శుక్రవారం 27 నవంబర్ 2020
Rangareddy - Sep 22, 2020 , 01:06:32

ఆన్‌లైన్‌ క్లాసుల పేరుతో.....ఫీజులుం తగదు

ఆన్‌లైన్‌ క్లాసుల పేరుతో.....ఫీజులుం తగదు

రంగారెడ్డి,నమస్తే తెలంగాణ : రంగారెడ్డి జిల్లా మణికొండలోని ఓ ప్రైవేటు స్కూల్‌లో ఫీజులుం పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులను వేధిస్తున్న యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని..స్కూల్‌ గుర్తింపు రద్దు చేయాలని సినీనటుడు శివబాలాజీ దంపతులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం సతీమణి మధుమితతో కలిసి  రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లోని జిల్లా విద్యాధికారి విజయలక్ష్మిని కలిసి మణికొండలో ప్రైవేట్‌ స్కూల్‌పై ఫిర్యాదు చేయడానికి డీఈవో అందుబాటులో లేకపోవడంతో కార్యాలయంలో ఏడీకి ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు. అనంతరం కలెక్టర్‌ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు.ప్రైవేటు స్కూల్‌లో చదువుతున్న తమ పిల్లలను అమాంతంగా స్కూల్‌ నుంచి తొలిగించడంపై ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని రోజుల క్రితం శివబాలాజీ పిల్లలు ఆన్‌లైన్‌ క్లాసుల్లో హాజరవుతుండగా ఫీజు చెల్లించే క్రమంలో స్కూల్‌ యాజమాన్యం తమతో దురుసుగా వ్యవహరించిందన్నారు. యాజమాన్యం ప్రవర్తనపై నిలదీసినందుకు తమ పిల్లలను అర్ధాంతరంగా ఆన్‌లైన్‌ క్లాస్‌ల నుంచి తొలిగించారని వాపోయారు. తమ పిల్లలను స్కూలు నుంచి తొలిగిస్తున్నట్లు  మెయిల్‌కు సమాచారం ఇవ్వడమేంటని ప్రశ్నించారు. విద్యార్థుల జీవితాలతో, పేరెంట్స్‌ పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తున్న స్కూల్‌ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించగా రంగారెడ్డి జిల్లా విద్యాధికారికి కమిషన్‌ నుంచి నోటీసులు కూడా అందాయని ..ఈ నేపథ్యంలో విషయం తెలుసుకుని విద్యాధికారితో చర్చించడానికి వచ్చినట్లు వివరించారు. రంగారెడ్డి జిల్లా విద్యాధికారి ఇటీవలే ఈ విషయంలో సానుకూలంగా స్పందించి స్కూల్‌ యాజమాన్యంతో మాట్లాడగా..టెక్నికల్‌ సమస్యలతో తమ పిల్లల క్లాస్‌లకు ఇబ్బంది కలగడంతో.. అలా టెక్నికల్‌గా తొలిగిపోయాంటూ బుకాయించినట్లు వెల్లడించారు. విద్యార్థుల తల్లిదండ్రులను కూడగట్టుకొని మీడియా ముందు డ్రామా ఆడుతున్నాడని మాట్లాడడం.. స్కూల్‌ యాజమాన్యానికి ఎంతవరకు సమంజసమో వారి విజ్ఞతకే వదిలేస్తునట్లు శివబాలాజీ దంపతులు వెల్లడించారు. యాజమాన్యం తీరు మారకపోతే స్కూలు అనుమతి రద్దు చేసేంత వరకు తమ పోరాటం కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు. వారి వెంట న్యాయవాది చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.