిన వారి కుటుంబాలది ఒక్కొక్కరిది ఒక్కో కన్నీటి గాథ. కుటుంబాన్ని పోషించే వ్యక్తి మృతిచెందడంతో కుటుంబాల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతున్నది. అలాగే, చేతికందివచ్చిన కుమారులు చనిపోయి వారి తల్లిదండ్రులకు తీవ్ర గర్భశోకాన్ని మిగిలిస్తున్నారు. హయత్‌నగర్ పోలీసుస్టేషన్ పరిధిలోని కుంట్లూరులో బుధవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో మరణించిన చంద్రసేనారెడ్డి, వర్షిత్‌రెడ్డి, త్రినాథ్‌రెడ్డి చనిపోవడంతో వారి కుటుంబాలకు వారసులు లేకుండా పోయారు. చెంచు శ్రీనివాస్‌రెడ్డి, చెంచు జంగారెడ్డి అన్నాదమ్ములు, ఈ ప్రమాదంలో వారి కుమారులు వర్షిత్‌రెడ్డి, త్రినాథ్‌రెడ్డి మృతిచెందటంతో వారి రోదనలు మిన్నంటాయి. వారి మృతితో కుంట్లూరు గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది.
జిల్లాలో రోజురోజుకూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ ప్రమాదాల నివారణకు పోలీసులు ఫోకస్ పెట్టడంలేదనే ఆరోపణలొస్తున్నాయి. ముఖ్యంగా ట్రాఫిక్ పోలీసులు చలాన్లపై దృష్టి సారించారని.. సివిల్ పోలీసులు వాహనాల ప్రమాదాలను అరికట్టడంలేదని ఆరోపణలొస్తున్నాయి. ముఖ్యంగా ఓఆర్ఆర్పై స్పీడ్ గన్స్ లేకపోవడం, పెట్రోలింగ్ సిబ్బంది లేకపోవడం కూడా ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఓఆర్ఆర్కు సమీపంలో ఉన్న ట్రామా సెంటర్లు కూడా పనిచేయడంలేదు. ప్రమాదాలు జరిగినప్పుడు అత్యవసర చికిత్సలు అందించడం కోసం ఏర్పాటు చేసిన హైవే పెట్రోలింగ్ సిబ్బంది కూడా కనిపించకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజలు పేర్కొంటున్నారు.