రంగారెడ్డి, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ) : ఎన్నికల ప్రచారంలో గులాబీ దండు కదం తొక్కుతున్నది. బీఆర్ఎస్ అభ్యర్థుల తరఫున ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహిస్తున్నారు. తొమ్మిదేండ్ల కాలంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను గడపగడపకూ వెళ్లి వివరిస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు.
కాంగ్రెస్, బీజేపీలను నమ్మి మోసపోవద్దని, సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ సర్కార్తోనే అభివృద్ధి సాధ్యమని ప్రజలకు వివరిస్తున్నారు. మళ్లీ ఆశీర్వదిస్తే అండగా ఉంటామని భరోసా ఇస్తున్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి శనివారం మహేశ్వరంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించారు. మరోపక్క బీఆర్ఎస్ పార్టీలోకి వలసల పర్వం సైతం మరింత ఊపందుకున్నది. దీంతో ప్రతిపక్ష పార్టీలు ఖాళీ అవుతున్నాయి.
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శనివారం కందుకూరు నియోజకవర్గ కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం పోతర్ల బాబయ్య ఫంక్షన్ హాల్లో పార్టీ శ్రేణులతో సమావేశాన్ని నిర్వహించారు. ఇంటింటి ప్రచారంరలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని కోరారు. మళ్లీ అధికారంలోకి సీఎం కేసీఆర్ వస్తేనే ఈ ప్రాంతంలో మెట్రో రైలు పరుగులు పెడుతుందని, మెడికల్ కాలేజ్ కార్యరూపంలోకి రావడంతోపాటు మహేశ్వరం మరో హైటెక్ సిటీగా మారుతుందన్నారు.
ఈ సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు రాజీనామా చేసి పెద్ద ఎత్తున మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. షాద్నగర్ ఎమ్మెల్యే అభ్యర్థి అంజయ్యయాదవ్ ఫరూక్ నగర్ మండలంలోని కొండన్నగూడ, వెంకన్న గూడ, బుచ్చుగూడ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చౌదరిగూడెం మండలంలోని గాలిగూడ గ్రామానికి చెందిన పలువురు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే అభ్యర్థి మంచిరెడ్డి కిషన్రెడ్డి అనాజీపూర్, లోయపల్లి గ్రామాల్లో నిర్వహించిన ధూంధాం కార్యక్రమంలో పాల్గొన్నారు.