కొడంగల్, నవంబర్ 11 : కాంగ్రెస్ పార్టీ పేర్కొంటున్న 6 గ్యారెంటీలు చిత్తు కాగితాలతో సమానమని.. పక్కనే ఉన్న కర్ణాటకలో ఇచ్చిన ఇటువంటి హామీలు ఏ ఒక్కటీ అమలు చేయడం లేదని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలు, గనులు, భూగర్భ వనరుల శాఖల మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు. శనివారం పట్టణంలో మంత్రి సమక్షంలో దౌల్తాబాద్ మండలంలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు 100 మంది బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఉనికిని చాటుకునేందుకు 6 గ్యారెంటీలను తెరపైకి తెచ్చిందని ఆరోపించారు. ప్రజా సంక్షేమంపై కాంగ్రెస్ పార్టీకి కానీ, నాయకులకు కానీ చిత్తశుద్ధి లేదని, అధికారాన్ని దక్కించుకోవాలని అడ్డదారులు తొక్కుతున్నట్లు పేర్కొన్నారు.
గతంలో 60 సంవత్సరాలు కాంగ్రెస్, ఇతరత్రా పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ఇటువంటి పథకాలను అమలు చేయలేదని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ ప్రజా సంక్షేమ పథకాలను చూసిన తరువాతే కాంగ్రెస్ కండ్లు తెరిచిందని, కేసీఆర్ పథకాలను కాపీ కొడుతూ వేలం పాట మాదిరిగా గ్యారెంటీలను ప్రకటించినట్లు పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఇంత ఇస్తే.. మేము అంతకంటే రెట్టింపు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ పెట్టిన వేలాన్ని ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరన్నారు. బీఆర్ఎస్ పార్టీ గత ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడంతో పాటు హామీ ఇవ్వని ఎన్నో అద్భుత ప్రజా సంక్షేమ పథకాలను అందించి మాట నిలబెట్టుకున్నట్లు పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో కూడా పేద, బడుగు, బలహీన వర్గాలను దృష్టిలో పెట్టుకొని సీఎం కేసీఆర్ ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేశారన్నారు.
మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యత కల్పిస్తూ.. ప్రతి పేద మహిళకు ప్రతి నెలా రూ.3వేలు, తెల్లరేషన్ కార్డు ఉన్న లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ, ఆసరా, ఒంటరి మహిళ పింఛన్లను రూ.5వేలకు పెంచి అందించడం, రూ.400లకే గ్యాస్ సిలిండర్, రైతులకు రైతు బంధు పథకం కింద రూ.16వేలు.. ఇలా ఎన్నో అద్భుత పథకాలను సీఎం కేసీఆర్ ప్రకటించారన్నారు. గతంలో మాదిరిగా ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్న పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేయడమే కాకుండా మరి కొన్ని కొత్త కొత్త పథకాలను అమలు చేసే ఆస్కారం కూడా ఉంటుందన్నారు. కాంగ్రెస్ బూటకపు వాగ్దానాలను నమ్మకుండా బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటేసి, ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
2018 ఎన్నికలకు ముందు కొడంగల్ నియోజకవర్గం అన్నింటా వెనుబడిన ప్రాంతంగా ఉండేదని, అప్పటి ఎన్నికల ప్రచారంలో ప్రతి గ్రామాన్ని, తండాల్లో పర్యటించి ప్రజా సమస్యలను గుర్తించినట్లు తెలిపారు. కొడంగల్ ప్రజల సమస్యను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి అప్పట్ల్లోనే దాదాపు రూ.300ల కోట్లు మంజూరు చేయించి, గ్రామాలకు బీటీ రోడ్లు, గ్రామాల్లో సీసీ రోడ్లు వంటి పనులు జరిపించినట్లు పేర్కొన్నారు. పట్నం నరేందర్‌రెడ్డి గెలిచిన తరువాత రూ.950 కోట్లతో నియోజకవర్గంలో చాలా వరకు అన్నింటా సౌకర్యాలు సమకూరినట్లు పేర్కొన్నారు.
ప్రతి గ్రామం, తండాలకు బీటీ రోడ్లు, తాగునీరు, గ్రామాలను కలుపుతూ బ్రిడ్జిల నిర్మాణంతో పాటు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతితో పట్టణ, గ్రామ, తండాల రూపురేఖలు మారినట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి గడిచిన 5 సంవత్సరాల కాలం నరేందర్‌రెడ్డి ప్రజల మధ్యన ఉంటూ ప్రజా సమస్యలను స్వయంగా గుర్తించి, ప్రజల మేలు కోసం పాటుపడ్డారన్నారు. అందుకే నేడు ఏ గ్రామానికి, తండాకు వెళ్లినా ఎమ్మెల్యేకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నట్లు పేర్కొన్నారు. ప్రజా నాయకుడంటే పట్నం నరేందర్‌రెడ్డి అని ప్రజలు ముక్త కంఠంతో ఎలుగెత్తి చాటుతున్నారని పేర్కొన్నారు.
గతంలోని ఎమ్మెల్యే 10 సంవత్సరాల్లో గ్రామాలకు ఒక్కసారి కూడా వచ్చిన దాఖలాలు లేవని, కొడంగల్‌ను ఎటువంటి అభివృద్ధి చేయకుండా హైదరాబాద్‌కు పరిమితమై స్వప్రయోజనాలతో అంచలంచెలుగా ఎదిగినట్లు చెప్పుకొంటున్నారని తెలిపారు. కొడంగల్‌కు ఆయన చేసిన మేలు ఏమీ లేదని, ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి వచ్చిన తరువాతే కొడంగల్ అభ్యున్నతిలో దూసుకెళ్లిందని పేర్కొన్నారు. మరోమారు నరేందర్‌రెడ్డిని ప్రజలు ఆశీర్వదిస్తే, మంత్రి కేటీఆర్ ఇచ్చిన ప్రమోషన్ హామీతో మరింత స్థాయిలో కొడంగల్‌ను అభివృద్ధి చేసుకునే ఆస్కారం ఉంటుందన్నారు. ప్రజలు ఎన్నికల్లో అప్రమత్తంగా ఉండి మాయమాటలు, మోసపూరితమైన వాగ్దానాలతో మోసపోకుండా బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓట్లేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
మాజీ జడ్పీటీసీ మోహన్‌రెడ్డి, వైస్ ఎంపీపీ మహిపాల్‌రెడ్డి, మాజీ ఎంపీపీ కృష్ణారెడ్డి, సర్పంచ్ రమేశ్, బీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు మహేందర్ ఆధ్వర్యంలో దౌల్తాబాద్ గ్రామంలోని కాంగ్రెస్ నాయకులు కుమ్మరి మొగులప్ప, కుమ్మరి చిన్న కురుమూర్తి, కుమ్మరి నారాయణ, కుమ్మరి దస్తప్ప, ఎండీ మోహిద్, కుమ్మరి సాయిలు, మున్కంపల్లి వీరేశ్, నరేశ్, ఇందనూర్ అశోక్, పర్సాపురం ఫకీరప్ప, మల్కప్ప, కుమ్మరి సాయిలు, బోయ బుగ్గప్ప, కుమ్మరి మోహన్, పల్లెవోని నరేశ్, తోట గోపాల్, బొక్క లాలు, టప్ప హన్మంతు, కుమ్మరి కుర్వప్ప, సాయిలు, మాలల పెద్ద సాయిలు, మధు, గడ్డమీది రాములు, ఆశప్ప, నారాయణ, అశోక్, కుమ్మరి రాజ్‌కుమార్, బాలకృష్ణ, యాలాల నాగరాజు తదితరులు 100 మంది మంత్రి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. సీఎం కేసీఆర్ పాలనా దక్షతకు, ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అభివృద్ధికి కృషి చేస్తున్నందుకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు వారు తెలిపారు.
గత 5 సంవత్సరాల క్రితం గ్రామాలు, తండాలు చాలా వెనుబడి ఉండేవని, రేవంత్‌రెడ్డి ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోకుండా స్వార్థ రాజకీయాలకు మాత్రమే ప్రాధాన్యత కల్పించడం వల్ల కొడంగల్ నియోజకవర్గం అన్నింటా వెనుబడి పోయిందన్నారు. ఒకటి కాదు రెండు సార్లు అవకాశం కల్పించినా ప్రజల కష్టాలను తీర్చలేదని, మళ్లీ ఇప్పుడు వచ్చి నేను సీఎం అవుతానని, అభివృద్ధి చేస్తాను అంటే ఏవిధంగా నమ్మాలన్నారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే కొడంగల్ అభివృద్ధికి పాటుపడలేదు కానీ సీఎంగా ఉంటే రాష్ర్టాన్ని ఏవిధంగా అభివృద్ధి చేస్తారని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డివి మాటలే తప్ప చేతలు చేతకావని తెలిసి బీఆర్ఎస్ పార్టీకి మా పూర్తి మద్దతు పలుకుతున్నట్లు పేర్కొన్నారు.
ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించేందుకు మున్సిపల్ కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, వార్డు సభ్యులు సైనికుల్లా కృషి చేయాలని మంత్రి తెలిపారు. పట్టణంలో మున్సిపల్ కౌన్సిలర్లతో పాటు మండల పరిధిలోని సర్పంచ్‌లతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు. గత ఎన్నికల్లో ఏ విధంగా కృషి చేసి పట్నం నరేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకున్నామో.. అదే తరహాలో ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కష్టపడి ప్రజా నాయకుడిని కాపాడుకోవాలని కోరారు. వార్డుల్లో ప్రచారాన్ని నిర్వహించి, సీఎం కేసీఆర్ పథకాలను ప్రజలకు తెలపాలని, పథకాలు అందుకున్న లబ్ధిదారులను నేరుగా కలిసి పది మందికి వివరించేలా తోడ్పాటును అందించాలన్నారు.
ప్రతి గడపకు కేసీఆర్ పథకాలు అందాయని, లబ్ధిదారుల్లో చైతన్యం తెచ్చి ఎవరి ద్వారా లబ్ధి పొందుతున్నాం.. అభివృద్ధిని అందుకుంటున్నామో ప్రజలకు వివరించాలన్నారు. కేసీఆర్ పథకాలే.. బీఆర్ఎస్ పార్టీకి ఘన విజయాన్ని సాధించి పెడతాయని బీఆర్ఎస్ శ్రేణుల్లో ప్రత్యేక ఉత్సాహాన్ని నింపారు. కార్యక్రమంలో స్పోర్ట్స్ మాజీ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు నరోత్తంరెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్ వెంకట్రె డ్డి, బీఆర్ఎస్ నాయకులు నవాజుద్దీన్, రమేశ్‌బాబు ఉన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్, బీజేపీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. వారికి మంత్రులు మహేందర్‌రెడ్డి, సబితారెడ్డి, గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఖాళీ అవుతున్న నాయకులు, కార్యకర్తలతో కాంగ్రెస్, బీజేపీలు బేజారవుతున్నాయి.
పార్టీలో చేరినవారు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పాలనా దక్షతకు, అభివృద్ధికి కృషి చేస్తున్నందుకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. రేవంత్‌రెడ్డివి మాటలే తప్ప చేతలు చేతకావని తెలిసి బీఆర్ఎస్ పార్టీకి మా పూర్తి మద్దతు పలుకుతున్నట్లు పేర్కొన్నారు. మంత్రులు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ గెలుపునకు సైనికుల్లా కలిసి రావాలని పార్టీలో చేరినవారికి సూచించారు. కష్టపడ్డవారికి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు.