ప్రతి ఏటా పత్తి రైతు ఏదో రకంగా చిత్తవుతున్నాడు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయానికి సరైన ధర లేకపోవడం, సీసీఐ పెట్టే కొర్రీలు, అకాల వర్షాలతో ఆగమావుతున్నాడు. వేలకు వేలు పెట్టుబడి పెట్టి సాగు చేస్తే ప్రతికూల వాతావరణంలో అంతంత మాత్రమే దిగుబడి వస్తున్నది. వచ్చిన ఆ కొద్దిపాటి పంటనూ అమ్ముకునేందుకు ధర లేకపోవడం తో దిగాలు పడుతున్నాడు. ప్రభుత్వం క్వింటాలుకు రూ.7,521 మద్దతు ధరను ప్రకటించగా.. ఉమ్మడి జిల్లాల్లో ఇప్పటివరకు ప్రభుత్వం ఒక్క కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయలేదు. ఇది దళారులకు వరంగా మారి .. ధరను తగ్గించి కొంటున్నారు. కాగా రంగారెడ్డి జిల్లాలో 1.20 లక్షల ఎకరాల్లో పంట సాగుకాగా.. 11.50 లక్షల క్విం టాళ్ల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. అదేవిధంగా వికారాబాద్ జిల్లాలో 2.30 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగు కాగా, 2.30 లక్షల మెట్రిక్ టన్నుల పంట దిగుబడి రానుందని అంచనా వేస్తున్నారు.
రంగారెడ్డి/వికారాబాద్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ) : రంగారెడ్డి జిల్లాలో ఈసారి వానకాలంలో రైతులు పత్తి పంటను 1,28,720 ఎకరాల్లో సాగు చేశారు. అత్యధికంగా షాద్‌నగర్, చేవెళ్ల, కల్వకుర్తి సెగ్మెంట్లలో సాగైంది. జిల్లాలో సాగు అవుతున్న మొత్తం సా గు విస్తీర్ణంలో సింహభాగం మాడ్గుల మండలంలోనే ఉంటుంది. అయితే ఈ సారి పత్తి దిగుబడులపై రైతులు దిగులు చెందుతున్నారు.
నిజానికి సీజన్ మొదట్లో పత్తి విత్తనాలు వేసేందుకు అనువైన వర్షాలు పడలేదు. విత్తనాలు వేసినా..వర్షాల్లేక రెండు, మూడుసార్లు వేయాల్సి వచ్చింది. పత్తి పూత దశకు వచ్చిన సమయంలోనూ భారీవర్షాలు పడ్డాయి. చేన్లు నీట మునిగి పూత, కాయ నేలవాలాయి. కొమ్మలు నీటిలో నాని తెగు ళ్లు సోకి దెబ్బతిన్నాయి. ఈ పరిస్థితుల్లో దిగుబడి ఆశించిన స్థాయిలో వచ్చే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు. దీంతోపాటు ఈసారి విత్తనాల ధర లు, ఎరువులు, ఖర్చులు పెరిగి తడిసి మోపెడయ్యింది.
ఊసేలేని సీసీఐ కొనుగోలు కేంద్రాలు..
జిల్లాలో వారం, పది రోజులుగా పత్తి పంట చేతికొస్తున్నా ..కొనుగోలు కేంద్రాల జాడ కనిపించడంలేదు. పంట సీజన్‌కు ముందుగానే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయా ల్సి ఉండగా..ఆ దిశగా అడుగులు ముందుకు పడలేదు. జిల్లాలో మొత్తం 14 జిన్నింగ్ మిల్లుల వద్ద కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదించారు. సం బంధిత ఫైల్ ప్రస్తుతం కలెక్టర్ వద్ద ఉన్నది.
షాద్‌నగర్ ప్రాంతంలో 11 కేంద్రాలు, ఆమనగల్లు ప్రాంతంలో మూడు కేంద్రాలను నోటిఫై చేశారు. చేవెళ్ల నియోజకవర్గంలో ఉన్న జిన్నింగ్ మిల్లు యజమానులు ఈసారి కేంద్రం ఏర్పాటుకు ముందుకు రాలేదు. కేంద్రాల ప్రారంభానికి ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో సం బంధిత అధికారులు ప్రభుత్వ ఆదేశాల కోసం ఎదురు చూ స్తున్నారు. నవంబర్ మూడోవారంలో కేంద్రాలను ప్రారంభిం చే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. ఇప్పటికే కొన్ని చోట్ల మొదటితీతను పూర్తి చేసిన రైతులు ఇంట్లో నిల్వ చేసుకో లేక తమ పంటను తక్కువ ధరకు ప్రైవేట్ వ్యాపారులు, దళారులకు అమ్ముకుంటూ తీవ్రంగా నష్టపోతున్నారు.
ధర తగ్గించి దళారుల విక్రయాలు..
సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం దళారులకు వరంగా మారింది. మొన్నటివరకు రూ.8 వేల వరకు పలికిన సాధారణ పత్తి ధర క్రమంగా తగ్గుతూ వస్తున్నది. నాణ్యతను బట్టి ప్రస్తుతం ధర రూ.5,000-రూ. 6,500 వరకు పలుకుతున్నది. ఇప్పటికే ప్రతి గ్రా మంలోనూ దళారులు పత్తిని కొంటున్నారు. నాసిరకంగా ఉందంటూ సాకులు చెబుతున్నారు. వారు చెప్పిందే ధర అన్నట్లుగా వ్యవహరిస్తుండడంతో రైతులు భారీగా నష్టపోతున్నారు.
జిల్లాలో 11.50 లక్షల క్వింటాళ్ల వరకు పత్తి దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అంచనా. క్వింటాపై రూ.1,500 నుంచి రూ. 2000 వరకు ధర తగ్గితే రైతుల కు పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది. జిల్లాలో కేవలం పత్తి క్రయవిక్రయాల విలువ సుమారు రూ.7000 కోట్ల వరకు ఉంటుంది. క్వింటాపై రూ.వెయ్యి తగ్గినా రైతులు రూ.110 కోట్ల మేర నష్టపోతారు. అదే రూ.2 వేలు పడిపోతే ఈ నష్టం రెట్టింపవుతుంది. ఇప్పటికైనా సీసీఐ స్పందించాలని, కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోతే రైతులు తీ వ్రంగా నష్టపోతారని వ్యవసాయరంగ నిపుణులు పేర్కొంటున్నారు.
వికారాబాద్ జిల్లాలో 2.30 లక్షల ఎకరాల్లో పంట సాగు..
వికారాబాద్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోవడంతో పత్తి రైతు ధర లేకపోవడంతో ఆర్థికంగా నష్టపోతున్నాడు. జిల్లాలోని పరిగి, వికారాబాద్ నియోజకవర్గాల్లో అధిక మొత్తంలో పత్తి సాగు అవుతుండగా.. తాండూరు, కొడంగల్ సెగ్మెంట్లలో కొంతమేర సాగవుతుంది. అయితే ఈ ఏడాది 14 కొనుగోలు కేంద్రాలను ఏర్పా టు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ ఏడాది 2.30 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగు కాగా, 2.30 లక్షల మెట్రిక్ ట న్నుల పంట దిగుబడి రానుందని అంచనా వేస్తున్నారు.
సీసీఐ కొనుగోళ్లు ఇప్పట్లో లేనట్లే..
జిల్లాలోని తాండూరు, కొడంగల్ నియోజకవర్గాల్లో పత్తి ఏరడం ప్రారంభమైంది. అయితే కొనుగోలు కేంద్రాల ప్రారంభ ప్రక్రియ ఇం కా ప్రతిపాదన దశలోనే ఉండడం గమనార్హం. సీసీఐ ఆధ్వర్యంలో జిల్లాలో 14 జిన్నింగ్ మిల్లుల ద్వారా పత్తిని సేకరించాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించినా ఇప్పటివరకు ఒక్క జిన్నింగ్ మిల్లులో నూ పత్తి కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. దీంతో తాండూరు, కొడంగల్ సెగ్మెంట్లలో పత్తిని తీస్తున్న రైతు లు ఆ పంటను మిల్లులకు తీసుకొస్తుండగా.. మరి కొంతమంది బహిరంగ మార్కెట్లో విక్రయిస్తున్నారు.
ప్రతి ఏటా బహిరంగ మార్కెట్లో సీసీఐ కేంద్రాల కంటే రూ.200-రూ.300 ధర అధికంగా ఉండగా.. ఈ సారి మాత్రం ఘోరంగా పడిపోయింది. ప్రతిపాదన దశలోనే సీసీ ఐ కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ఉండడంతో పత్తిని తీసుకొస్తున్న రైతులు తప్పని పరిస్థితుల్లో కనీస మద్దతు ధర కంటే చాలా తక్కువకు విక్రయిస్తూ నష్టపోతున్నా రు. బహిరంగ మార్కెట్లో క్వింటాలుకు రూ. 6000-రూ.6500లకు వ్యాపారులు కొం టున్నారు. అయితే సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో పత్తి కొనుగోళ్ల ప్రా రంభానికి మరో నెలరోజుల సమయం పట్టే అవకాశం ఉన్నది.
డిసెంబర్ నెలలో సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్లు ప్రారంభమవుతుందని జిన్నింగ్ మిల్లుల నిర్వాహకులు చెబుతున్నారు. గత వారం రోజులుగా తాండూరు, కొడంగల్ సెగ్మెంట్లకు చెందిన రైతులు రోజుకు 1000 క్వింటాళ్ల వరకు పత్తిని మిల్లులకు తీసుకొస్తుండగా.. వారు తక్కువ ధరకే కొంటున్నార ని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీసీఐ కేంద్రాలు ప్రారంభమయ్యే వరకు రైతులు తక్కువ ధరకు విక్రయించి నష్టపోవాల్సిన దుస్థితి నెలకొన్నది. అంతేకాకుండా గత రెండు, మూడు రోజులుగా కురిసిన వర్షాలతో ఏరిన పత్తి తడిసిపోవడంతో ఇంట్లో నిల్వ ఉంచుకోలేక తప్పని పరిస్థితుల్లో తక్కువ ధరకు విక్రయిస్తూ నష్టపోతున్నారు.
గత్యంతరం లేకే.. అమ్ముతున్నాం
అకాల వర్షాలకు తోడు, ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో అన్నదాత ఆ పంటను వ్యాపారులకు విక్రయిస్తూ నష్టాల పాలు అవుతున్నాడు. ఇటీవల కురిసిన వానలకు పంట ఎర్ర బారి చచ్చిపోతున్నది. దానిని ఇంట్లో నిల్వ చేస్తే ఇంకా చెడిపోయే ప్రమాదం ఉండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో దళారులకు తక్కువ ధరకు విక్రయిస్తున్నాం.
– శేఖర్ రైతురైతు ఎక్మాయి, బషీరాబాద్
మద్దతు ధర రావడం లేదు..
ప్రభుత్వం రైతుబంధు డబ్బులు ఇవ్వకపోయినా.. అప్పులు చేసి పది ఎకరాల్లో పత్తి పంటను సాగు చేశా. పత్తి ఇండ్లలోకి వచ్చినా ప్రభుత్వం కొనుగో లు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాం. ప్రైవేట్ వ్యాపా రు లు, దళారులకు విక్రయిస్తే వారు మద్దతు ధర చెల్లించడంలేదు. అన్నదాత అప్పుల పాలు కాకుండా ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి.
-గోవిందు యాదయ్య, రైతు, నర్సప్పగూడ
సీసీఐ కేంద్రాలను ప్రభుత్వం ప్రారంభించాలి
వర్షాలు అధికంగా కురవడంతో పత్తి పంట పూర్తిగా దెబ్బతిన్నది. దానికితోడు సీసీఐ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడంతో దళారులు, మధ్యవర్తులకు తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దళారులు నాసికరంగా ఉందంటూ తక్కువ ధర చెల్లిస్తుండడంతో తీవ్రంగా నష్టపోతున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి.
– రమేశ్ రైతు, రామన్నగూడ, చేవెళ్ల మండలం
క్వింటాల్ ధర రూ.10 వేలుగా నిర్ణయించాలి
నేను నాలుగు ఎకరాల్లో పత్తి పంటను సాగు చేశా. వానలు సకాలంలో కురవక పోవడంతో పంట ఆశాజనకంగా లేదు. అదే విధంగా ప్రస్తుతం కురుస్తున్న వానలతో పత్తి తడిసిపోయి నల్లగా అవుతున్నది. ప్రభుత్వం క్వింటాకు మద్దతు ధరను రూ. 7,121 ప్రకటించింది. ఈ ధర రైతులకు ఏ మాత్రం సరిపోదు. ప్రభుత్వం క్వింటాల్ ధరను రూ.10 వేలుగా నిర్ణయించాలి. అప్పుడే పత్తి రైతులకు నష్టాలు తగ్గి లాభాలొస్తాయి.
-ఇప్పల కృష్ణయ్య, రైతు, కడ్తాల్
గిట్టుబాటు ధర కల్పించాలి
ప్రభుత్వం పత్తి రైతులకు గిట్టుబాటు ధర కల్పించి వారిని ఆదుకోవాలి. తాజాగా కురుస్తున్న వానలతో పత్తి పంట నాని నల్లగా మారుతున్నది. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఆ పంటను మద్దతు ధరకు కొనుగోలు చేసి అన్నదాతలను ఆదుకోవాలి. లేకుంటే వారు అప్పులపాలు అవుతారు.
– రైతు బీరయ్య, మాడ్గుల గ్రామం, మాడ్గుల
పత్తి తీయక ముందే కేంద్రాలను ఏర్పాటు చేయాలి
ప్రభుత్వం పత్తి రైతులను ఆదుకునేందుకు వెంటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మద్దతు ధరను ఆ పంటను కొనాలి. ఈ సారి వర్షాలు సకాలంలో కురువక పోవడంతో ఆ పంట ఆశాజనకంగా లేదు. పత్తి తీయక ముందే కొనుగోలు కేం ద్రాలను ఏర్పాటు చేస్తే ప్రభుత్వం పత్తిని కొంటుందన్న ధైర్యం అన్నదాతల్లో ఉం టుంది.
-సుధాకర్‌రెడ్డి, కాశీంబౌలి, మొయినాబాద్
ధర లేక నష్టాల పాలు..
ఈ ఏడాది పత్తికి ధర లేక చాలా నష్టపోతున్నాం. పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే అవకాశం కనిపించడం లేదు. ప్రభుత్వం పత్తికి మద్దతు ధరను పెంచి రైతులను ఆదుకోవాలి. గతేడాది రూ. 7000- 9000 వరకు పత్తికి ధర పలికింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో రూ. 5 వేలే ఉండటం చాలా దురదృష్టకరం.
-కట్ట అంజయ్య, నల్లచెరువు గ్రామం, మాడ్గుల
అప్పులే మిగులుతున్నాయి..
వేలకు వేలు పెట్టుబడి పెట్టి పంటను సాగు చేస్తే అన్నదాతకు అప్పులే మిగులు తున్నాయి. సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం దళారులకు వరంగా మారింది. తక్కువ ధరకు అన్నదాతల నుంచి పంటను కొనుగోలు చేస్తున్నారు.
-వీరాంజనేయులు, రైతు, అంతారం గ్రామం, చేవెళ్ల