ఆర్థికంగా వెనుకబడి ఉన్న దళితుల జీవితాల్లో వెలుగు రేఖలు నింపి దేశంలో ఎక్కడా అమలులోలేని దళిత బంధు పథకాన్ని సీఎం కేసీఆర్ రూపొందించి అమలుచేస్తున్నారు. 100 శాతం గ్రాంటుతో రూ.10లక్షలు అందించడమే కాకుండా లబ్ధిదారుడికి నచ్చిన యూనిట్‌ను ఎంచుకునే స్వేచ్ఛను కల్పించారు. అనుకూలత ప్రకారం నలుగైదుగురు కలిసి ఓ పెద్ద యూనిట్‌ను ఏర్పాటు చేసుకునేందుకు కూడా ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. రూ.10వేలతో రక్షణ నిధిని ఏర్పాటు చేస్తారు.
వచ్చే నెల 7 లోగా యూనిట్లను గ్రౌండింగ్ చేసి లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చనున్నారు. కొడంగల్ నియోజకవర్గంలో కొడంగల్, బొంరాస్‌పేట, దౌల్తాబాద్ నియోజకవర్గ పరిధి నారాయణపేట జిల్లాలోని కోస్గి, మద్దూర్ ఐదు మండలాలకు సంబంధించి మొదటి విడుతగా 100మందికి లబ్ధి చేకూరుతుంది. విడుతలవారీగా నియోజవర్గంలోని దళిత లబ్ధిదారులకు ప్రయోజనం కలుగుతుందని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి నమస్తే తెలంగాణ ప్రత్యేక ఇంటర్యూలో వివరించారు.
ఆర్థికంగా వెనుకబడ్డ దళితులను అన్నింటా ముం దంజలో నడిపించేందుకు సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని రూపొందించారు. రానున్న రోజుల్లో దళితుల్లో పేద కుటుంబాలు లేకుండా చేయడమే లక్ష్యంగా దళిత బంధు ముందుకు సాగనుంది. మొదటి విడుతగా నియోజకవర్గంలో ప్రస్తుతం 100 మంది లబ్ధిదారుల ఎంపిక కొనసాగుతున్నది. ఆర్థికంగా వెనుకబడిన, విద్యావంతులు, నిరుద్యోగులు, వ్యవసాయం, కార్మికులు, టెక్నికల్ రంగం వంటి వారిని గుర్తించి పారదర్శకంగా పథకాన్ని అమలు చేసేందుకు కృషి చేస్తున్నాం.
యూనిట్ ఎంపికలో లబ్ధిదారులకు ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛను కల్పించింది. లబ్ధిదారుల్లో ఏర్పడే సందేహాలను అధికారులు నివృత్తి చేస్తున్నారు. యూనిట్లపై అవగాహన కల్పిస్తున్నారు. మండల, జిల్లాస్థాయి అధికారుల పర్యవేక్షణ నిరంతరం ఉంటుంది. వ్యవసాయ అనుబంధ పరిశ్రమ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, డ్రైవింగ్ లాంటి ప్రభుత్వం ఎంపిక చేసిన యూనిట్లను ఎంపిక చేసుకోవచ్చు లేదా లబ్ధిదారుడికి అనుగుణంగా ఉండే యూనిట్‌ను ఎంచుకోవచ్చు.
నియోజకవర్గంలోని 5 మండలాల్లో రెండు మున్సిపాలిటీలున్నాయి. వంద యూనిట్లలో మున్సిపాలిటీల్లో 10 యూనిట్లు, మిగతావి ఆయా మండలాలను ఎంపిక చేసి యూనిట్లను విభజించాం. వంద యూనిట్లు పూర్తయిన తరువాత దశలవారీగా అందరికీ పథకం వర్తించనుంది.
కేసీఆర్ అమలు చేస్తున్న ప్రతి పథకం చరిత్రలో నిలిచిపోతుంది. ఏ రాష్ట్రంలోనూ అమలులోలేని వినూత్న, ప్రజా ప్రయోజనాలకు అవసరమయ్యే పథకాలను తెలంగాణ ప్రజలకు అందిస్తున్నారు. దళిత బంధు పథకం దేశానికి రోల్‌మోడల్‌గా నిలుస్తుంది. దూరదృష్టితో దళితుల్లో ఆర్థిక సమస్యలను తొలగించి వారికి నూతన జీవితాన్ని అందిస్తున్నారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆర్థికంగా వెనుకబడ్డ వారికి ప్రథమంగా ప్రాధాన్యత కల్పిస్తూ లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది. నియోజకవర్గానికి కేటాయించిన 100 యూనిట్లకు ఆయా మండలాలను ఎంచుకొని లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నాం. ఈ నెల మొదటి వారంలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి కానుంది. ఎంపికైన లబ్ధిదారులకు మార్చి చివరి లోగా యూనిట్ల కేటాయింపు ఉంటుంది.
దళిత బంధు పథకంతో లబ్ధిదారుడు తాను ఎంచుకున్న యూనిట్ల ద్వారా చేసే వ్యాపారంలో ఏదైనా నష్టం వస్తే ఆపత్కాలంలో ఆదుకునేలా రక్షణ నిధి ఏర్పాటు చేస్తున్నారు. ఈ పథకం ద్వారా లబ్ధిదారులకిచ్చే రూ.10లక్షల నుంచి రూ.10వేలను రక్షణ నిధికి కేటాయిస్తారు. భవిష్యత్తులో రక్షణ నిధే వారికుటుంబాలకు భరోసాగా నిలుస్తుంది.
గతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా కొంతమేర రాయితీ రుణ సదుపాయాన్ని పొందేవారు. బ్యాంకులు, అధికారుల చుట్టూ తిరిగి ఆర్థికంగా, వ్యయప్రయాసలకు గురై లబ్ధిపొందాల్సి వచ్చేది. రుణానికి ప్రభుత్వం రాయితీ అందించినప్పటికీ బ్యాంకు అందించిన రుణాన్ని చెల్లించలేక అష్టకష్టాలను ఎదుర్కొని అధిక వడ్డీలు కట్టి ఆర్థికంగా నష్టపోవాల్సి వచ్చేది. నేడు ఆ పరిస్థితికి భిన్నంగా ముందస్తుగానే కుటుంబ సర్వే నిర్వహించి లబ్ధిదారులను గుర్తించారు. పూర్తి సబ్సిడీతో ఏకంగా రూ.10లక్షలు అందుకునే సదవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది.